ఎంబీబీఎస్‌ రెండో విడత కౌన్సెలింగ్‌లో అవకతవకలు

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు.

Published : 23 Sep 2023 05:25 IST

ఆరోగ్య వర్సిటీ వద్ద కాంగ్రెస్‌ ఆందోళన
వీసీకి వినతిపత్రం అందజేత

విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. శుక్రవారం విజయవాడలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఉపకులపతికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ కార్యకర్తలను అరెస్టు చేశారని రుద్రరాజు ఆరోపించారు.

అనుమతిపై రగడ...

వినతి పత్రం అందజేస్తామని గురువారమే విశ్వవిద్యాలయం అధికారుల నుంచి కాంగ్రెస్‌ నాయకులు అనుమతి తీసుకున్నారు. శుక్రవారం వారు విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు పోలీసులు నిలువరించారు. కేవలం ఇద్దరినే లోపలికి అనుమతిస్తామని చెప్పడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌, కర్నూలుకు చెందిన మహిళా నేత సుప్రవీణతో పాటు 22 మందిని అదుపులోకి గుణదల స్టేషన్‌కు తరలించారు. వారిని విడుదల చేయాలని రుద్రరాజు తదితర నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి 10 మంది కాంగ్రెస్‌ నాయకులను లోపలికి అనుమతించారు. ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, జీవో 550, 111 అమలు తదితరాల అంశాలపై ఉపకులపతి డాక్టర్‌ బాబ్జీకి వినతి పత్రం అందజేయగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. కాగా కాంగ్రెస్‌ నాయకులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు విశ్వవిద్యాలయం లోపలికి ఎవరినీ అనుమతించలేదు. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో నాయకులు నరసింహారావు, శివాజీ, మేడా సురేష్‌, బొర్రా కిరణ్‌, గుర్నాథం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు