Adani Group: మరో వ్యాపారంలోకి అదానీ గ్రూప్‌.. అనుమతులు సిద్ధం!

ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ (Gautam Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ (Adani Group) మరో వ్యాపారంలోకీ ప్రవేశించబోతోంది.

Updated : 11 Aug 2022 19:18 IST

భువనేశ్వర్‌: ఆసియా కుబేరుడు గౌతమ్‌ అదానీ (Gautam Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ (Adani Group) మరో వ్యాపారంలోకి ప్రవేశించబోతోంది. అల్యూమినియం రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా సిద్ధమైంది. ఈ మేరకు ఒడిశాలో 5.2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.41.30 వేల కోట్లు)తో అల్యూమినా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది. ఈ మేరకు అనుమతులు లభించినట్లు తెలిపింది. 

ఒడిశా ప్రాజెక్టుపై స్పందించడానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధి నిరాకరించారు. అయితే, ముంద్రా అల్యూమినియం లిమిటెడ్‌ పేరిట గత డిసెంబరులోనే అదానీ గ్రూప్‌ ఓ అనుబంధ సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే. తద్వారా అల్యూమినియం వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు సంకేతాలిచ్చింది. ప్రస్తుతం ఈ రంగంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌, వేదాంత రిసోర్సెస్‌ లిమిటెడ్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. 

ఇతర రంగాల్లో వేగంగా అడుగులు..

తొలుత వ్యవసాయోత్పత్తుల వ్యాపారంలో ఉన్న అదానీ క్రమంగా నౌకాశ్రయాల రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత వరుసగా విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధనం రంగాల్లోకి వేగంగా అడుగులు వేశారు. లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న హోల్సిమ్‌ లిమిటెడ్‌కు చెందిన భారత విభాగాన్ని సొంతం చేసుకోవడం ద్వారా రాత్రికి రాత్రే అదానీ గ్రూప్‌ సిమెంట్‌ తయారీ రంగంలోకీ ప్రవేశించింది. ఇదే వరుసలో లోహ రంగంలో ఉన్న అవకాశాలనూ అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఉక్కు, రాగి తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

గుజరాత్‌లో ఐదు లక్షల టన్నుల సామర్థ్యంతో రాగి శుద్ధి కాంప్లెక్స్‌ ఏర్పాటు కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ జూన్‌లో రూ.6,070 కోట్ల రుణాలను సమీకరించింది. మరోవైపు దక్షిణ కొరియాకు చెందిన ఉక్కు దిగ్గజం పోస్కోతో ఒప్పందం కుదుర్చుకొంది. ఇరు సంస్థలు కలసి భారత్‌లో స్టీల్‌ మిల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ రంగంలో ఉన్న వ్యాపార అవకాశాలపై పనిచేయనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని