Updated : 07 Dec 2021 05:20 IST

Nagaland Firing: పౌరులపై కాల్పులు విచారకరం

నాగాలాండ్‌ ఘటనలపై లోక్‌సభలో అమిత్‌ షా వివరణ

దిల్లీ: నాగాలాండ్‌ కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నెల రోజుల్లోనే దర్యాప్తును ముగిస్తుందని తెలిపింది. సాధారణ పౌరులపై కాల్పులు పునరావృతం కాకుండా సాయుధ బలగాలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. నాగాలాండ్‌లో తాజా పరిణామాలపై తాము కన్నేసి ఉంచామని పేర్కొంది. అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. నాగాలాండ్‌ కాల్పుల వ్యవహారంపై ప్రతిపక్షాల డిమాండ్ల నేపథ్యంలో లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం ఈ మేరకు వివరణ ఇచ్చారు. సైన్యం కాల్పుల్లో మృతిచెందినవారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. కాల్పులు చోటుచేసుకున్న పరిణామక్రమాన్ని ఆయన సభకు నివేదించారు.

‘‘నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో తిరుగుబాటుదారుల కదలికలపై సైన్యానికి శనివారం సమాచారం అందింది. వెంటనే మెరుపుదాడి జరిపేందుకు 21 పారా కమాండో బలగాలు రంగంలోకి దిగాయి. తిరు, ఓటింగ్‌ గ్రామాల మధ్య రోడ్డుపై వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించాయి. బలగాల సిగ్నల్‌ను పట్టించుకోకుండా వాహనం మరింత వేగంగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో- అందులో తిరుగుబాటుదారులు ఉన్నారని అనుమానించి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు కాల్పుల్లో మృత్యువాతపడ్డారు. వారు తిరుగుబాటుదారులు కాదని, బలగాల పొరపాటు కారణంగా కాల్పులు చోటుచేసుకున్నాయని తర్వాత నిర్ధారణ అయింది. గాయపడ్డ ఇద్దరిని సైనిక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కాల్పుల సంగతి తెలియగానే స్థానికులు బలగాలను చుట్టుముట్టి దాడి చేశారు. ఈ ఘర్షణలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయపడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో ఆత్మరక్షణ కోసం భద్రతా బలగాలు మళ్లీ కాల్పులు జరిపాయి. ఫలితంగా మరో ఏడుగురు పౌరులు దుర్మరణం పాలయ్యారు. ఆందోళనకారులు ఆదివారం సాయంత్రం అస్సాం రైఫిల్స్‌ శిబిరంపై దాడి చేయగా.. అక్కడ సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ పౌరుడు మృత్యువాతపడ్డాడు’’ అని షా వివరించారు. అమిత్‌ షా ప్రకటనపై సంతృప్తి చెందని కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ సహా పలు ప్రతిపక్ష పార్టీల సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు. తృణమూల్‌ ఎంపీలు వాకౌట్‌ చేయలేదు.

ఓటింగ్‌ వద్ద జరిగిన కాల్పుల్లో మృతులకు నివాళులర్పిస్తున్న కుటుంబసభ్యులు, స్థానికులు

దద్దరిల్లిన పార్లమెంటు
అంతకుముందు, నాగాలాండ్‌ కాల్పుల వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. పౌరుల హత్యలను కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన, వైకాపా, డీఎంకే, బీఎస్పీ సహా పలు పార్టీల ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని, నాగాలాండ్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరించుకోవాలని, కాల్పులపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఏఎఫ్‌ఎస్‌పీఏను ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలంటూ కేంద్రాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ నిలదీశారు.


తీవ్ర దురదృష్టకరం: ఎం.వెంకయ్యనాయుడు

పౌరులపై కాల్పుల వ్యవహారం రాజ్యసభనూ తాకింది. తొలుత ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే (కాంగ్రెస్‌) డిమాండ్‌ చేశారు. ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. తాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షాలతో మాట్లాడానని తెలిపారు. సోమవారం మధ్యాహ్నమే ప్రకటన చేస్తానంటూ షా తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత అప్పటికే ఆ అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో ఇతర ఎంపీలు దానిపై మాట్లాడేందుకు ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు అనుమతి ఇవ్వలేదు. షా ప్రకటన చేశాక మళ్లీ ఆ అంశంపై మాట్లాడేందుకు అనుమతిస్తానని హామీ ఇచ్చారు. కాల్పుల ఘటన తీవ్ర దురదృష్టకరమని వెంకయ్యనాయుడు అన్నారు. దాని సున్నితత్వం, తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని ఎంపీలకు సూచించారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts