AP News: చెట్టు కింద వైద్యం.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సొంత జిల్లాలో ఇదీ పరిస్థితి

రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం.. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న తండాల్లో ఏ ఒక్కరికి అనారోగ్య సమస్య వచ్చినా.. నాగార్జున సాగర్‌ జలాశయం చెంతన ఉన్న విజయపురిసౌత్‌ కమ్యూనిటీ ఆసుపత్రే పెద్ద దిక్కు.

Updated : 04 Nov 2023 08:29 IST

ఏళ్లుగా నిర్మాణం పూర్తికాని విజయపురి సౌత్‌

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట : రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం.. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న తండాల్లో ఏ ఒక్కరికి అనారోగ్య సమస్య వచ్చినా.. నాగార్జున సాగర్‌ జలాశయం చెంతన ఉన్న విజయపురిసౌత్‌ కమ్యూనిటీ ఆసుపత్రే పెద్ద దిక్కు. ఇక్కడ మాత్రం దాదాపు మూడేళ్లుగా చెట్టు కిందే వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజిని సొంత జిల్లా పల్నాడులోనే ఈ దుస్థితి నెలకొనడం గమనార్హం. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ విజయపురిసౌత్‌లో నడుస్తోంది. పాత భవనం సరిపోవడం లేదని, దాని స్థానంలో కొత్త భవనానికి 2021 జనవరిలో శంకుస్థాపన చేశారు. రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం ప్రారంభించారు. నాబార్డు నిధులతో 30 పడకల భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఏడాదిలోపు అందుబాటులోకి తీసుకురావాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. పనులు మాత్రం మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. వచ్చే నెలలో పూర్తిచేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యే సమీక్షలో గుత్తేదారును మరోమారు ఆదేశించారు. కానీ అక్కడ జరుగుతున్న పనులను చూస్తుంటే ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 40 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

కట్టు కట్టాలన్నా.. బయటే

ప్రస్తుతం సాగర్‌ డ్యాం క్వార్టర్స్‌లో ఆసుపత్రి నడుస్తోంది. వైద్య సిబ్బంది ఆరుబయటే వైద్యం అందిస్తున్నారు. 10 పడకలు చెట్ల కింద వేశారు. రక్తం ఎక్కించడం.. సెలైన్‌ పెట్టడం.. గాయాలతో వచ్చేవారికి డ్రెస్సింగ్‌ చేయడం వంటివన్నీ చెట్ల కిందే చేస్తున్నారు. రోజుకు 150 నుంచి 200 వరకు ఓపీ ఉంటుంది. చెట్ల నీడ ఉండబట్టి సరిపోయింది.. లేకుంటే తమ పరిస్థితి ఎలా ఉండేదో.. అని రోగులు వాపోతున్నారు. కీలకమైన ఫార్మసీ విభాగం కూడా ఆరుబయటే ఉంది. వాన వచ్చిందంటే ఆసుపత్రిని మూయాల్సిన పరిస్థితి. లోపల చిన్న గదిలో సహజ ప్రసవాలు మాత్రమే చేస్తున్నారు. మరో గదిలో వైద్యాధికారి, ఇంకో గదిలో ఎక్స్‌రే, మందుల స్టాక్‌ ఉంచుతున్నారు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అటు వైద్య సిబ్బంది, ఇటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని