డబ్బులిస్తామని తీసుకొచ్చారు..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గుట్టురట్టయింది. ఈ యాత్రకు దారి పొడవునా జన స్పందన కరవైంది.

Updated : 17 Apr 2024 06:24 IST

‘మేమంతా సిద్ధం’ యాత్ర గుట్టు రట్టు
గుడివాడలో యువకుడి రాయి కలకలం


‘జగన్‌ సభకు వస్తే..నాకు రూ.350 ఇస్తామన్నారు. అందుకే వచ్చా. డబ్బులడిగితే ఇవ్వలేదు. జెండా కర్రలతో కొట్టారు. అందుకే నేను రాయితో కొట్టేందుకు జేబులో పెట్టుకుని తిరుగుతున్నా’

కంకిపాడు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువకుడు పోలీసులకు ఇచ్చిన సమాధానమిది.


సీఎం సభకు రాయితో వచ్చాడన్న కారణంతో పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించి, విచారించినప్పుడు ఈ విషయం బయటపడింది.

‘ఏమైంది నానీ.. ఏం చేస్తున్నారు? ఇదేం సభ నిర్వహణ. మీ ఒక్క నియోజకవర్గం నుంచే 10 వేల నుంచి 20 వేల మందిని తరలించవచ్చు కదా..! ఏమైంది ? సీఎం అసంతృప్తితో ఉన్నారు..!’

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని మందలించిన వైకాపా సమన్వయకర్త బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ నేత.


ఈనాడు, అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గుట్టురట్టయింది. ఈ యాత్రకు దారి పొడవునా జన స్పందన కరవైంది. గుడివాడలో నిర్వహించిన బహిరంగసభ జనం లేక వెలవెలబోయింది. జనాన్ని తరలించడంలో నిర్లక్ష్యం చేశారని గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నానిపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. జిల్లా అభ్యర్థులపై కస్సుబుస్సులాడారని సమాచారం. కృష్ణా జిల్లాలో నేతల తీరుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

వెలంపల్లి గుట్టు రట్టు..!

సీఎం జగన్‌ ఎన్టీఆర్‌ జిల్లాలో కనీసం సభ కూడా నిర్వహించలేదు. ఈ నెల 13న జిల్లాలోకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశించినప్పుడు.. వారధి వద్ద భారీగా జనం వచ్చారని చూపించేందుకు కృష్ణలంక వద్ద చాలాసేపు ట్రాఫిక్‌ నిలిపేశారు. ఆ తర్వాత రోడ్డు షోకు జనం నుంచి స్పందనే లేదు. ప్రధానంగా సెంట్రల్‌ నియోజకవర్గంలో అసలు స్పందనే కానరాలేదు. ఇలాంటి సమయంలో సింగ్‌నగర్‌ సమీపంలో రాయి సంఘటన జరగడం గమనార్హం. అప్పటికే జనం లేక కనీసం బస్సు దిగకుండా సీఎం జగన్‌ చేయి ఊపుతూ వచ్చారు. కానీ జన స్పందన అనూహ్యం అంటూ నేతలు గొప్పలు చెప్పుకొచ్చారు. తాజాగా సింగ్‌నగర్‌ వాసులు అసలు విషయాన్ని బయట పెట్టారు. తమకు రూ.200, రూ.300 ఇస్తామంటే వచ్చామని ఇప్పుడు తమపైనే కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

14 నియోజకవర్గాల నుంచి ఇంతేనా..?

గుడివాడ సభకు మూడు జిల్లాలు.. 14 నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించేందుకు అన్ని గ్రామాలకు వైకాపా నేతలు బస్సులు పంపారు. రూ. 300, మద్యం సీసా, బిర్యానీ ప్యాకెట్‌తోపాటు చేతికి జెండా ఇచ్చారు. అయినా జనం నామమాత్రంగానే స్పందించారు. వచ్చిన వారు సైతం కొడాలి నాని ప్రసంగిస్తుండగానే వెనుదిరిగారు. గ్యాలరీల్లో జనం లేక కుర్చీలు ఖాళీగా కనిపించాయి. సీఎం జగన్‌ ప్రసంగించిన సమయంలో వేదిక సమీపంలో తప్ప జనం లేరు. ‘ఇల ఇలా’ అంటూ చెప్పాలని ఆయన పదేపదే కోరినా స్పందన లేదు. జనం తక్కువగా వచ్చారని నిఘా వర్గాలిచ్చిన సమాచారంతో వైకాపా నాయకుల నోట్లో పచ్చివెలక్కాయ పడింది.

ఎంపీ అభ్యర్థిపై రుసరుస..!

గుడివాడ నియోజకవర్గంలో తనను కాదని ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ సొంతంగా లాబీయింగు చేస్తున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని రుసరుసలాడినట్లు తెలిసింది. డాక్టర్‌గా మంచి పేరున్న చంద్రశేఖర్‌ గతంలో రాజకీయాలకు దూరంగా ఉండేవారు. అలాగని రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి కాదు. ఆయన తండ్రి సింహాద్రి సత్యనారాయణ తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. సింహాద్రి తన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని గుడివాడలో రాజకీయాలు చేస్తున్నారనే సమాచారంతో కొడాలి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు సీఎం అక్షింతలు వేయడంతో అసహనానికి గురయ్యారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని