ఉన్నత విద్య ఊపిరి తీసిన ఉన్మాద పాలన

అవి చదువుల తల్లి లోగిళ్లు... విద్యాబుద్ధులు నేర్పే కేంద్రాలు... యువతను తీర్చిదిద్దే నిలయాలు వారి భవితకు పునాదులు వేసే ఆలయాలు అలాంటి పవిత్ర విశ్వవిద్యాలయాలు జగనన్న పాలనలో అపవిత్రమయ్యాయి.

Updated : 18 Apr 2024 16:23 IST

అవి చదువుల తల్లి లోగిళ్లు... విద్యాబుద్ధులు నేర్పే కేంద్రాలు... యువతను తీర్చిదిద్దే నిలయాలు వారి భవితకు పునాదులు వేసే ఆలయాలు అలాంటి పవిత్ర విశ్వవిద్యాలయాలు జగనన్న పాలనలో అపవిత్రమయ్యాయి. గురుతర బాధ్యత నెరవేర్చాల్సినవారు అన్నకు నమ్మిన బంట్లయ్యారు... చదువులకు పెద్దపీట వేయాల్సినవారు అన్న అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఉపకులపతులుగా వెలగాల్సినవారు జగన్నామ జపకులపతులవుతున్నారు... పరీక్షలు, ప్రయోగాలతో ప్రతిభ వికసించాల్సిన చోట పాలాభిషేకాలు... బర్త్‌డే పార్టీలు... పార్టీ మీటింగ్‌లు సాగుతున్నాయ్‌!


రాష్ట్రంలో తొలి విశ్వవిద్యాలయం- ఆంధ్ర విశ్వకళాపరిషత్తు. తొమ్మిదిన్నర దశాబ్దాలకు పైబడిన చరిత్ర దాని సొంతం. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి మహోన్నత ఉపకులపతుల మార్గదర్శకత్వంలో విశిష్ట విశ్వవిద్యాలయంగా ఏయూ వాసికెక్కింది. హీరేన్‌ ముఖర్జీ, మహదేవన్‌, సూరి భగవంతం వంటి ఆచార్యులతో అది సరస్వతీ కోవెలగా  ప్రసిద్ధి పొందింది. తన మోచేతి నీళ్లకు గుటకలేసే పీవీజీడీ ప్రసాదరెడ్డిని ఉపకులపతిని చేసిన జగన్‌మోహన్‌రెడ్డి- ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను బంగాళాఖాతంలో కలిపేశారు. ఏయూ ఒక్కటే కాదు- రాష్ట్రంలోని యూనివర్శిటీలన్నీ ఇప్పుడు జగన్‌ భజన మండళ్లుగా తయారయ్యాయి. జగన్‌మోహన్‌రెడ్డికి పాదపూజలు, ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసే అవిద్యావేత్తలతో అవి నిండిపోయాయి.


అంబేడ్కర్‌ ఆశయాలకు సమాధి

విశ్వవిద్యాలయాలంటే ఏవో కొన్ని భవనాల సముదాయాలు కావు. పరీక్షలు పెట్టి పట్టాలు ప్రదానం చేసేందుకు ఉన్న సాధారణ సంస్థలు అంతకంటే కావు. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అత్యున్నత వ్యవస్థలవి. కాలానుగుణంగా మేలిమి చదువులు, నైపుణ్య శిక్షణతో యువతను సానపట్టాల్సినవి విశ్వవిద్యాలయాలు. అందువల్ల వాటిని నియంత్రించే వారికి సామాజిక విలువలు ఉండాలని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆశించారు. విలువలకు అర్థం తెలియని వంధిమాగధులను ఉపకులపతులను చేయడం ద్వారా బాబాసాహెబ్‌ ఆశయాలకు జగన్‌ సమాధికట్టారు.

విజ్ఞాన వెలుగులను ప్రసరింపజేయడంలో విశ్వవిద్యాలయ నిబద్ధతకు వైస్‌ఛాన్సలర్‌(వీసీ) ప్రతిరూపం కావాలి. యూనివర్శిటీ అంతరాత్మకు, దాని నైతిక ప్రమాణాలకు వీసీ అద్దంపట్టాలి. కాబట్టి అందరి మర్యాదామన్నలను పొందేవారినే ఉపకులపతి పదవికి ఎంపిక చేయాలని కొఠారి కమిషన్‌ సూచించింది. సమాజంలో విశిష్టులే వీసీలు కావాలని రామ్‌లాల్‌ పరేఖ్‌ కమిటీ సైతం స్పష్టంగా చెప్పింది. అత్యున్నత సామర్థ్యం, వంకపెట్టలేని వ్యక్తిత్వం, నిష్పాక్షికత, జవాబుదారీతనం కలిగినవారే ఉపకులపతులు అయ్యేందుకు అర్హులని యూజీసీ పేర్కొంది. అటువంటి లక్షణాలేవీ తనకు లేవు కాబట్టి ఆయా సుగుణాలు కలిగిన వ్యక్తులెవరు జగన్‌కు నచ్చరు. అందువల్లే తన అంతేవాసులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సిఫార్సులతో అయోగ్యులను వివిధ యూనివర్శిటీలకు వీసీలుగా పంపించారు.


అయోగ్యుల్లో నం.1

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాదరెడ్డి- సాధారణ వైకాపా కార్యకర్తలను మించి జగన్‌ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మనిషి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌ జెండాను భుజానికెత్తుకుని ప్రచారం చేశారు. తన శిష్యులతో పార్టీకి సర్వేలు చేయించడం, వైకాపాకు ఓటేయాలంటూ అధ్యాపకులతో సమావేశం పెట్టడం... ఇలా జగన్‌కోసం ప్రసాదరెడ్డి చేయని సిగ్గుమాలిన పని అంటూ ఏదీ లేదని మొత్తం విశాఖపట్నం కోడైకూసింది. అధికారపక్షంతో అంటకాగిన ఆయన అవినీతి అక్రమాల్లోనూ ఆరితేరిపోయారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. దానిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యమూ దాఖలైంది. పీహెచ్‌డీ సీట్లను అమ్ముకోవడం నుంచి ఎస్సీ ఎస్టీ ఆచార్యులను కాల్చుకుతినడం వరకు ప్రసాదరెడ్డిపై ఉన్న అభియోగాలు అనేకం. అయినప్పటికీ ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీగా ఏరికోరి ఆయనకే రెండోసారి కిరీటధారణ చేశారు జగన్‌.


సిగ్గు లేకపోతే సరి!

రాజకీయ ప్రభావాలకు లోబడకుండా విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయాలి. బోధన, పరిశోధనలపై దృష్టి సారిస్తూ జాతీయాభివృద్ధి సాధనాలుగా అవి రాణించాలి. ఆచార్య ఎ.జ్ఞానం కమిటీ నివేదికలో ప్రముఖంగా కనిపించే అంశాలివి. వాటికి విరుద్ధంగా వేరుపురుగుల వంటి వీసీల నియామకాలతో విశ్వవిద్యాలయాలను వైకాపా కార్యాలయాలుగా తీర్చిదిద్దారు జగన్‌. నాగార్జున యూనివర్శిటీ ఉపకులపతి రాజశేఖర్‌ ప్రవర్తనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. వీసీగా బాధ్యతల స్వీకరణ సందర్భంలోనే ‘జై జగన్‌’ అంటూ గొంతు చించుకున్న ఆయన- ఆపై వైకాపా అధినేతకు మద్దెల కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. జగన్‌ మూడు రాజధానుల మోసానికి మద్దతుగా ర్యాలీ తీసిన రాజశేఖర్‌- సందర్భం కుదిరినప్పుడల్లా సీఎంకు చెక్కభజన చేశారు. యూనివర్శిటీ ప్రధాన ద్వారం దగ్గర జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి- ఉపకులపతి హోదాను దిగజార్చారు.

తెల్లదొరల కాలంలో, ఆ తరవాత స్వతంత్ర భారతదేశంలోనూ విశ్వవిద్యాలయాలు అనేక ప్రజాపోరాటాలకు వేదికలయ్యాయి. భావప్రకటనా స్వేచ్ఛను హరించిన పాలకులపై బందూకులు ఎక్కుపెట్టాయి. నాటి రాక్షస పాలకులకే పాఠాలు నేర్పిస్తూ నల్ల జీఓ నం.1ని(రోడ్ల మీద రాజకీయ సభలపై నిషేధం) జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారు. భారతీయ విశ్వవిద్యాలయాల చైతన్యశీలతను జగన్‌ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన వీసీ రాజశేఖర్‌- జీఓ నం.1ని వెనకేసుకొస్తూ సదస్సు నిర్వహించారు. దానిపై విస్మయం వ్యక్తంచేసిన హైకోర్టు- ‘‘రాజకీయ విషయాలతో వీసీకి సంబంధమేంటి... సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు... ఇటువంటి తీరును గతంలో ఎప్పుడైనా చూశామా’’ అని ముక్కచీవాట్లు పెట్టింది. జగన్‌ రాక్షసత్వాలకు వంతపాడటమే కాదు- వైకాపా ప్లీనరీకి పార్కింగ్‌ ప్లేస్‌గా విశ్వవిద్యాలయాన్ని వాడుకోనిచ్చారు రాజశేఖర్‌. జగన్‌ పార్టీ ప్రచార సామగ్రినీ యూనివర్శిటీ ఆవరణలోనే కుప్పపోయించారు. పరీక్షలు వాయిదా వేసి, విశ్వవిద్యాలయానికి సెలవులిచ్చి మరీ వైకాపా ప్లీనరీకి తన శక్తిమేర సహకరించారు వైకాపా పాటకు పిల్లలతో నృత్యాలు చేయించడం మొదలు వీసీ రాజశేఖర్‌ ప్రదర్శించిన స్వామిభక్తి అంతాఇంతా కాదు.


ప్రతిచోటా పాదసేవలే!

హదారి కూడళ్లలో రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు నానారచ్చ చేస్తుంటారు కొంతమంది. జగన్‌ పుణ్యమా అని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వీసీ అయిన  రామకృష్ణారెడ్డి సైతం అలాగే విద్యార్థులతో సిగపట్లకు దిగారు. పిల్లలను కటకటాల్లోకి పంపించి మరీ యూనివర్శిటీలో వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారాయన.

  • జగన్‌ జమానాలోనే శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి అయిన రాజారెడ్డి- వైకాపా నేతలు, వారి సుపుత్రుల పుట్టినరోజు వేడుకల నిర్వాహకుడిగా కీర్తిగడించారు. అధికారపక్షం ప్రాపకం కలిగినవారికి యూనివర్శిటీలో అక్రమంగా ఉద్యోగాలిచ్చిన అభియోగాలూ ఆయనపై ఉన్నాయి.
  • విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే వైఎస్‌ విగ్రహానికి అటూఇటూ నిల్చుని మంత్రి గోవర్ధన్‌రెడ్డి, వీసీ సుందరవల్లి దిగిన ఫొటో పెద్దగా కనపడుతుంది. జగన్‌ బంధువైన సుందరవల్లి- వైఎస్‌ నామస్మరణలో తరించిపోయే వ్యక్తి అన్నది అందరికీ తెలిసిన విషయమే.
  • విశ్వవిద్యాలయంలోనే జగన్‌ ఫొటోకు పాలతో అభిషేకించిన మరో దాసానుదాసుడు, ద్రవిడ వర్శిటీ రిజిస్ట్రార్‌ వేణుగోపాలరెడ్డి. జగన్‌ పార్టీతో సాన్నిహిత్యంవల్లే ఆయన ఆ పదవిలోకి వచ్చారు. పురపాలక ఎన్నికల వేళ వైకాపా ప్రచార సభలో పెద్దిరెడ్డి పక్కన కనిపించారు. ఉద్యోగులు, విద్యార్థులతో దొంగ ఓట్లు వేయించిన ఆరోపణలనూ రిజిస్ట్రార్‌ వేణుగోపాలరెడ్డి నెత్తినమోస్తున్నారు.
  • వైకాపా విష రాజకీయాలతో కలుషితం కానీ విద్యాప్రాంగణాలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. జగన్‌ను జగత్‌ ప్రభువుగా భావించి ఆరాధించే వీసీలకూ లోటులేదు. ఎన్టీఆర్‌ (ఆ తరవాత వైఎస్‌ఆర్‌) ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా పనిచేసిన శ్యామప్రసాద్‌ అయితే- వైకాపా ప్రభుత్వాన్ని వేనోళ్ల పొగిడి, జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని నిర్లజ్జగా డప్పుకొట్టారు.

సర్వనాశనం

‘‘విద్యాబోధనను సరిగా నిర్వహించాలంటే విశ్వవిద్యాలయానికి ఆర్థిక నియంత్రణాధికారం ఉండాలి’’ అన్నది డాక్టర్‌ అంబేడ్కర్‌ నిశ్చితాభిప్రాయం. దానికి విరుద్ధంగా వర్శిటీల సొమ్ము రూ.150 కోట్లను జగన్‌ లాగేసుకున్నారు. ‘‘విశ్వవిద్యాలయం తన విధులను నిర్వర్తించాలంటే, తగినంత బోధనాసిబ్బంది ఉండాలని మనం మర్చిపోకూడదు’’ అని పాలకులను హెచ్చరించారు అంబేడ్కర్‌. 70శాతానికిపైగా అధ్యాపకుల పోస్టుల ఖాళీలతో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నీరసించిపోతుంటే- ఉద్యోగాల భర్తీపై జగన్‌ దృష్టి సారించలేదు. అలా వర్శిటీల్లో బోధనను పడకేయించిన జగన్‌- అంబేడ్కర్‌ పేరెత్తే అర్హతైనా తనకు లేదని నిరూపించుకున్నారు.


కొత్త కోర్సుల్లేవు... పాఠాలు చెప్పేవారు లేరు... మరి జగన్‌ జమానాలో విశ్వవిద్యాలయాలు సాధించిదేమిటి? దేశంలోని విద్యాసంస్థలకు కేంద్రం ఇచ్చే ర్యాంకుల్లో(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) 2019 ఓవరాల్‌ విభాగంలో ఆంధా విశ్వవిద్యాలయం 29వ స్థానంలో నిలిచింది. 2023కి వచ్చేసరికి అది 76వ ర్యాంకుకు పతనమైంది. 2019లో 72వ స్థానం సాధించిన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాయలం... నాలుగేళ్లు తిరిగేసరికి 101-150 ర్యాంకుల శ్రేణిలోకి దిగజారిపోయింది. మిగిలిన రాష్ట్ర విశ్వవిద్యాలయాల పరిస్థితి అంతకంటే అధ్వానం.


జగన్‌ ఏలుబడిలో గంజాయి పొగలు యూనివర్శిటీలనూ కమ్మేశాయి. ఆంధ్ర, నన్నయ వర్శిటీల్లో మత్తురక్కసి జాడలు వెలుగులోకి వచ్చాయి. భూఆక్రమణల్లో తిరుగులేని జగన్‌ గణాలు విశ్వవిద్యాలయాల స్థలాలనూ విడిచిపెట్టలేదు. శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ భూముల్లో నాలుగు ఎకరాలను ఆక్రమించిన స్థానిక వైకాపా నాయకుడు- వాటిని యథేచ్ఛగా అమ్ముకున్నాడు. జగనన్న కాలనీకోసం అంటూ అదే విశ్వవిద్యాలయానికి చెందిన మరో అయిదెకరాల భూమిని వైకాపా నేతలు చెరపట్టారు. ఉపకులపతుల కార్యాలయాలను వైకాపా బంట్రోతుల విడిదిళ్లుగా మార్చిన జగన్‌-  విశ్వవిద్యాలయాల స్వతంత్రతనే కబ్జా చేశారు. ఉన్నత విద్యారంగం ఊపిరితీసి, యువజనాభివృద్ధికి సైంధవుడయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని