అప్పుల ‘ఆంధ్రప్రదేశ్‌’

అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టడం..  పాత అప్పులు తీర్చడానికీ, వడ్డీలకీ.. పన్నుల మీద పన్నులు వేస్తూ ప్రజల నడ్డి విరగ్గొట్టడం.. వైకాపా పాలనలో ఇది నిత్య కృత్యం.. జగమెరిగిన సత్యం! ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ వచ్చిన జగన్‌ను నమ్మినందుకు ఆంధ్రప్రదేశ్‌ను అప్పులకుప్పగా మార్చేశారు.

Updated : 18 Apr 2024 16:37 IST


అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టడం..  పాత అప్పులు తీర్చడానికీ, వడ్డీలకీ.. పన్నుల మీద పన్నులు వేస్తూ ప్రజల నడ్డి విరగ్గొట్టడం.. వైకాపా పాలనలో ఇది నిత్య కృత్యం.. జగమెరిగిన సత్యం! ‘ఒక్క ఛాన్స్‌’ అంటూ వచ్చిన జగన్‌ను నమ్మినందుకు ఆంధ్రప్రదేశ్‌ను అప్పులకుప్పగా మార్చేశారు. ఇప్పుడు మరోసారి సిద్ధం అంటున్నారు.. అదే జరిగితే ప్రజలకు ఇల్లూవాకిలి కూడా మిగలవేమో!

అ అంటే అప్పులు...
ఆ అంటే ఆవారా ఖర్చులు...

నవ్యాంధ్ర నెత్తిన నిప్పులుపోసిన నియంత జగన్‌మోహన్‌రెడ్డికి తెలిసిన తెలుగు ఇదే. ఎక్కడ పడితే అక్కడ, ఎంత కుదిరితే అంత అప్పు చేసిన ఆయన సర్కారు- దానికోసం అయిదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్తునే తాకట్టు పెట్టేసింది. తెచ్చిన రుణాల్లో అధిక మొత్తాన్ని రెవెన్యూ వ్యయాలకు మళ్ళించేసి, అభివృద్ధిని ఆరడుగుల గోతిలో పాతిపెట్టేసిన జగన్‌ది- అక్షరాలా ఆర్థిక ఉగ్రవాదం. రాష్ట్రంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిపై ఉన్న అప్పుల బండ బరువును రూ.2.04 లక్షలకు చేర్చిన జగన్‌ అరాచకత్వం- గంగలో మునిగినా నిష్కృతి కాని మహాపాపం!


జనాన్ని చావగొట్టిన జగన్‌

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని చెప్పారు జగన్‌... పాలనా విలువలకోసం ప్రాణాలిచ్చే పెద్దమనిషి వేషంకట్టి ఆనాడు రాజకీయ నాటకాలను రక్తికట్టించారు. ‘‘ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని దాటి వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది? ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి మాత్రమే అప్పులు తీసుకోవాలి’’ అని విపక్ష నేతగా నీతులు బోధించిన జగన్‌- ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాక పాత  ప్రవచనాలన్నింటినీ మర్చిపోయారు. మాట మీద నిలబడటం వంటివి అసలు తన  ఇంటావంటా లేవని నిరూపించుకున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం  (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) నియమాలకు ఆయన పూచికపుల్ల పాటి విలువైనా ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధ వ్యవస్థ ‘కాగ్‌’ నివేదికలను పరిశీలిస్తే చాలు- ఆ విషయం తేటతెల్లమవుతుంది. రుణాలన్నీ కలిపితే- రాష్ట్ర నికర ఉత్పత్తి(గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడెక్ట్‌- జీఎస్‌డీపీ)లో 35శాతం మించకూడదని ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం గిరిగీస్తోంది.  

బయటికి చెప్పని రుణాలు, ఇతర చెల్లింపుల భారమంతటినీ కలిపి లెక్కేస్తే- ఆంధ్రప్రదేశ్‌ అప్పుల విలువ జీఎస్‌డీపీలో 65శాతానికి పైబడుతుందని అంచనా! ప్రభుత్వం ఇలా ఇష్టారాజ్యంగా రుణాల ముష్టి ఎత్తుకోవడంవల్ల- జనానికి జరిగిన నష్టం అంతాఇంతా కాదు. దాని గురించి అమెరికా పూర్వాధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌ మాటల్లో చెప్పాలంటే- ‘‘ఎడతెగని అప్పుల భారాన్ని మనపై మోపడానికి పాలకులను అనుమతించకూడదు. ప్రభుత్వం అలా అప్పుల్లో కూరుకుపోతే, అవి తీర్చడానికి మనం తినే ప్రతి తిండిపైనా, తాగే ప్రతి పానీయంపైనా, మన అవసరాలూ ఆనందాలు, వృత్తులపైనా బోలెడు పన్నులు కట్టాల్సి వస్తుంది. రోజులో పదహారు గంటలు ఒళ్లు హూనం చేసుకుని... అందులో పదిహేను గంటల శ్రమఫలితాన్ని సర్కారీ అప్పులు, రోజువారీ ఖర్చుల కోసం ప్రభుత్వానికే ధారపోయాల్సి వస్తుంది. చివరికి మన చేతిలో మిగిలే నాలుగు రూకలు పొట్ట నింపుకోవడానికి కూడా చాలవు’’! చెత్త పన్నుల చక్రవర్తి జగన్‌ చేతలు జనానికి ఇలాగే వాతలు పెట్టాయి. విపరీతమైన పన్నుల బాదుడుతో ప్రజల రక్తమాంసాలను పిండేశారు జగన్‌. అలాంటి కిరాతక పాలకుణ్ని ‘సంక్షేమ సారథి’గా కీర్తించడం- వైకాపా ప్రబుద్ధుల సిగ్గుమాలినతనం!


రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన జగన్‌

చెడు అలవాట్లకు బానిసైన వాళ్లు ఇళ్లలోని చెంబులూ తపేళాలనూ తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చుకుంటారు. జగన్‌ సర్కారు కూడా అదే పద్ధతిలో అలవిమాలిన అప్పులు చేసింది. రుణాల వెంపర్లాటలో విలువైన భూములను బ్యాంకులకు కుదువపెట్టడం జగన్‌ వెర్రిమొర్రి విధానాలకు ఒక ఉదాహరణ. అంతకంటే సిగ్గుచేటు ఏంటంటే- మద్యం రాబడి మీదా అప్పులకు దేబిరించడం! జనానికి తాగబోయించి, వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తారా అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద మానవతావాదిగా జగన్‌ ఏకపాత్రాభినయం చేశారు. అధికార పీఠం ఎక్కగానే అదే సొమ్మును ఆవురావురుమని ఆరగించారు. దాన్నే ఆదాయంగా చూపించి రుణాలూ తీసుకున్నారు. మొత్తమ్మీద 2024 జనవరి తొలి రోజుల నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు, సర్కారు చెల్లించాల్సిన వివిధ బకాయిల విలువను రూ.10.21 లక్షల కోట్లను దాటించేశారు. అవి చాలవన్నట్లు రాబోయే మూడు నెలలకు మరో రూ.18వేల కోట్ల రుణం కావాలని జగన్‌ సర్కారు జనవరిలో రిజర్వ్‌ బ్యాంకు ముందు  చెయ్యి చాచింది.

వ్యక్తి అయినా, ప్రభుత్వమైనా సరే- పరిధికి మించి బాకీలు చేస్తే- అవి తీర్చలేక దివాలా తీయడం ఖాయం. అప్పిచ్చే వారెవరు దొరుకుతారా అని అంజనమేసి వెతుకుతూ, జోలె పుచ్చుకుని తిరుగుతున్న జగన్‌ సర్కారు కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ఆ ముప్పు ముంగిట్లో నిలబడింది. ఇష్టమొచ్చినట్లు రుణాలు తీసుకోవడం అతిప్రమాదకరమని కేంద్రం నెత్తీనోరూ కొట్టుకుంది. రిజర్వు బ్యాంకు అప్రమత్తం చేసింది. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అప్పుల వేటలో మునిగిపోయిన జగన్‌కు అవేమీ తలకెక్క లేదు. రాష్ట్రం ఏమైపోతే నాకేమిటి అన్న తన విధ్వంసకర ధోరణినే ఆయన ఆసాంతం కొనసాగించారు. ‘కాదేదీ తాకట్టుకు అనర్హం’ అనుకుంటూ తన కంటపడిన దేన్నీ వదలకుండా కుదువపెట్టేశారు జగన్‌. తాజాగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆదాయాన్ని తాకట్టుపెట్టి మరీ రూ.7 వేల కోట్లు రుణం తీసుకున్నారు. డబ్బులు కావాల్సి వస్తే సచివాలయాన్ని అయినాసరే,  తాకట్టు పెడతామని, అందులో తప్పేముందని జగన్‌ అనుచరులు నిర్లజ్జగా మాట్లాడుతున్నారు.   వాళ్లకు ఇష్టం వచ్చింది చేయడానికి రాష్ట్రం ఏమైనా జగన్‌ సొంత జాగీరా?


జగన్‌ రాజ్యంలో అంతా రహస్యం!

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలంటూ విపక్ష నేతగా జగన్‌ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. పన్నులు, పన్నేతర రాబడులు, తీసుకున్న రుణాలు, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రణాళిక- ప్రణాళికేతర వాస్తవ వ్యయాల సమాచారాన్ని వెల్లడించాలని ఆయన పట్టుబట్టారు. ఆ మేరకు పూర్తి వివరాలు తెలియకపోతే- శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరపడానికి ఆస్కారం ఉండదనీ జగన్‌ సెలవిచ్చారు. అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా  ఆర్థిక పారదర్శకతకు పూర్తిగా పాతరేశారు. ప్రజలకే కాదు, ‘కాగ్‌’కు కూడా లెక్కలన్నీ పక్కాగా చెప్పకుండా చీకటి పాలన సాగించారు.   204, 205 రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి, శాసనసభ కళ్లకు గంతలు కట్టి నిధుల వ్యయంలో విచ్చలవిడిగా వ్యవహరించారంటూ జగన్‌ సర్కారును సాక్షాత్తూ ‘కాగే’ తూర్పారపట్టింది. ‘‘బడ్జెట్‌లో చూపకుండా ఇతర మార్గాల్లో తీసుకుంటున్న రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర రుణ చెల్లింపుల భారం విస్ఫోటక పథంలో పయనిస్తోంది’’ అని ‘కాగ్‌’ ఇటీవలే హెచ్చరించింది. అయితేనేమి... సిగ్గులేని ముఖానికి నవ్వే అలంకారం అన్నట్టుగా జగన్‌ సర్కారు అన్నీ దులపరించేసుకుంది.


అభివృద్ధిని ఎండగట్టిన ప్రజావ్యతిరేకి

అప్పు చేసి ఇల్లు కడితే- తగ్గే ఇంటి అద్దె ఖర్చులకు ఇంకొంత కలిపి బాకీ చెల్లు వేయవచ్చు. రుణం తీసుకుని వ్యాపారం మొదలుపెట్టి, కాస్త కష్టపడితే- వచ్చే లాభాలతో అప్పు తీర్చవచ్చు. ప్రభుత్వమైనా సరే- వడ్డీకి తెచ్చిన డబ్బులతో అభివృద్ధి పనులు చేస్తే, ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీర్చే తోవ దొరుకుతుంది. జగన్‌కు మాత్రం ఆ సోయి లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం మూలధన వ్యయాన్ని ఆయన పెంచలేదు. 2022-23లో ఏపీ బడ్జెట్‌ రూ.2.25 లక్షల కోట్లు. అందులో  కేవలం రూ.7,244 కోట్లనే అభివృద్ధి పనులకోసం వెచ్చించారు.

నిధులు ఇవ్వకుండా మౌలిక వసతుల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు అన్నింటినీ ఎండగట్టింది జగన్‌ సర్కారు. జనాన్ని బాదకుండా రాష్ట్రానికి రాబడి పెంచే పనులేమీ చేయకుండానే కాలం వెళ్లదీసింది.

ప్రజల దీర్ఘకాల శ్రేయస్సును జగన్‌ ప్రభుత్వం తన ఓట్ల రాజకీయాలకు బలిపెట్టింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని