మార్గదర్శిలో చిట్టీ పాటలకు ఆటంకాలు

మార్గదర్శి చిట్‌ఫండ్‌పై వైకాపా ప్రభుత్వ వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. వ్యాపారం సాగకుండా చేసే కుట్రలో భాగంగా చిట్టీల పాటకు ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ, రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు ఆదివారం నాలుగో రోజూ సోదాలు కొనసాగించారు.

Updated : 21 Aug 2023 11:38 IST

మొత్తం ప్రక్రియను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన తనిఖీ అధికారులు
ఎదురు తిరిగిన చందాదారులు
ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ధ్వజం
మార్గదర్శి తమకు ఎలాంటి ఇబ్బందీ కలిగించట్లేదని స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై వైకాపా ప్రభుత్వ వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. వ్యాపారం సాగకుండా చేసే కుట్రలో భాగంగా చిట్టీల పాటకు ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ, రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు ఆదివారం నాలుగో రోజూ సోదాలు కొనసాగించారు. చిట్టీ పాటను అధికారులు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. పాట పాడేందుకు వచ్చిన చందాదారులు, ఏజెంట్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆక్షన్‌ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించేలా హడావుడి చేశారు. దీంతో చందాదారులు కొన్నిచోట్ల సీఐడీ అధికారులకు ఎదురుతిరిగారు. మార్గదర్శిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సంస్థ తమకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించలేదని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు. చందాదారులను పలు చోట్ల అధికారులు వేధింపులకు గురిచేశారు.

ఏజెంట్లే లక్ష్యంగా ప్రశ్నల వర్షం

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని అయిదు కార్యాలయాల్లో ఆక్షన్‌ ప్రక్రియకు ఆటంకాలు కలిగించేలా అధికారులు హడావుడి చేశారు. చిట్‌ పాడేందుకు వచ్చినవారు, ఏజెంట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. వారి స్టేట్‌మెంట్లు తీసుకుని, వీడియోలు చిత్రీకరించారు. విజయవాడ వన్‌టౌన్‌ మార్గదర్శి శాఖలో అధికారులు ఆక్షన్‌ హాలులోనే ఉండి ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నించారు. దీని వల్ల పాట పాడేందుకు వచ్చిన చందాదారులు, ఏజెంట్లు ఇబ్బందిపడ్డారు. అధికారులు దురుసుగా ప్రవర్తిస్తుండటంతో మార్గదర్శి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై నందిగామకు చెందిన మార్గదర్శి ఏజెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని లబ్బీపేట శాఖలో చిట్‌ పాడేందుకు వచ్చిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. గవర్నర్‌ పేట బ్రాంచిలో సీఐడీ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చిట్‌ వేలంలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యుల ఫొటోలను సెల్‌ఫోన్లలో తీసుకున్నారు. ఏజెంట్లను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. కమీషన్‌  ఎలా ముడుతుంది? ఎన్ని చిట్లలో ఎంత మందిని చేర్పించారని ఆరా తీశారు. వారి స్టేట్‌మెంట్లు నమోదు చేసుకున్నారు. గుడివాడ, మచిలీపట్నంలోని శాఖల్లోనూ వేలం ప్రక్రియను వీడియో తీశారు. చందాదారుల చిరునామాలు, ఫోన్‌ నంబర్లను సేకరించారు. వేలం ముగిసిన తర్వాత వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు.

సంతకం పెట్టాలని ఉద్యోగికి బెదిరింపు

ఒంగోలు మార్గదర్శి శాఖ కార్యాలయంలో అధికారులు ప్రతి ఒక్కరినీ వీడియోలు తీస్తూ ఇబ్బందులకు గురిచేశారు. చందాదారులు ఎవరెవరు వస్తున్నారు? వెళుతున్నారు? అనే విషయాన్ని ఓ అధికారి చేత వీడియోలు, ఫొటోలు తీయించారు. సంతకం పెట్టాలని ఒక ఉద్యోగిని బెదిరించారు.

ఈటీవి ప్రతినిధి మొబైల్‌ లాక్కున్న సీఐడీ అధికారులు

చిత్తూరు శాఖ మేనేజర్‌ పంచనామా పత్రంపై సంతకాలు పెట్టకుండా ఇంటికి ఎలా వెళ్తారని అక్కడున్న మిగతా సిబ్బందిని సీఐడీ అధికారులు గదమాయించారు. దీనిపై ఉన్నతాధికారులకు చిట్స్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు. అనంతరం రాత్రి 7 గంటలకు సీఐడీ అధికారులు మార్గదర్శి కార్యాలయం నుంచి బయలుదేరుతుండగా మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీస్తున్న ఈటీవీ ప్రతినిధి ఫోన్‌ను సీఐడీ అధికారులు లాక్కున్నారు. ఆ ఫోన్‌లోని మొత్తం డేటాను రికవరీ చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. ఈనాడు, ఈటీవీ ప్రతినిధులు అదేమని గట్టిగా ప్రశ్నించడంతో మొబైల్‌ ఫోన్‌ ఇచ్చి వెళ్లిపోయారు.

చందాదారులపై గంటపాటు ప్రశ్నల వర్షం

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 5 కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగాయి. గుంటూరు అరండల్‌పేట, మార్కెట్‌ సెంటర్‌ కార్యాలయాల్లో చిట్టీ పాటలను అధికారులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. తెనాలి కార్యాలయానికి వచ్చిన చందాదారులను అధికారులు దాదాపు గంటపాటు రకరకాల ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించారు. నర్సరావుపేటలో చందాదారుల తరఫున చిట్టీపాటలో పాల్గొన్న ఏజెంట్ల నుంచి అధికారులు వాంగ్మూలాలు నమోదు చేశారు. మండపేటలో మేనేజర్‌ కృష్ణారావు మధ్యాహ్నం తర్వాత కార్యాలయానికి రావాలని సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. మార్గదర్శి సిబ్బంది ఫోన్‌ నంబర్లను అధికారులు సేకరించారు. నెల్లూరు జిల్లా వేదాయపాళెం శాఖలో అధికారులు రాసిన పత్రాలపై సంతకాలు చేయాలని ఏజెంట్లను ఒత్తిడి చేశారు.


మార్గదర్శి తమకు ఎలాంటి ఇబ్బంది కలిగించట్లేదని తేల్చి చెప్పిన చందాదారులు

విశాఖ జిల్లా పీఎంపాలెం శాఖలో బెదిరింపు ధోరణితో సీఐడీ అధికారులు ప్రశ్నలు వేయడంతో చందాదారులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తోంది కక్షసాధింపు చర్యలే తప్ప..తమకు మార్గదర్శి సంస్థ ఎలాంటి ఇబ్బందులూ కలిగించడం లేదని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గారు. భీమవరం కార్యాలయంలో మేనేజర్‌ లేకుండా ఆక్షన్‌ ఎలా నిర్వహిస్తారని, దాన్ని ఆపాలని అధికారులు అక్కడి సిబ్బందిని ఆదేశించారు. తాము పాట పాడుకునేందుకు ఎంతో దూరం నుంచి వస్తే....ఆపమనడం ఏంటని చందదారులు ఎదురుతిరగడంతో అధికారులు వెనక్కి తగ్గారు. వేలం పాటను యథావిధిగా కొనసాగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని