గులకరాయి కేసులో కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

గులకరాయి కేసులో నిందితుడు సతీష్‌ను పోలీసు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.

Published : 24 Apr 2024 06:29 IST

తీర్పు నేటికి వాయిదా వేసిన న్యాయాధికారి

ఈనాడు, అమరావతి: గులకరాయి కేసులో నిందితుడు సతీష్‌ను పోలీసు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పు బుధవారానికి వాయిదా పడింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని, రిమాండ్‌లో ఉన్న నిందితుడిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. నిందితుడి తరఫు న్యాయవాది సలీం కౌంటర్‌ దాఖలు చేశారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి సి.రమణారెడ్డి.. కస్టడీ పిటిషన్‌పై బుధవారం తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపి కేసు వాయిదా వేశారు.

చిన్న గాయానికే 307 సెక్షన్‌ వర్తించదు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రాయి తగలడం వల్ల చిన్న గాయమైందని, దీనికే పోలీసులు హత్యాయత్నం సెక్షన్‌ పెట్టారని న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. ఈ ఘటన పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఎన్నికల్లో తిరిగి గెలుపొందడమే లక్ష్యంగా వైకాపా ఈ డ్రామా ఆడిందన్నారు. ఈ ఘటన వెనక నేరపూరిత కుట్ర ఉందని చెబుతున్న ప్రాసిక్యూషన్‌.. దానికి మద్దతుగా ఎలాంటి సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేదని గుర్తుచేశారు. పోలీసులు ఇప్పటికే నాలుగో ఏసీఎంఎం కోర్టులో 164 సీఆర్పీసీ కింద నిందితుడి వాంగ్మూలం నమోదుకు పిటిషన్‌ దాఖలు చేశారని, ఈ దశలో కస్టడీ కోరడం సహేతుకం కాదన్నారు. ఇది కేవలం 41ఏ నోటీసు ఇవ్వాల్సిన కేసు అని, నిందితుడిని వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు.

కస్టడీకి ఇస్తే మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయి

ముఖ్యమంత్రి జగన్‌పై తానే రాయి వేశానని నిందితుడు సతీష్‌ ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో అంగీకరించారని ఏపీపీ కృష్ణకిశోర్‌ వాదించారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పోలీసు కస్టడీకి అనుమతిస్తే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ ఘటన వెనక సూత్రధారులు ఎవరనేది బయటకు రాలేదని.. బాధితుడు ఏపీ ముఖ్యమంత్రి అయినందున ఈ వ్యవహారంలో మరింత పక్కాగా దర్యాప్తు సాగాలన్నారు. నిందితుడి నుంచి పలు కోణాల్లో వివరాలు సేకరించాల్సి ఉందని ఏపీపీ వాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని