Adimulapu Suresh: తూచ్‌ ఆ మాటలు నేను అనలేదు.. భాస్కరరెడ్డి అరెస్ట్‌పై మాటమార్చిన మంత్రి

వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేయడంపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు.

Updated : 17 Apr 2023 10:36 IST

ఒంగోలు, న్యూస్‌టుడే: వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేయడంపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని తొలుత పేర్కొన్న మంత్రి.. కొద్దిసేపటి తర్వాత తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కొట్టిపారేశారు. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమంపై ఒంగోలులోని వైకాపా జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి మంత్రి సురేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి అరెస్టు విషయంలో మీ స్పందన ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

మంత్రి స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతోందని, ఈ కేసులో సీబీఐ దర్యాప్తును కోరిందే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. విలేకరులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండానే ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి వ్యాఖ్యలు మీడియాలో ప్రసారమయ్యాయి. తన వ్యాఖ్యలు పార్టీ లైనుకు భిన్నంగా ఉన్నాయని గుర్తించారో ఏమో.. మంత్రి తన క్యాంపు కార్యాలయానికి కొందరు మీడియా ప్రతినిధులను ఆహ్వానించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేయడం బాధాకరమని అన్నారు. భాస్కరరెడ్డి వంటి అమాయకులను అరెస్టు చేయడం సరికాదని, తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని