Sajjala: అవినాష్‌ ఎన్నాళ్లు తప్పించుకు తిరగ్గలరు?: సజ్జల రామకృష్ణారెడ్డి

‘అరెస్టు నుంచి తప్పించుకునేందుకే అవినాష్‌ తన తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపించారంటూ ప్రచారం చేస్తున్నారు... సీబీఐ పట్టుదలగా ఉంటే ఇలాంటి కారణాలతో ఆయన ఎన్నాళ్లు తప్పించుకు తిరగ్గలరు?’ అని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Updated : 20 May 2023 10:51 IST

సునీత తెదేపాతో కలిసి కుట్రల్లో భాగస్వామి కావడం దురదృష్టకరం
అవినాష్‌ వెనుక వెళ్లిన మీడియాపై దాడిని ఖండిస్తున్నాం

ఈనాడు, అమరావతి: ‘అరెస్టు నుంచి తప్పించుకునేందుకే అవినాష్‌ తన తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపించారంటూ ప్రచారం చేస్తున్నారు... సీబీఐ పట్టుదలగా ఉంటే ఇలాంటి కారణాలతో ఆయన ఎన్నాళ్లు తప్పించుకు తిరగ్గలరు?’ అని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయాలనుకుంటే పిలిపించుకుని కూర్చోబెట్టే చేయాలా? అన్యాయంగా అరెస్టు చేస్తే మాత్రం, అలా ఎలా చేస్తారని మేం అడుగుతాం’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. బెయిల్‌ వచ్చేవరకూ సీబీఐ ముందుకు వెళ్లకుండా ఉండేందుకే అవినాష్‌ తన తల్లి ఆరోగ్యం గురించి చెబుతున్నారా అని విలేకరులు అడగ్గా.. సజ్జల స్పందిస్తూ.. ‘అలాంటి ఉద్దేశంతో తల్లికి అనారోగ్యమని క్రియేట్‌ చేసేంత చండాలమైన పరిస్థితిలో ఎంపీ లేరు. పైరవీలు చేసుకుని, లేనివి ఏవో సృష్టించుకుని తప్పించుకోవాలనే మనస్తత్వం ఉన్న కుటుంబాలు కావు వారివి. అవినాష్‌ కూడా అలాంటి వ్యక్తి కాదు. సీబీఐ ముందుకు వెళ్లేందుకే శుక్రవారం హైదరాబాద్‌ వెళ్లారు. అనుకోకుండా వాళ్ల అమ్మకు సీరియస్‌గా ఉందని తెలిసి.. తిరిగి వెళ్లిపోయారు. ఇప్పటికి 5 సార్లు సీబీఐ ముందుకు అవినాష్‌ వెళ్లారు. మళ్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కాకపోతే రేపైనా వెళతారు. వాళ్లేమైనా తీవ్ర చర్యలకు దిగితే దాన్ని ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉన్నారు. సీబీఐ తన అఫిడవిట్లలో అవినాష్‌ నిందితుడని విపరీత ఆరోపణలు చేస్తోంది. అందువల్లే సహేతుక కారణాలతోనే అవినాష్‌ ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు’ అని పేర్కొన్నారు.

నరికానంటున్నోడు బయట సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నాడు: ‘నేను వివేకాను నరికాను అంటున్న వ్యక్తి బయట తిరుగుతూ ప్రెస్‌మీట్లు పెడుతున్నాడు, సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు. ఆటో నడుపుకొనే అతను కార్లలో తిరుగుతున్నాడు, అప్రూవర్‌గా మారాడంటూ అతనికి ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. మరోవైపు బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి, పైగా విచారణకు పూర్తిగా సహకరిస్తున్న అవినాష్‌ను మాత్రం వేధిస్తున్నారు. వివేకా హత్యకేసులో అవినాష్‌ పాత్ర ఉంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వదిలిపెట్టేవారా? సంబంధం లేనివాటిని తీసుకువచ్చి అభూత కల్పనలతో తెదేపా లాంటి శక్తులు ప్రచారం చేస్తున్నాయి. వైఎస్‌ కుటుంబసభ్యురాలైన సునీత వారితోనే కలిసి ఈ మంత్రాంగం నడపడం, కుట్రల్లో భాగస్వామి కావడం మా దురదృష్టం’ అన్నారు. మీడియాపై దాడికి మద్దతిస్తారా అని విలేకరులు అడగ్గా సజ్జల సమాధానమిస్తూ.. ‘ఎలా మద్దతిస్తాం? అది అత్యంత దురదృష్టకరం. అది అవినాష్‌కు తెలిసి ఉంటుందని అనుకోను. పూర్తిగా ఖండిస్తున్నాం. కానీ, పదేళ్ల నుంచి కనిపించకుండా పోయి ఇప్పుడు హఠాత్తుగా బయటకు వచ్చాడన్నట్లుగా అవినాష్‌ వెనుక మీడియా వెళ్లి హడావుడి చేయడమెందుకు? నాయకుడు అన్నాక అభిమానులు ఉంటారు, వారంతా సంయమనంతో ఉండలేరు కదా? అలాంటి పరిస్థితిని తీసుకురావడం సరికాదు కదా’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని