నాడు రంకెలు.. నేడు సలాములు

మోసం..! పదే పదే అదే మోసం..! అయిదు కోట్ల ఆంధ్రుల్ని పదేళ్లుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది..! కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రతిసారీ... ఈసారైనా విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందేమోనని ఆశపడటం... తీరా బడ్జెట్‌ చూశాక ఉసూరుమనడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయింది.

Updated : 02 Feb 2024 07:04 IST

విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేని సీఎం జగన్‌
రాష్ట్రానికి పదే పదే మొండిచెయ్యి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం
తాజా బడ్జెట్‌లోనూ అదే పరిస్థితి
ఈనాడు - అమరావతి

మోసం..! పదే పదే అదే మోసం..! అయిదు కోట్ల ఆంధ్రుల్ని పదేళ్లుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది..! కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రతిసారీ... ఈసారైనా విభజన హామీలపై సానుకూల ప్రకటన వస్తుందేమోనని ఆశపడటం... తీరా బడ్జెట్‌ చూశాక ఉసూరుమనడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిపోయింది. విభజన జరిగి దాదాపు పదేళ్లయిపోయింది. కేంద్రంలో రెండోదఫా ఎన్‌డీఏ ప్రభుత్వం గడువూ త్వరలో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన విభజన హామీలు మాత్రం ఒట్టిమాటలుగానే మిగిలిపోయాయి. తాజా బడ్జెట్‌లోనూ విభజన హామీల విషయంలో కేంద్రం రాష్ట్రానికి మొండిచెయ్యే చూపింది. కానీ కేంద్రప్రభుత్వ అడుగులకు మడుగులొత్తడమే అలవాటుగా మారిన జగన్‌ ప్రభుత్వం.. ఎప్పటిలానే కిమ్మనడం లేదు! ఎందుకు అన్యాయం చేస్తున్నారని కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రిలో ఏ కోశానా లేవు. 2019 ఎన్నికలకు ముందు విపక్షనేతగా కేంద్రంపై రంకెలు వేసిన జగన్‌... అధికారంలోకి వచ్చాక పిల్లిలా తోకముడిచారు.

తనపై నమోదైన అవినీతి కేసుల్లోంచి బయట పడటమే ఆయన ఏకైక ఎజెండా..! విభజన హామీలపై ఈ అయిదేళ్లలో ఆయన సీరియస్‌గా ఒక్కసారీ సమీక్షించిన దాఖలాల్లేవు. ఎన్నికల ముందు 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సహా విభజన హామీలన్నీ సాధిస్తానని బీరాలు పలికారు. ఎన్నికలకు పది నెలల ముందే పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారు. విభజన హామీల సాధనకు ఎంతవరకైనా వెళతామన్నట్టుగా ప్రజల్లో భ్రమ కల్పించారు. అదే నిజమనుకుని ప్రజలు ఓట్లేశారు. కానీ అధికారంలోకి రాగానే జగన్‌ ప్లేటు ఫిరాయించేశారు. తూచ్‌... కేంద్రంతో పోరాటం లేదంటూ కాడి దించేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక దిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలసి బయటకు వచ్చాక... ‘‘రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలూ ప్రధాని విన్నారు. ఆయన సానుకూలంగా ఉంటారనుకుంటున్నాను. మనసులో ఉంటే చేస్తారు. ఎన్‌డీఏ 250 స్థానాలకు పరిమితమైతే పరిస్థితి మరోలా ఉండేదేమో...! 250 దాటకూడదని దేవుడిని నేనూ ప్రార్థించా.

ఒకవేళ ఆ పరిస్థితి ఏర్పడితే హోదాపై సంతకం పెట్టాకే ప్రమాణస్వీకారం చేసే పరిస్థితి వచ్చేది. ఏం చేస్తాం, మన కర్మ అనుకోవాలి! వాళ్లకి మన సాయం లేకుండానే బలంగా ఉన్నారు. ఇప్పుడు సంతకం పెడతారా? అంటే ప్రయత్నిస్తూ పోవాలి’’... ఇలా జగన్‌ చేతులెత్తేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు అవే నేలచూపులు... బేల అరుపులు తప్ప కేంద్రాన్ని గట్టిగా నిలదీసే సాహసం జగన్‌ ఎప్పుడూ చేయలేదు. ఇది నయవంచన కాదా? 2014-19 మధ్య కూడా కేంద్రంలో ఎన్‌డీఏకి 250 స్థానాలకు మించే బలముంది కదా? రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలూ రాజీనామా చేస్తే... కేంద్రం దిగి వస్తుందని అప్పుడెందుకు చెప్పారు? ఆ పని ఈ అయిదేళ్లలో ఎందుకు చేయలేదు?

అడక్కుండానే అడుగులకు మడుగులు

ఎన్‌డీఏకు తగినంతమంది ఎంపీల బలముంది కాబట్టి ఏమీ చేయలేకపోతున్నామని జగన్‌ చెప్పడం ప్రజల్ని వంచించడమే..! కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌డీఏకి జగన్‌ అవసరం లేకపోవచ్చు. కానీ అనేక కీలక బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందేందుకు ఎన్‌డీఏకి... వైకాపా ఎంపీలు అవసరమయ్యారు. కేంద్రానికి అవసరమైన ప్రతిసారీ.. వారు అడగకపోయినా ఎదురెళ్లి మరీ జగన్‌ మద్దతిచ్చారు. ప్రత్యేకహోదా ఇస్తేనే మద్దతిస్తామని ఏనాడూ షరతు పెట్టలేదు. పార్లమెంటులో బలమైన ప్రాంతీయ పార్టీల్లో వైకాపా ఒకటి. ఆ పార్టీకి లోక్‌సభలో 22, రాజ్యసభలో 9 మంది కలిపి మొత్తం 31 మంది ఎంపీలు ఉన్నారు. కీలక బిల్లుల విషయంలో మోదీ ప్రభుత్వం ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు... జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడితే కేంద్రం దిగి వచ్చేదేమో! కానీ జగన్‌ అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.

ఈ అయిదేళ్లలో వైకాపా ఎంపీలు విభజన హామీల కోసం పార్లమెంటులో చిన్నపాటి నిరసన కూడా తెలియజేయలేదు. జగన్‌ లెక్కలేనన్నిసార్లు దిల్లీ వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ... సీఎం కార్యాలయం మొక్కుబడిగా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. ప్రత్యేకహోదా సహా విభజన హామీల్ని నెరవేర్చాలని ప్రధానిని జగన్‌ కోరినట్టు దానిలో ఉంటుంది. నిజంగా ఆయన అడిగారో, లేదో ఎవరికీ తెలియదు. తనపై కేసుల నుంచి ఊరట పొందేందుకు, కేంద్రాన్ని బతిమాలుకుని విరివిగా అప్పులు తెచ్చుకునేందుకే జగన్‌ దిల్లీ వెళతారన్నది అందరికీ తెలిసిన రహస్యం. ఈ అయిదేళ్లలో ఏ బహిరంగ వేదికపైనా, ఏ సమావేశంలోనూ... ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి జగన్‌ కేంద్రాన్ని గట్టినా నిలదీయలేదు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చినప్పుడు ‘అశ్వత్థామ హతః కుంజరః..’ అన్నట్టుగా ప్రధానికి వినబడీ వినబడకుండా, ఆయనకు అర్థం కాకుండా... ప్రత్యేకహోదా ఇవ్వాలని తెలుగులో అడిగి మమ అనిపించారు! ఈ అయిదేళ్లలో ప్రత్యేకహోదాపై జగన్‌ పోరాటం అంత ఘనంగా ఉండబట్టే.. కేంద్రం కూడా చాలా తేలిగ్గా తీసుకుంది.

అన్ని హామీలదీ అదే గతి..!

  • వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకే కేబీకే, బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లలో మొత్తం రూ.1,050 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఊసే లేదు.
  • విభజన చట్టం షెడ్యూల్‌ 13లోని మౌలికవసతుల జాబితాలో మొదటి స్థానంలో పేర్కొన్న దుగరాజపట్నం మేజర్‌ పోర్టు తొలిదశ నిర్మాణాన్ని కేంద్రం 2018 నాటికి పూర్తిచేయాలి. కానీ పొరుగు పోర్టులతో పోటీ ఉన్నందున... అక్కడ ఓడరేవు నిర్మించడం లాభదాయం కాదన్న వాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. దానికి బదులుగా రామాయపట్నంలో పోర్టు నిర్మిద్దామనుకుంటే... దాన్ని రాష్ట్రప్రభుత్వం నాన్‌మేజర్‌ పోర్టుగా నోటిఫై చేయడంతో తాము నిర్మాణం చేపట్టలేమని కేంద్రం స్పష్టంచేసింది. ప్రస్తుతం రామాయపట్నంలో రాష్ట్ర ప్రభుత్వమే పోర్టు నిర్మిస్తోంది. దానికే నిధులివ్వాలని కోరితే కేంద్రం కుదరదని చెప్పేసింది. దుగరాజపట్నంలో కేంద్ర ప్రభుత్వం మేజర్‌ పోర్టు నిర్మించాలన్న ప్రతిపాదన పూర్తిగా అటకెక్కింది.
  • కడపలో ఉక్కు కర్మాగారం హామీనీ కేంద్రం విస్మరించింది. అక్కడ జేఎస్‌డబ్ల్యూతో కలసి రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారం నిర్మిస్తుందంటూ సీఎం జగన్‌... అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ఆ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు.
  • దిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌ విభజన ఇంకా పూర్తికాలేదు. ద్వైపాక్షిక అంశాల్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే పరిష్కరించడం తమ ఉద్దేశమంటూ కేంద్రం తప్పించుకుంటోంది.
  • విభజన హామీలో భాగంగా ఏర్పాటైన పలు కేంద్ర విద్యాసంస్థలు ఇప్పటికీ తాత్కాలిక భవనాల్లోనే నడుస్తున్నాయి. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు సమకూరలేదు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించినచోట కాకుండా... జగన్‌ ప్రభుత్వం మరోచోటుకు మార్చడంతో విపరీతమైన తాత్సారం జరిగింది. దానికి ఇటీవలే శంకుస్థాపన చేశారు.
  • రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులిపేసుకుంది. జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల నాటకానికి తెరతీయడంతో... కేంద్రం ఈ అయిదేళ్లలో రాజధానికి ఒక్కరూపాయి కూడాఇవ్వకుండా, చోద్యం చూస్తోంది.
  • ఈ అయిదేళ్లలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మెట్రోరైళ్ల ప్రాజెక్టులకు ఉదారంగా నిధులిచ్చిన కేంద్రం... ఏపీలో మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. విజయవాడ, విశాఖ మెట్రో రైళ్ల ప్రాజెక్టులపై జగన్‌ ప్రభుత్వమే అంతులేని నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటంతో కేంద్రం కూడా పట్టించుకోవడం మానేసింది.
  • రాష్ట్రంలో పూర్తిస్థాయి గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి హామీలు కూడా పూర్తిగా అమలుకాలేదు.

ప్రత్యేక హోదాకు పాతర

ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన హామీకి విజయవంతంగా పాతరేశారు. 14వ ఆర్థికసంఘం సిఫారసులను సాకుగా చూపి, ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదని, అప్పటికే ఉన్న రాష్ట్రాలకూ పొడిగించబోమని మోదీ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కొన్నాళ్ల తర్వాత అప్పటికే ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు పొడిగించింది. ఏపీకి మాత్రం మొండిచెయ్యి చూపింది. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తామని ఎన్నికల ముందు డబ్బాకొట్టిన జగన్‌... ఈ అయిదేళ్లలో కేంద్రాన్ని ఒక్కసారీ నిలదీయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని