Peddireddy: మాట తప్పిన మంత్రి పెద్దిరెడ్డి.. 13 ఏళ్లుగా రైతుల అవస్థలు

అదో సామ్రాజ్యం.. అక్కడంతా ‘పెద్దాయన’దే రాజ్యం. ప్రభుత్వం పరిహారం చెల్లించకుండానే నిర్వాసిత రైతుల భూముల్లో ఆ పెద్దాయన కుటుంబీకులకు చెందిన నిర్మాణ సంస్థ ప్రాజెక్టు కట్టేస్తుంది.

Updated : 22 May 2023 08:32 IST

నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే చల్లంపల్లె ప్రాజెక్టు నిర్మాణం
పెద్దాయన రాజ్యంలో సామాన్యులే సమిధలు
ప్రాజెక్టు గుత్తేదారు ఆయన కుటుంబ సంస్థే

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు - ఈనాడు, అమరావతి: అదో సామ్రాజ్యం.. అక్కడంతా ‘పెద్దాయన’దే రాజ్యం. ప్రభుత్వం పరిహారం చెల్లించకుండానే నిర్వాసిత రైతుల భూముల్లో ఆ పెద్దాయన కుటుంబీకులకు చెందిన నిర్మాణ సంస్థ ప్రాజెక్టు కట్టేస్తుంది. ప్రభుత్వం నుంచి బిల్లులూ తీసేసుకుంటుంది. సంవత్సరాలు గడిచిపోతుంటాయి. భూములిచ్చిన రైతులకు మాత్రం ఒక్క రూపాయీ పరిహారం అందదు. అయినా జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డునపడ్డ వారు తమ బతుకెలా అని అడగకూడదు. ‘గిల్లితే గిల్లించుకోవాలి.. అరవకూడదు’ అని పోకిరి సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ అన్నట్టుగా.. ఈ పెద్దాయన సామ్రాజ్యంలో ‘మీ భూములు ఇచ్చేయండి.. పరిహారం తర్వాత ఇప్పిస్తా అంటే ఇచ్చేయాలి. అంతే తప్ప పరిహారం ఎంతిస్తారు? ఎప్పుడిస్తారు? అని ప్రశ్నించకూడదు. పరిహారం చెల్లించాకే పనులు మొదలుపెట్టండి అని అభ్యంతర పెట్టకూడదు. ఎదురు తిరిగి మాట్లాడితే.. తర్వాత ఏం జరుగుతుందో వారికి బాగా తెలుసు. అందుకే వారెవరూ కిక్కురుమనరు. ఆ సామ్రాజ్యం చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం. ఆ ‘పెద్దాయన’ వైకాపా ప్రభుత్వంలో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి!

పరిహారం ఇప్పిస్తామని మాటిచ్చి.. 

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల, ఎర్రావారిపాలెం మండలాల సరిహద్దులో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో 2009 కంటే ముందు చల్లంపల్లె ప్రాజెక్టు మంజూరైంది. అప్పట్లో పీలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆ ప్రాంతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే ఎమ్మెల్యే. ఆయన కుటుంబీకులకు చెందిన పీఎల్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్సే ఆ ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. ఆ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 60 మంది రైతుల నుంచి 100 ఎకరాల భూమి సేకరించింది. కానీ నిర్వాసితులకు పరిహారం చెల్లించలేదు. పరిహారం ఇవ్వకుండా పనులెలా మొదలుపెడతారని అడ్డుకోగా.. ‘ముందు పనులు పూర్తి చేయనివ్వండి. పరిహారం ఇప్పించే బాధ్యత నాది’ అని అప్పట్లో పెద్దిరెడ్డి హామీ ఇచ్చినట్లు రైతులు చెబుతున్నారు. తర్వాత పీఎల్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రాజెక్టు కట్టేసింది. వాటికి బిల్లులూ తీసేసుకుంది. అది జరిగి పదమూడేళ్లవుతున్నా రైతులకు నేటికీ పైసా పరిహారం అందలేదు. వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు అవతలి వైపునా పొలాలున్నాయి. అక్కడికి వెళ్లి సాగు చేసే దారి, వీలులేక రైతులు వాటిని బీడుగా వదిలేశారు. అటు వైపు వెళ్లేందుకు ఒక కల్వర్టయినా నిర్మించాలని కోరుతున్నా పట్టించుకునేవారే లేరు. 2011లో పరిహారం కోసం రూ. 3.36 కోట్లు మంజూరయ్యాయని, అవి ఏమయ్యాయో తెలియడం లేదని కొందరు రైతులు వాపోతున్నారు.

ఆయన ఒక్క ఫోన్‌ చేస్తే చాలు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2009 నుంచి కొన్నాళ్లు వైఎస్‌, రోశయ్య మంత్రివర్గాల్లో పనిచేశారు. అయినా చల్లంపల్లె నిర్వాసితులకు పరిహారం ఇప్పిస్తానన్న హామీని నెరవేర్చలేదు. 2019లో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో పెద్దిరెడ్డే నంబరు-2. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారని పేరు. ఆయన తలచుకుంటే ఒక్క ఫోన్‌కాల్‌తో చల్లంపల్లె నిర్వాసితులకు పరిహారం మంజూరు చేయించొచ్చు. వారికి చెల్లించాల్సిన మొత్తం కూడా వడ్డీతో కలిపినా రూ.8 కోట్లలోపే ఉంటుందని అంచనా. అయినా నిర్వాసితులకు న్యాయం చేయట్లేదు. 


మా పిల్లలు చెప్పుల దుకాణాల్లో పనిచేస్తున్నారు

- నాగేశ్వరనాయుడు, నిర్వాసిత రైతు

చల్లంపల్లె ప్రాజెక్టు నిర్మాణంలో 2.13 ఎకరాల భూమి కోల్పోయా. పెద్దిరెడ్డి మా ఎమ్మెల్యేనే కదా.. డబ్బులు ఇప్పించేస్తారని నమ్మి భూములిచ్చేశాం. ఇప్పటికీ పరిహారం రాలేదు. జీవనాధారం పోయింది. పిల్లల్ని చదివించుకోలేకపోయాను. వారిప్పుడు చెప్పుల దుకాణాల్లో పనిచేసుకుని బతుకుతున్నారు.


జీవితం తలకిందులైపోయింది

- వెంకటరమణ నాయుడు, నిర్వాసిత రైతు

నా భూమిలోనే చల్లంపల్లె ప్రాజెక్టుకు పునాది వేశారు. నా 13 ఎకరాల భూమి, 300 మామిడి చెట్లు, 10 కొబ్బరి చెట్లు ప్రాజెక్టులో మునిగిపోయాయి. పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులు చేపట్టొద్దని అప్పుడే మేం గట్టిగా చెప్పుంటే మా జీవితం ఇలా తలకిందులైపోయేది కాదు. ఇప్పటికైనా పరిహారం ఇప్పించాలి.


అంతా వలసెళ్లిపోయారు..

- నాగయ్య నాయుడు, నిర్వాసిత రైతు, గానుగచింత

మా భూముల్లో ప్రాజెక్టు కట్టొద్దన్నాం. పరిహారం ఇప్పిస్తానని, భయపడొద్దని అప్పటి ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఇప్పటికీ ఒక్క రూపాయి అందలేదు. భూములు కోల్పోయిన వారంతా బతుకుదెరువు కోసం వలస పోయారు. ఏ దిక్కూలేనివాళ్లమే ఇక్కడ బతుకుతున్నాం.


పరిహారం అందాల్సిన రైతులు కొందరే

- విజయకుమార్‌రెడ్డి, జలవనరుల శాఖ, ఎస్‌ఈ

చల్లంపల్లె ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కొందరు రైతులకు మాత్రమే పరిహారం అందాల్సి ఉంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. వచ్చిన వెంటనే అందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని