CM Jagan: పోలవరం కట్టేది నేను కాదు.. కేంద్రం

కేంద్రం నిధులిస్తేనే పోలవరం ప్రాజెక్టులో పునరావాస కార్యక్రమం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘పోలవరం నేను కట్టడం లేదు. కేంద్రం కడుతోంది. వారిని ఒప్పించి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను.

Updated : 08 Aug 2023 07:53 IST

ఖర్మ ఏంటంటే.. పునరావాసం వాళ్లతో ముడిపడి ఉంది
అక్కణ్నుంచి నిధులిస్తేనే ముందుకు
2025 ఖరీఫ్‌ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది
గొమ్ముగూడెంలో పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, ఏలూరు, కుక్కునూరు, న్యూస్‌టుడే: కేంద్రం నిధులిస్తేనే పోలవరం ప్రాజెక్టులో పునరావాస కార్యక్రమం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘పోలవరం నేను కట్టడం లేదు. కేంద్రం కడుతోంది. వారిని ఒప్పించి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నేనైతే ముందుగా మీకు పునరావాసం పూర్తిచేశాకే ప్రాజెక్టు కట్టేవాడిని’ అని చెప్పారు. ‘మన ఖర్మ ఏంటంటే.. పునరావాసం అమలు కేంద్ర సహాయంతో ముడిపడి ఉంది.

అందుకే వేగంగా చేయలేకపోతున్నాం’ అని వివరించారు. పోలవరం ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా సోమవారం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం వచ్చిన ఆయన తొలుత గ్రామంలో కాలినడకన తిరుగుతూ బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, వరద బాధిత కుటుంబాలతో ముఖాముఖిలో మాట్లాడారు. ‘2025 ఖరీఫ్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 41.15 మీటర్లలో నీళ్లు నిలబెడతాం. అంతిమంగా ఇదీ షెడ్యూల్‌’ అని జగన్‌ వివరించారు. పునరావాస ప్యాకేజీ రావడం లేదనే వారంతా దీన్ని మనసులో పెట్టుకోవాలని సూచించారు.

కేంద్రం నుంచి రాగానే మీకు ఇస్తాం

‘ఈ నెలాఖరుకల్లా కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందితే మనకు రూ.17 వేల కోట్ల వరకూ నిధులు అందుతాయి. అందులోంచి రూ. 5,200 కోట్లు కేటాయించి 41.15 కాంటూరు స్థాయి నిర్వాసితులకు, లిడార్‌ సర్వే ద్వారా గుర్తించిన మరో 48 గ్రామాలకు కూడా పునరావాసం చూపిస్తాం. ఇదంతా జనవరి కల్లా పూర్తవుతుందని అనుకుంటున్నా. గట్టిగా ఎందుకు చెప్పలేక పోతున్నానంటే కేంద్ర కేబినెట్‌ ఆమోదం నా చేతుల్లో లేదు. అందుకే పూర్తిస్థాయి హామీ ఇవ్వలేకపోతున్నాను’ అని వివరించారు. ‘గత ప్రభుత్వం 3 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం చూపింది. మనం వచ్చాక ఇప్పటికి 12 వేల కుటుంబాలకు చూపాం, ఇంకో 8 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. కేంద్ర సహాయం అందగానే జనవరి కల్లా పునరావాసం పూర్తిచేస్తాం’ అని పేర్కొన్నారు. ‘తరచూ ఆర్‌అండ్‌ఆర్‌ రాలేదు అనేవారు ఇదంతా తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇవిగాక మనం హామీ ఇచ్చిన వ్యక్తిగత ప్యాకేజీ రూ. 10 లక్షలు, గతంలో ఎకరాకు రూ. 1.15 లక్షల చొప్పున ఇచ్చిన పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచడం కూడా జనవరికల్లా పూర్తిచేస్తాం’ అని సీఎం వివరించారు.

ఎకరాకు రూ. 1.45 లక్షల వరకే ఇచ్చారు

సీఎం గ్రామంలో కాలినడకన పర్యటించగా.. పలువురు గ్రామస్థులు తమ సమస్యలను ప్రస్తావించారు. ‘ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలి..ఇప్పటి వరకూ ఎకరానికి రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.45 లక్షల వరకూ ఇచ్చారు. మిగిలిన పరిహారం ఎప్పుడు ఇస్తారు?’ అని ప్రశ్నించారు. ‘18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని పరిహారానికి అర్హులను చేసి సాయం చేయాలి. ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షల సాయంలో కొందరికి రూ. 6.36 లక్షలు మాత్రమే జమ అవుతోంది. మిగిలిన మొత్తం వేగంగా ఇప్పించాలి’ అని కోరారు.

సచివాలయ ఉద్యోగులతో నీళ్ల పంపిణీ

సీఎం పర్యటన నేపథ్యంలో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పదుల సంఖ్యలో సచివాలయ ఉద్యోగులను ప్రజలకు నీళ్లు అందించేందుకు వినియోగించటం చర్చనీయాశమైంది. సచివాలయ పోలీసులను పోలీసుస్టేషన్‌, బందోబస్తు విధులకు వినియోగించబోమని పోలీసు ఉన్నతాధికారులే న్యాయస్థానానికి చెప్పారు. ఇక్కడ సీఎం పర్యటనలో మాత్రం కుక్కునూరు-1, 2తో పాటు వింజరం, తదితర సచివాలయాల్లోని గ్రామ పోలీసులకు మంచినీటి సరఫరా విధులు కేటాయించటం గమనార్హం.

మీడియాపై ఆంక్షల కత్తి

సీఎం పర్యటన నేపథ్యంలో మీడియాపై కఠిన ఆంక్షలు విధించారు. ఏలూరు నుంచి పౌర సంబంధాల అధికారులు మీడియాను తీసుకువచ్చి గొమ్ముగూడెం హెలిప్యాడ్‌ దగ్గర నిర్బంధించారు. ఓ ఇరుకు గుడారంలో కూర్చోబెట్టారు. గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. సీఎం గొమ్ముగూడెం ప్రజలను కలిసే సమయంలోనూ సభా కార్యక్రమంలో రెండు మండలాల బాధితులతో మాట్లాడేటప్పుడు కూడా మీడియాను అనుమతించలేదు. 4 గంటలు ప్రయాణం చేసి వస్తే గుడారంలో కూర్చోబెడాతారా అంటూ కొందరు పెదవి విరిచారు.

 


అంతా సీఎం భజనే

సీఎంతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి వరద బాధితుల పేరుతో వైకాపా అనుచరులు, నేతలకే అవకాశం కల్పించారు. వారంతా సీఎం బాగా పనిచేస్తున్నారంటూ భజన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యల్ని ప్రస్తావించనేలేదు. ‘వరదలు వచ్చినా మాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు’ అని కీర్తించారు. ‘41.15 కాంటూరు స్థాయికి జనవరి నాటికి డబ్బు ఇస్తామన్నారు. సంతోషిస్తున్నాం’ అని పేర్కొన్నారు.


సీఎం పర్యటన.. ఆంక్షల వలయం

సీఎం పర్యటన నేపథ్యంలో కుక్కునూరు మండలం గొమ్ముగూడెం పూర్తిగా పోలీసుల నిర్బంధంలోకి వెళ్లిపోయింది. అనవసర ఆంక్షలతో వరద బాధితులను సైతం ఇక్కట్లు పెట్టారు. సీఎం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సి ఉంది. పోలీసులు ఆదివారం మధ్యాహ్నమే గొమ్ముగూడేం గ్రామాన్ని పూర్తిగా నిర్బంధించారు. సోమవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిపేశారు. గ్రామస్థులను కూడా లోపలికి అనుమతించలేదు. వరదల వల్ల రెండు వారాలుగా స్థానికులు చాలామంది దాచారం పునరావాస శిబిరంలో ఉంటున్నారు. సీఎంను కలిసి సమస్యలు చెబుదామనుకుని కొందరు రాగా, వారిని సీతారామపురం చెరువు సమీపంలోనే ఆపేశారు. కొందరు పొలాల మీద నుంచి దాదాపు 3 కి.మీ. కాలినడకన వెళ్లారు. ఇటు వరద బాధితులను అనుమతించకపోగా, మరోవైపు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని డ్వాక్రా మహిళలను భారీ ఎత్తున పాసులు జారీ చేసి మరీ పంపించారు. వారిని బారికేడ్లకు ఇరువైపులా నిలబెట్టారు. సీఎం వస్తుంటే మమ్మల్నే అనుమతించకపోతే ఎలా అంటూ వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలేరుపాడు మండలం వసంతవాడలో పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్రజలను వెనక్కి పంపించారు.


మధ్యాహ్నం సభ ఉందని.. ఉదయం పరిహారం జమ

కుక్కునూరు, న్యూస్‌టుడే: పరిహారంపై ముఖ్యమంత్రిని పోలవరం నిర్వాసితులు నిలదీస్తారనుకున్నారో, లేక ఎందుకివ్వలేదని సీఎం అధికారులను మందలిస్తారనుకున్నారో కానీ, ఆయన రాకకు కొద్ది గంటల ముందు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెంవాసులకు పునరావాస పరిహారం జమ కావడం విశేషం. మూడేళ్లుగా దీనిపై నిర్వాసితులు ఎన్నోసార్లు వేడుకున్నా పట్టించుకోని యంత్రాంగం.. సోమవారం గ్రామంలో జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో స్పందించింది. గొమ్ముగూడెం గ్రామం 41.15 కాంటూరు పరిధిలో ఉంది. ఈ పరిధిలోని 88 గ్రామాల ప్రజలకు 2022 సెప్టెంబరు ఆఖరుకల్లా పరిహారమిచ్చి ఊళ్లు ఖాళీ చేయిస్తామని సీఎం జగన్‌ గతేడాది వరద ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా హామీ ఇచ్చారు. ఏడాదైనా పరిహారం జమ కాలేదు. తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్న నిర్వాసితులు.. సీఎం వచ్చినపుడు గట్టిగా ప్రశ్నించాలని నిర్ణయానికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గొమ్ముగూడెంలో జగన్‌ కార్యక్రమం ఉండగా, ఉదయం 8 నుంచి గ్రామంలోని 200కు పైగా కుటుంబాలకు పరిహారం జమైంది. 41.15 కాంటూరు పరిధిలోని మిగతా ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం ఎప్పుడు జమవుతుందన్నది ప్రశ్నగానే మిగిలింది. సీఎం వస్తే కాని, పరిహారం ఇవ్వరా అని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని