స్కిల్‌లో అవినీతి.. సీఎంకు తెలియదని ఎలా అంటారు?

‘‘ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో ఎంత లేదనుకున్నా రూ.250 కోట్ల అవినీతి జరిగింది. సీమెన్స్‌ కంపెనీ పేరు చెప్పి ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నా, ఆ కంపెనీ తమకు సంబంధమే లేదంటోంది.

Updated : 23 Sep 2023 06:42 IST

సీమెన్స్‌ కంపెనీ తనకు సంబంధమే లేదంటోంది
డొల్ల కంపెనీలకు నిధులు తరలించారు
విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది అయిదు రోజులే
శాసనసభ చర్చలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి

ఈనాడు, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో ఎంత లేదనుకున్నా రూ.250 కోట్ల అవినీతి జరిగింది. సీమెన్స్‌ కంపెనీ పేరు చెప్పి ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నా, ఆ కంపెనీ తమకు సంబంధమే లేదంటోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అనేకమంది అరెస్టయ్యారు. మంత్రివర్గం అనుమతి లేకుండా కార్పొరేషన్‌ ఏర్పాటు, జీవోలో ఉన్న అంశాలు లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడం, ఏ రోజు, ఎక్కడ ఆ నిర్ణయాలు తీసుకున్నారో నమోదుచేయకుండా సంతకాలు చేయడం... ఇదంతా అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? అప్పట్లో సీఎస్‌ సైతం ముఖ్యమంత్రితో సమావేశమయ్యాం. ముందు నిధులు ఇవ్వండి, తర్వాత ర్యాటిఫై చేసుకోండి అన్నారని నోట్‌ఫైలులో రాశారు. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రికి సంబంధం లేదని ఎలా అంటారు’’ అని మంత్రి బుగ్గన ప్రశ్నించారు. రాష్ట్ర శాసనసభలో శుక్రవారం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటులో అవినీతి గురించి లఘుచర్చ చేపట్టారు. ఈ చర్చకు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సమాధానం ఇచ్చారు. ఒప్పందాలు, నోట్‌ ఫైళ్లు, అందులో ఎవరెవరు ఏం రాశారు? జీవోలో ఏం ఉంది? ఎంవోయూలో ఏం ఉంది? తదితర అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో చూపిస్తూ మంత్రి ప్రసంగించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే...

డొల్ల కంపెనీలతోనే ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఏర్పాటైన కార్పొరేషన్‌ సీమెన్స్‌, డిజైన్‌టెక్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 90% సీమెన్స్‌ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇస్తుంది. రాష్ట్రప్రభుత్వం 10% నిధులిస్తుంది. సీమెన్స్‌ కంపెనీ తర్వాత తమకు ఈ ఒప్పందంతో సంబంధమే లేదని తేల్చిచెప్పింది. తమ ఎండీ తప్పులు చేశారని ఆయనను తొలగించినట్లు పేర్కొంది. ఆయన ఒప్పందం చేసుకున్నా అది చెల్లుబాటు కాదని కూడా కంపెనీ తెలియజేసింది. అసలు ఇలా 90% గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇచ్చే ప్రాజెక్టేదీ తమ కంపెనీలో లేదని సీమెన్స్‌ తేల్చిచెప్పింది. 2017లో సెబి కొన్ని డొల్ల కంపెనీలను గుర్తించింది. ఆ విషయంపై పుణెలోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీకి వర్తమానం ఇచ్చింది. వారు పరిశోధన చేసి డిజైన్‌టెక్‌, స్కిల్లార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా లిమిటెడ్‌లను డొల్ల కంపెనీలుగా గుర్తించి నోటీసులు ఇచ్చారు. అప్పటికే చంద్రబాబు ఆధ్వర్యంలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ డిజైన్‌టెక్‌తో ఒప్పందం చేసుకుంది’’ అని రాజేంద్రనాథరెడ్డి అన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం అవసరమని అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి అజేయకల్లం పేర్కొన్నా, పైన నోట్‌ రాసి ఉన్నా, కింద ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీవోలో పేర్కొన్న విషయాలకు, ఒప్పందంలో పేర్కొన్న అంశాలకు పొంతన లేదు. 90% గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, 10% రాష్ట్రప్రభుత్వ వాటా అన్న అంశం ఎంవోయూలో ఎందుకు రాయలేదు?’’ అని మంత్రి ప్రశ్నించారు.

గుజరాత్‌ ప్రాజెక్టుతో సంబంధం లేదు

సీమెన్స్‌ కంపెనీ గుజరాత్‌లో ఇలాంటి ప్రాజెక్టు అమలు చేసిందని చెబుతున్నారు. అక్కడి విధానానికి, ఏపీలో విధానానికి సంబంధమే లేదు. గుజరాత్‌లో సౌమ్యేంద్రబోస్‌ అన్న పేరుతో సీమెన్స్‌ ఎండీగా ఒప్పందంపై సంతకం చేశారు. ఇక్కడ సుమన్‌బోస్‌ పేరుతో సంతకం చేశారు. సీమెన్స్‌ కంపెనీ తరఫునే ఒప్పందం చేసుకుంటే ఇన్ని తేడాలు ఎందుకు ఉంటాయి? గుజరాత్‌లో సీమెన్స్‌ కంపెనీ సీఎస్‌ఆర్‌ కింద ఉచితంగా రూ.17 కోట్లు ఇచ్చింది. ఏపీలో జరిగిన ఒప్పందంలో రెండోపేజీలో తేదీ లేదు, పేజీ 6లో డి పాయింటులో ఈ నిధులు మంజూరుచేస్తున్నాం అని పేర్కొన్నా... అందులో లెటర్‌ నెంబరు లేదు, తేదీ లేదు. ఆఖరి పేజీలో కూడా తేదీ లేదు, ఎక్కడో లేదు... దీనికి సాక్షులు ఎవరో కూడా ఖాళీలు వదిలేశారు. మరి తెదేపా నాయకులు అనవసరంగా కేసులు పెట్టామంటారు. ఈడీ, సెబి, జీఎస్టీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ కేసులు పెట్టారు. ఆ కేసులు... అదీ 2018లో మన ప్రభుత్వం పెట్టించిందా? డిజైన్‌టెక్‌కు చెందిన కన్విల్కర్‌ను ఈడీ అరెస్టుచేసింది. ఒకవైపు ఒప్పందంలో సీమెన్స్‌ కంపెనీదే బాధ్యత అని ఉంది. అది పోయి డిజైన్‌టెక్‌ వచ్చింది. మళ్లీ ఆ కంపెనీ బదులు స్కిల్లార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వచ్చింది. ఇవి డొల్ల కంపెనీలని తేల్చింది సెబి, ఈడీలే కదా... మా ప్రభుత్వం కాదు కదా?’’ అని బుగ్గన ప్రశ్నించారు.

క్లస్టర్లు ఏర్పాటు చేయకుండానే నిధుల చెల్లింపు

ఈ కార్యక్రమంలో మొత్తం రూ.371.21 కోట్లు 2015 నుంచి 2016 లోపు చెల్లించారు. యూనిట్లను 2018 మార్చి నాటికి ఏర్పాటుచేశారు. డిజైన్‌టెక్‌ స్థానంలో వచ్చిన స్కిల్లార్‌ కంపెనీ ఈ ఎంవోయూ కుదిరిన నెల తర్వాత ఏర్పాటైంది. అంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే చేసినట్లు కాదా. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించింది. రూ.58.90 కోట్లే సీమెన్స్‌ కంపెనీకి వెళ్లింది. సీమెన్స్‌కు పోను మిగిలిన నిధులన్నీ అనేక డొల్ల కంపెనీలకు మళ్లించేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబుకు వివిధ మార్గాల్లో రూ.118.98 కోట్లు చేరినట్లు ఆదాయపు పన్ను విభాగం గుర్తించి నోటీసులు ఇచ్చింది. ఆ వ్యవహారంలో చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్‌, ఆయన సహాయకుడు కిలారు రాజేష్‌ పేర్లు బయటకు వచ్చాయి. ఏయే మార్గాల్లో ఆ నిధులు చంద్రబాబుకు చేరాయని ఐటీ పేర్కొంటూ నోటీసులిచ్చిందో.. అందులో ఉన్న డొల్లకంపెనీలే ఈ వ్యవహారంలోనూ ఉండటం, అవే పేర్లు ఇక్కడా బయటపడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నైపుణ్య శిక్షణలో ఎలాంటి పని చేయకుండానే రూ.241.78 కోట్లు సబ్‌కాంట్రాక్టర్ల పేరుతో డొల్ల కంపెనీలకు చెల్లింపులు చేశారని తేలింది. ఈ ప్రాజెక్టు కింద ఏ శిక్షణ ఎవరికి ఇచ్చారో కూడా అధ్యయనం చేయించాం. ఏ విద్యార్థికీ అయిదు రోజులకు మించి శిక్షణ ఇవ్వలేదు. నిజానికి ఇది డెమో మాత్రమే. సాఫ్ట్‌వేర్‌ శిక్షణ అంటే ఒకో కోర్సులో మూడు నుంచి ఆరు వారాల పాటు ఇవ్వాలి. 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చామంటున్నారు.. వీరు ఇచ్చిన శిక్షణ ఇదేనా? తెలుగుదేశం సభ్యులను ఈ విషయంలో చర్చకు రమ్మన్నా, రాలేదు. కేటాయించాల్సిన సమయం కన్నా ఎక్కువే ఇస్తాం.. ఏం చెప్పినా వింటామని తెలియజేసినా వాళ్లంతట వాళ్లే సభ నుంచి వెళ్లిపోయారు’’ అని బుగ్గన అన్నారు.


పదే పదే సీఎం జగన్‌ మార్గనిర్దేశం!

ఈ చర్చలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి మాట్లాడుతుండగా సీఎం జగన్‌ మధ్యలో పదే పదే ఆపి ఆయనకు సూచనలు ఇవ్వడం కనిపించింది. దీంతో అనేకసార్లు బుగ్గన తన ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చింది. సభలో అధికారస్థానాల్లో ఉన్నవారు కూడా కాగితాలపై ఏవో నోట్‌ చేసి మంత్రి బుగ్గనకు పంపించారు. ఒకానొక దశలో మంత్రి ఆ కాగితాలు పట్టుకువచ్చిన సహాయకుడిపై చిరాకుపడ్డారు. మాట్లాడుతుండగా ఇలా అడ్డుపడితే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ కాగితం చూస్తూ ‘ఈ విషయం చెప్పాను కదా’ అని కూడా వ్యాఖ్యానించారు. ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు