TDR Bonds: తాడేపల్లిగూడెంలో టీడీఆర్‌ గోల్‌మాల్‌

తాడేపల్లిగూడెం పురపాలికలో టీడీఆర్‌ బాండ్ల విషయంలో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఓ అధికార పార్టీ నేతతో అధికారులు కుమ్మక్కై స్థలాలు స్వాధీనం చేసుకోకుండానే బాండ్లు అప్పగించేశారు.

Updated : 10 Jul 2023 12:27 IST

స్థలాలు స్వాధీనం చేసుకోకుండానే బాండ్ల అందజేత
చక్రం తిప్పిన వైకాపా నేత

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం అర్బన్‌: తాడేపల్లిగూడెం పురపాలికలో టీడీఆర్‌ బాండ్ల విషయంలో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఓ అధికార పార్టీ నేతతో అధికారులు కుమ్మక్కై స్థలాలు స్వాధీనం చేసుకోకుండానే బాండ్లు అప్పగించేశారు. బృహత్‌ ప్రణాళిక ప్రకారం.. తాడేపల్లిగూడెం పట్టణంలోని కోడేరు-నల్లజర్ల రహదారి వెడల్పు 100 అడుగులు ఉండాల్సి ఉండగా, 80 అడుగులే ఉంది. దీంతో విస్తరణ కోసం అధికారులు రహదారి పక్కన భూమి ఉన్న తొమ్మిది మంది నుంచి రూ.18 కోట్ల విలువైన దాదాపు 3 వేల చ.మీ. స్థలాన్ని సేకరించారు. నిబంధనల ప్రకారం ఆయా స్థలాలు స్వాధీనం చేసుకున్న తర్వాతే వారికి బాండ్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ తీసుకున్న స్థలాల ధరకు నాలుగు రెట్లు అదనపు విలువైన బాండ్లు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఆయా స్థలాలను మాత్రం స్వాధీనం చేసుకోలేదు. ఈ రోడ్డులో ఓ మిఠాయి దుకాణదారు నుంచి 75 చ.మీ. స్థలాన్ని తీసుకున్నారు. ఆయనకు టీడీఆర్‌ బాండ్లు ఇచ్చేశారు. అనంతరం ఆ దుకాణాన్ని తొలగించి స్వాధీనం చేసుకోవాల్సి ఉన్నా.. అదికారులు అదేమీ చేయకపోవడంతో వారు యథావిధిగా వ్యాపారం చేసుకుంటున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకుడికి చెందిన 261 చ.మీ. స్థలాన్ని విస్తరణ నిమిత్తం తీసుకున్నారు. ఆయనకు కూడా బాండ్లు ముట్టజెప్పారు.

ఇక్కడ ఉన్న సినిమా థియేటర్‌ ప్రహరీ రహదారిని ఆనుకుని ఉన్నా, ఆ గోడకు చిన్న గీత కూడా పడలేదు. వాటిలాగే మిగిలిన స్థలాల్లోని నిర్మాణాలనూ అధికారులు తొలగించలేదు. ఈ వ్యవహారమంతా ఓ సీనియర్‌ వైకాపా నేత కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. రహదారి విస్తరణకు స్థలాలు సేకరించినా.. మీకు నష్టం లేకుండా నేను చూసుకుంటానని, ఆయా స్థలాల ధరకు నాలుగు రెట్లు విలువైన టీడీఆర్‌ బాండ్లు ఇప్పిస్తానని యజమానులకు సదరు నేత భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఇదంతా చేసినందుకు వారికి బాండ్ల ద్వారా వచ్చిన మొత్తంలో సగం, మరికొందరి వద్ద 30, 40, 60 శాతం కమీషన్‌గా వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థలాలిచ్చిన తొమ్మిది మందిలో కొందరు ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకుని ముందుగానే సెట్‌ బ్యాక్స్‌ కూడా వదిలారు. అలా వదిలిన స్థలమే రహదారి విస్తరణకు సరిపోతుంది. కానీ వారికి కూడా బాండ్లు ఇచ్చారంటే ఆ నేత ఏ స్థాయిలో అధికారులను నడిపించారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై కలెక్టర్‌ పి.ప్రశాంతిని వివరణ కోరగా ‘స్థలం స్వాధీనం చేసుకోకుండా బాండ్లు ఇచ్చారన్న అంశం నా దృష్టికి రాలేదు. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కరిస్తాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని