Padma Awards 2024: తెలుగు తేజాలకు పద్మాభిషేకం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవిలను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ వరించింది.

Updated : 26 Jan 2024 05:55 IST

వెంకయ్యనాయుడు, చిరంజీవిలకు పద్మవిభూషణ్‌
ఒకేసారి ఇద్దరు తెలుగువారికి రెండో అత్యున్నత పౌర పురస్కారం
అయిదుగురికి వీటిని ప్రకటించిన కేంద్రం
17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ
132లో తెలుగువారు ఎనిమిది మంది
తెలంగాణ నుంచి అయిదుగురికి పద్మశ్రీలు
హరికథకురాలు ఉమామహేశ్వరికి పద్మశ్రీ
ఈనాడు - దిల్లీ

ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవిలను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ వరించింది. వీరితోపాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్‌ నటీమణి వైజయంతిమాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మాసుబ్రహ్మణ్యంలనూ ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికచేసింది. బిహార్‌కు చెందిన సులభ్‌ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్‌ పాఠక్‌కు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన 132 మందికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవానికి ముందురోజు పద్మ అవార్డులను ప్రకటించడం ఆనవాయితీ. కళ, సామాజికసేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్రసాంకేతికం, ఇంజినీరింగ్‌, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ పౌర పురస్కారాలకు ఎంపికచేసి గౌరవిస్తోంది. అసాధారణమైన విశిష్ట సేవలు చేసినవారికి పద్మవిభూషణ్‌, ఉన్నతస్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్‌, విశిష్ట సేవలు అందించినవారికి పద్మశ్రీ అవార్డులు అందిస్తోంది. వచ్చే మార్చి-ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.

30 మంది మహిళలు..

గురువారం రాత్రి ప్రకటించిన 132 పద్మ పురస్కారాల్లో 5 పద్మవిభూషణ్‌, 17 పద్మభూషణ్‌, 110 పద్మశ్రీలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్‌ ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మభూషణ్‌ లభించింది. అలాగే మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రామ్‌నాయక్‌, కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఒ.రాజగోపాల్‌, ప్రముఖ గాయనీమణి ఉషా ఉధుప్‌, లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్‌ శర్మలకు పద్మభూషణ్‌ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తి, తమిళనాడు నుంచి దివంగత నటుడు విజయ్‌కాంత్‌లకు ఇవే పురస్కారాలు ప్రకటించింది.

ఇంతవరకు ఏపీలో 103, తెలంగాణలో 168 మందికి..

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు రెండు పద్మవిభూషణ్‌లతో పాటు ఒక పద్మశ్రీ (డి.ఉమామహేశ్వరి) లభించాయి. తెలంగాణకు 5 పద్మశ్రీలు దక్కాయి. ఇందులో కళారంగం నుంచి ఎ.వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య; సాహిత్యం, విద్యారంగం నుంచి కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యలు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 103 మందికి, తెలంగాణ నుంచి 168 మందికి పద్మ పురస్కారాలు లభించినట్లయింది. తాజా అవార్డులతో కలిపి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8 మందికి పద్మవిభూషణ్‌, 25 మందికి పద్మభూషణ్‌, 70 మందికి పద్మశ్రీలు దక్కాయి. తెలంగాణ నుంచి ఇప్పటివరకు 14 మందికి పద్మవిభూషణ్‌, 34 మందికి పద్మభూషణ్‌, 120 మందికి పద్మశ్రీలు లభించాయి.

మట్టిలో మాణిక్యాలకు గుర్తింపు

వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకత కనపరుస్తూ పెద్దగా ప్రచారానికి నోచుకోనివారిని కూడా గుర్తించి ‘పద్మశ్రీ’ ప్రదానం చేసే ఆనవాయితీని కేంద్రం కొనసాగించింది. మొత్తం 110 మందిని ఈసారి వీటికి ఎంపిక చేసింది. వీరిలో అస్సాంకు చెందిన పార్వతి బారువా (67) ఒకరు. దేశంలో ఏనుగుల మావటిగా ఉన్న తొలి మహిళ ఆమె. పురుషాధిక్యం ఉండే రంగంలో అడుగిడి తనదైన ప్రత్యేకత సొంతం చేసుకున్నారు. అడవి ఏనుగులను పట్టుకోవడంలో మూడు రాష్ట్రాలకు చేయూత అందించారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చినా సాధారణ జీవితం గడపడానికే మొగ్గుచూపారు. 650 రకాల వరి వంగడాలను భద్రపరిచిన సత్యనారాయణ బెలెరి, మొక్కలు నాటి పెంచడానికే జీవితాన్ని అంకితం చేసిన దుఖు మాఝీ, నామమాత్ర రుసుముతో వైద్యసేవలు అందిస్తున్న హేమ్‌చంద్‌ మాంఝీ, మిశ్రమ సాగుతో అద్భుతాలు సృష్టించిన గిరిజన రైతు సర్బేశ్వర్‌ బాసుమతరి, 105 ఏళ్ల గోపీనాథ్‌ స్వెయిన్‌ తదితరులు దీనిలో ఉన్నారు.


నవభారత నిర్మాతలకు అంకితం

పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. దేశంలోని గ్రామాలు, రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఇది వారికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాను.

 మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


అభిమానులకు దక్కిన గౌరవమిది

ద్మవిభూషణ్‌ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను సొంత మనిషిగా.. అన్నయ్యగా.. బిడ్డగా.. భావించే కోట్లమంది ఆశీస్సులు, నా సినీ కుటుంబ అండదండలు.. అలాగే నీడలా వెన్నంటి నడిచే లక్షలమంది అభిమానుల ప్రేమ, ఆదరణ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. నాకు దక్కిన ఈ గౌరవం వాళ్లదే. నన్ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు.

 చిరంజీవి


‘పద్మ’ పురస్కార గ్రహీతలకు సీఎం జగన్‌ అభినందనలు 

ఈనాడు, అమరావతి: పద్మవిభూషణ్‌ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన హరికథా కళాకారిణి డి.ఉమామహేశ్వరికి సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు.


పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వీరే

కళలు: ఖలీల్‌ అహ్మద్‌ - ఉత్తర్‌ ప్రదేశ్‌, ఎం.భద్రప్పన్‌ - తమిళనాడు, కలురాం బర్మానియా - మధ్యప్రదేశ్‌, రెజ్వానా చౌధురి బన్యా - బంగ్లాదేశ్‌, నసీం బానో - ఉత్తర్‌ ప్రదేశ్‌, రాంలాల్‌ బరెత్‌ - ఛత్తీస్‌గఢ్‌, గీతా రాయ్‌ బర్మన్‌ - పశ్చిమ బెంగాల్‌, సోం దత్‌ బట్టు - హిమాచల్‌ ప్రదేశ్‌, తక్దీరా బేగం - పశ్చిమ బెంగాల్‌, ద్రోణా భుయాన్‌ - అస్సాం, అశోక్‌ కుమార్‌ బిశ్వాస్‌ - బిహార్‌, స్మృతి రేఖ ఛక్మా - త్రిపుర, గులాం నబీ దార్‌ - జమ్మూ కశ్మీర్‌, మహాబీర్‌ సింగ్‌ గుడ్డూ - హరియాణా, అనుపమా హోస్కేరే - కర్ణాటక, జానకీలాల్‌ - రాజస్థాన్‌, రతన్‌ కహర్‌ - పశ్చిమ బెంగాల్‌, జోర్డాన్‌ లేప్చా - సిక్కిం, బినోద్‌ మహారాణా - ఒడిశా, రాంకుమార్‌ మల్లిక్‌ - బిహార్‌, సురేంద్ర మోహన్‌ మిశ్ర - ఉత్తర్‌ప్రదేశ్‌, అలీ మహమ్మద్‌, ఘనీ మహమ్మద్‌ - రాజస్థాన్‌, కిరణ్‌ నాడార్‌ - దిల్లీ, ఈపీ నారాయణ్‌ - కేరళ, భగబత్‌ పదాన్‌ - ఒడిశా, సనాతన్‌ రుద్రపాల్‌ - పశ్చిమ బెంగాల్‌, బినోద్‌ కుమార్‌ పసాయత్‌ - ఒడిశా, సిల్బీ పస్సా - మేఘాలయ, శాంతిదేవి పాసవాన్‌, శివన్‌ పాసవాన్‌ - బిహార్‌, రోమాలో రాం - జమ్మూ కశ్మీర్‌, నిర్మల్‌ రిషి - పంజాబ్‌, ప్రాణ్‌ సభర్వాల్‌ - పంజాబ్‌, మచిహాన్‌ సాసా - మణిపుర్‌, ఓంప్రకాశ్‌ శర్మ - మధ్యప్రదేశ్‌, గోదావరి సింగ్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌, శేషంపట్టి టి.శివలింగం - తమిళనాడు, ఊర్మిళా శ్రీవాస్తవ - ఉత్తర్‌ప్రదేశ్‌, నేపాల్‌ చంద్ర సూత్రధార్‌ - పశ్చిమ బెంగాల్‌, గోపీనాథ్‌ స్వెయిన్‌ (105 ఏళ్లు) - ఒడిశా, లక్ష్మణ్‌ భట్‌ తైలంగ్‌ - రాజస్థాన్‌, జగదీశ్‌ లాభ్‌శంకర్‌ త్రివేది - గుజరాత్‌, బాలకృష్ణన్‌ సాధనమ్‌ పుథియ వీతిల్‌ - కేరళ, బాబూ రామ్‌యాదవ్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌

సామాజిక సేవ: సోమన్న - కర్ణాటక, పర్బతి బారువా - అస్సాం, జగేశ్వర్‌ యాదవ్‌ - ఛత్తీస్‌గఢ్‌, ఛామి ముర్ము - ఝార్ఖండ్‌, గుర్విందర్‌ సింగ్‌ - హరియాణా, దుఖు మాఝీ - పశ్చిమబెంగాల్‌, సంగ్‌ థంకీమా - మిజోరం, శంకర్‌ బాబా పుండ్లిక్‌రావ్‌ పాపల్కర్‌ - మహారాష్ట్ర, కేఎస్‌ రాజన్న - కర్ణాటక, మాయా టాండన్‌- రాజస్థాన్‌, సనో వాముజో- నాగాలాండ్‌

వైద్యం: హేమచంద్‌ మాంఝీ - ఛత్తీస్‌గఢ్‌, మనోహర్‌ కృష్ణ ధోలే - మహారాష్ట్ర,ప్రేమా ధన్‌రాజ్‌ - కర్ణాటక, రాధా క్రిషన్‌ ధిమాన్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌, యజ్దీ మనేక్షా ఇటాలియా - గుజరాత్‌, చంద్రశేఖర్‌ మహాదేవ్‌ రావ్‌ మేష్రం - మహారాష్ట్ర, జి నాచియార్‌ - తమిళనాడు, రాధేశ్యాం పారీక్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌, దయాల్‌ మావ్‌జీభాయ్‌ పర్మార్‌ - గుజరాత్‌, చంద్రశేఖర్‌ చన్నపట్న రాజన్నాచార్‌ - కర్ణాటక

క్రీడలు: ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండే - మహారాష్ట్ర (మల్లకంబ కోచ్‌), ఆర్‌.ఎం.బోపన్న - కర్ణాటక, జోష్న చిన్నప్ప - తమిళనాడు, గౌరవ్‌ ఖన్నా - ఉత్తర్‌ప్రదేశ్‌, సతేంద్ర సింగ్‌ లోహియా - మధ్యప్రదేశ్‌, పూర్ణిమా మహతో - ఝార్ఖండ్‌, హర్బీందర్‌ సింగ్‌ - దిల్లీ

వ్యవసాయం, ఇతర విభాగాలు: యనుంగ్‌ జామోహ్‌ లెగో - అరుణాచల్‌ ప్రదేశ్‌ (ఔషధమొక్కల సాగు), సర్బేశ్వర్‌ బాసుమతరి - అస్సాం (వ్యవసాయం), సత్యనారాయణ బెలేరి - కేరళ (వ్యవసాయం), కె.చెల్లామ్మళ్‌ - అండమాన్‌ నికోబార్‌ (సేంద్రియ సాగు), చార్లెట్‌ చోపిన్‌ (యోగా) - ఫ్రాన్స్‌, చిత్తరంజన్‌ దేవ్‌ వర్మ (ఆధ్యాత్మికం)- త్రిపుర, సంజయ్‌ అనంత్‌ పాటిల్‌ - గోవా, కిరణ్‌ వ్యాస్‌ (యోగా) - ఫ్రాన్స్‌

సైన్స్‌, ఇంజినీరింగ్‌: నారాయణ్‌ చక్రబర్తి - పశ్చిమ బెంగాల్‌, రాం చెత్‌ చౌధరి - ఉత్తర్‌ ప్రదేశ్‌ శైలేశ్‌ నాయక్‌ - దిల్లీ, హరి ఓం - హరియాణా, ఏక్‌లవ్య శర్మ - పశ్చిమ బెంగాల్‌, రాంచందర్‌ సిహాగ్‌ - హరియాణా, రవి ప్రకాశ్‌ సింగ్‌ - మెక్సికో

సాహిత్యం, విద్య: రఘువీర్‌ చౌధరి - గుజరాత్‌, జో డి క్రజ్‌ - తమిళనాడు, పియర్రీ సిల్వేన్‌ ఫిలియోజాత్‌ - ఫ్రాన్స్‌, రాజారాం జైన్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌, యశ్వంత్‌ సింగ్‌ కతోచ్‌ - ఉత్తరాఖండ్‌, జహీర్‌ ఐ కాజీ - మహారాష్ట్ర, సురేంద్ర కిశోర్‌ - బిహార్‌, శ్రీధర్‌ మాకం కృష్ణమూర్తి - కర్ణాటక, పాకారావూర్‌ చిత్రన్‌ నంబూద్రిపాద్‌ - కేరళ, హరీశ్‌ నాయక్‌ - గుజరాత్‌, ఫ్రెడ్‌ నెగ్రిట్‌ - ఫ్రాన్స్‌, ముని నారాయణ్‌ ప్రసాద్‌ - కేరళ, భగవతీలాల్‌ రాజ్‌పురోహిత్‌ - మధ్యప్రదేశ్‌, నవజీవన్‌ రస్తోగీ - ఉత్తర్‌ప్రదేశ్‌, అశ్వతీ తిరుణాల్‌ గౌరీ లక్ష్మీభాయి తంపురట్టి - కేరళ

వాణిజ్యం, పరిశ్రమలు: కల్పనా మోర్పారియా - మహారాష్ట్ర, శశి సోని - కర్ణాటక

ప్రజా వ్యవహారాలు: శశీంద్రన్‌ ముత్తువేల్‌ - పపువా న్యూ గినియా


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని