Viveka Murder Case: కొత్త థియరీలతో అవినాష్‌ మైండ్‌గేమ్‌

మాజీ మంత్రి వివేకా హత్య గురించి ఏపీ ముఖ్యమంత్రికి ముందే తెలుసని సీబీఐ వెల్లడించిందని, అది ఎలా అన్నది కూడా సీబీఐ చెప్పాల్సి ఉందని సునీత తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.

Updated : 27 May 2023 14:11 IST

అనుచరులతో అరెస్టును అడ్డుకున్నారు
జగన్‌కు సమాచారంపై సీబీఐ తేల్చాలి
సునీత తరఫు న్యాయవాది వాదన
మూడేళ్లుగా లేని హడావుడి ఇప్పుడెందుకన్న అవినాష్‌ తరఫు న్యాయవాది
అవినాష్‌ ముందస్తు బెయిలుపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు
విచారణ నేటికి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య గురించి ఏపీ ముఖ్యమంత్రికి ముందే తెలుసని సీబీఐ వెల్లడించిందని, అది ఎలా అన్నది కూడా సీబీఐ చెప్పాల్సి ఉందని సునీత తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి దర్యాప్తునకు సహకరించకుండా కొత్త థియరీలతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని వెల్లడించారు. ఆయనేమీ నోరులేని వాడు కాదని శక్తిమంతమైన రాజకీయ నేత అని, ఇదే విషయాన్ని రెండు రోజులుగా కర్నూలులో జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకోడానికి ఆయన అనుచరులు కార్పెట్‌లతో రోడ్డుకు అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేయడాన్నిబట్టి తెలుసుకోవచ్చన్నారు. రోగులు వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు.శుక్రవారం ఉదయం 10.50గంటలకు ప్రారంభమైన వాదనలు సాయంత్రం 6గంటల వరకూ సాగాయి. సునీతారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ వివేకా హత్యకు సంబంధించి ఇప్పుడు కొత్త థియరీలు చెబుతున్నారన్నారు.

వివేకా హత్యకు వజ్రాల వ్యాపారం, కక్షలు, శృంగారం లాంటి కారణాలున్నాయన్న థియరీలు చెబుతున్నారన్నారు. నోటీసులు ఇస్తే పలు కారణాలు చెబుతూ విచారణకు సహకరించకుండా ఇప్పుడు ఇంత కాలం ఎందుకు అరెస్టు చేయలేదని ఎదురు ప్రశ్నిస్తున్నారన్నారు. ఎప్పుడు అరెస్టు చేయాలన్నది దర్యాప్తు సంస్థ విచక్షణాధికారం పై ఆధారపడి ఉంటుందన్నారు. గతంలో అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై రికార్డులను పరిశీలించిన హైకోర్టు కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిందని తెలిపారు. వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు అవినాష్‌రెడ్డి ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించారని వివరించారు. అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు సంఘటనా స్థలంలో ఉన్నారని సాక్షులు వెల్లడించారన్నారు. అనుమానాలను అనుసంధానిస్తూ సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోందన్నారు. వివేకా హత్య గురించి 2019 మార్చి 15న తెల్లవారు జామున 1.53 గంటలకే అవినాష్‌రెడ్డికి తెలుసన్నారు. ఉదయం 4.11 గంటల ప్రాంతంలో కూడా వాట్సప్‌లో ఉన్నారని, అయితే జమ్మలమడుగు వెళుతూ చిన్నాన్న హత్య గురించి తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చినట్లు మొసలి కన్నీరు కారుస్తున్నారని అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.


దర్యాప్తు లోపభూయిష్టం
- అవినాష్‌ తరఫు న్యాయవాది

అంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది ఇ.ఉమామహేశ్వరరావు వాదనలు వినిపిస్తూ సీబీఐ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందంటూ పలు అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హత్య అనంతరం పోలీసులు, సిట్‌ దర్యాప్తు అంశాలకు చెందిన కేసు డైరీని మూడేళ్లయినా కోర్టుకు సమర్పించలేదన్నారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేవలం కౌంటరులోని అంశాల ఆధారంగా నిందితుడని ముద్ర వేస్తున్నారన్నారు.  హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి లభించిన రక్షణ గత నెల 26న సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రద్దయిపోయిందని, అప్పటి నుంచి ఈ  నెల 15 వరకు (21 రోజులు) విచారణకు పిలవలేదన్నారు. ప్రస్తుతం ఆయన తల్లి అనారోగ్యంతో ఉన్నపుడే ఈ హడావుడి ఎందుకన్నారు. సాక్ష్యాధారాలను చెరిపేశారన్న ఆరోపణలపై పిటిషనర్‌ తండ్రి వై.ఎస్‌.భాస్కరరెడ్డిని అరెస్ట్‌ చేశారని, అవే ఆరోపణలతో అవినాష్‌రెడ్డిని నిందితుడిగా చేస్తున్నారన్నారు. రక్తపు మరకలను శుభ్రం చేస్తున్న సమయంలో అవినాష్‌రెడ్డి పడక గదిలో లేరని, బయట వరండాలో తిరుగుతున్నట్లు సీబీఐ స్వయంగా తన కౌంటరులోనే పేర్కొందన్నారు.

రక్తపు మరకలను శుభ్రం చేసిన పనిమనుషులు కూడా అవినాష్‌రెడ్డి పేరు వెల్లడించలేదన్నారు. గుండెపోటు కారణంగా వివేకా చనిపోయినట్లు అవినాష్‌ చెప్పారని ఏ ఒక్కరూ వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. ఈ కేసులో హత్యలో పాల్గొన్న నిందితులను అరెస్ట్‌ చేసిందని, అయితే దస్తగిరిని మాత్రం అదుపులోకి తీసుకోకపోగా ముందస్తు బెయిలునూ వ్యతిరేకించకుండా.. క్షమాభిక్ష ప్రసాదించాలని సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసిందన్నారు. నిందితుడిగా ఉన్న వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించకముందే సాక్షిగా పేర్కొంటూ అభియోగ పత్రం దాఖలు చేసిందన్నారు. అలాగే ప్రస్తుతం అవినాష్‌రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని పేర్కొందని, కస్టడీకి ఇవ్వాలో వద్దో కోర్టు నిర్ణయించకుండానే సీబీఐ అన్నీ చెబుతోందన్నారు. హత్యలో పాల్గొన్న వ్యక్తి గురించి తెలిసిన వెంటనే అదుపులోకి తీసుకోకపోగా విచారణ పేరుతో అనుకూలంగా వ్యవహరించారన్నారు.

సీబీఐ పెంపుడు జంతువు (పెట్‌) అయిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం తప్ప అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. హత్యలో పాల్గొన్న నలుగురికీ ఒక్కో కారణం ఉందని, బెంగళూరు ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌కు సంబంధించిన రూ.8 కోట్లలో వాటా ఇవ్వలేదని గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌ తల్లి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి భార్యతో సంబంధాలు, దస్తగిరిని ఉద్యోగం నుంచి తొలగించినందుకు కక్షలు ఉన్నాయని తెలిపారు. వివేకా హత్య నిమిత్తం గంగిరెడ్డి రూ.కోటి ఇచ్చారంటూ సునీల్‌ యాదవ్‌ అందులో రూ.25 లక్షలు తీసుకుని రూ.75 లక్షలు దస్తగిరికి ఇచ్చారన్నారు. రూ.75 లక్షల్లో కొంత మొత్తాన్ని మున్నా అనే వ్యక్తి వద్ద దాచినట్లు తేలిందని, మిగిలిన మొత్తం ఎక్కడ ఉందన్న విషయాన్ని సీబీఐ పట్టించుకోలేదన్నారు. సాక్షులను బెదిరించినట్లు చెబుతోందని, ఎవరిని బెదిరించారో చెప్పడంలేదన్నారు. సీబీఐ వాదనలు వినేందుకు కోర్టు విచారణను శనివారానికి వాయిదా వేసింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని