Anantapur: ఇంట్లోనే స్కానింగ్‌.. ప్రైవేటుగా అబార్షన్‌

స్కానింగ్‌ యంత్రాల సర్వీసింగ్‌ చేసే ఓ ఘనుడు ఏకంగా అద్దె ఇంట్లో అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడిన వైనమిది.

Updated : 24 Nov 2023 07:47 IST

అర్హత లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు
అనంతపురంలో వెలుగులోకి వచ్చిన దారుణం

ఈనాడు-అమరావతి, అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే: స్కానింగ్‌ యంత్రాల సర్వీసింగ్‌ చేసే ఓ ఘనుడు ఏకంగా అద్దె ఇంట్లో అనధికారికంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుబడిన వైనమిది. గతంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవంతో సునీల్‌కుమార్‌ అనే వ్యక్తి చీరల వ్యాపారం పేరుతో ఇల్లు అద్దెకు తీసుకుని.. అందులో సుమారు రూ.10 లక్షల వ్యయం కలిగిన అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేసి, అర్హతలు లేకున్నా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ దొరికిపోయారు. అనంతపురం రెవెన్యూ కాలనీలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సునీల్‌కుమార్‌ వివిధ ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లతో తనకున్న పూర్వ పరిచయాలతో.. పరీక్షల కోసం అక్కడకు వచ్చే గర్భిణులను మభ్యపెట్టి ఇంటికి తీసుకువెళ్లి స్కానింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ఏడాదిన్నర నుంచి ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు సమాచారం.

ఈయన దందా వెనుక కొంతమంది ప్రైవేట్‌ వైద్యులు, ఆసుపత్రుల హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.7 వేలు మొదలు రూ. 50 వేల వరకు వసూలు చేశారు. సునీల్‌కు కర్నూలుకు చెందిన ఫార్మసిస్టు శ్రావణి సహకరిస్తున్నారు. గత రెండు, మూడు నెలల్లోనే అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన 128 మందికి స్కానింగ్‌ నిర్వహించినట్లు సునీల్‌ వద్ద లభించిన పుస్తకం ద్వారా తేలింది. ఎవరికి స్కానింగ్‌ చేశారో వారి వివరాలు, వారి నుంచి తీసుకున్న మొత్తం గురించి సునీల్‌ ఆ పుస్తకంలో రాసి పెట్టుకున్నారు. కొంతమంది రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించినట్లు అందులో ఉంది. అబార్షన్లు చేయించడానికే ఇంత పెద్ద మొత్తం వసూలుచేసి ఉంటారని, దీనివెనుక పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.


స్కానింగ్‌ మిషన్‌ ఎక్కడిది?

స్కానింగ్‌ మిషన్లను పంపిణీదారులు అర్హత కలిగిన వైద్యులకే విక్రయించాలి. ప్రతినెలా విక్రయాల వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలి. నిందితుడి వద్ద లభించిన స్కానింగ్‌ యంత్రం వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన దానిని ఎక్కడి నుంచి సంపాదించారన్నది తేలాల్సి ఉంది. సంబంధిత సంస్థకు అధికారులు నోటీసు ఇచ్చారు. అవాంఛనీయ అబార్షన్ల దృష్ట్యా లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం ఉంది. వైద్యపరమైన ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే.. అనుమతి ఉన్నవారే వాటిని నిర్వహించాలి. సీనియర్‌ గైనిక్‌ వైద్యులే వాటిని చేయగలరు. అర్హతలు లేని నిందితుడు సునీల్‌ ఎలా చేశారన్నది అంతుచిక్కడంలేదు. ఇక్కడి స్కానింగ్‌ దృశ్యాలను రేడియాలజిస్టుకు పంపి, అక్కడి నుంచి వచ్చిన సమాచారాన్ని గర్భిణులకు తెలియజేస్తున్నారా.. అనేది తేలాల్సి ఉంది. సునీల్‌ గతంలో స్కానింగ్‌ యంత్రాల విక్రయం, సర్వీసింగ్‌ పనులు చేశారు.

అనంతరం అనంతపురంలో ప్రభుత్వ వైద్యురాలు సొంతంగా నిర్వహించిన ప్రైవేట్‌ వైద్యశాలలో గైనకాలజిస్టు వద్ద పనిచేశారు. 99 మందికి అబార్షన్లు చేసినట్లు ఫిర్యాదులు రావటంతో ఆమెను అధికారులు సస్పెండ్‌ చేశారు. తర్వాత సునీల్‌ స్కానింగ్‌ రూపంలో కొత్త అవతారమెత్తారు. కొంతమందికి ప్రైవేట్‌ వైద్యశాలల్లో అబార్షన్లు చేయించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో హిందూపురంలోనూ ఇలాగే ఒక అనధికారిక కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య రంగానికి సంబంధించి అనైతిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంగవైకల్యం లేకున్నా.. ఉన్నట్లు ధ్రువీకరణపత్రాలు జారీచేయడం, ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయకుండా చేసినట్లు ధ్రువీకరిస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. తమిళనాడు, ఏపీ సరిహద్దులోనూ లింగ నిర్ధారణ పరీక్షల విషయంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని