Adani Group: ఆరోపణల నుంచి బయటపడేందుకు ‘అదానీ’ ఆడిట్‌ మార్గం!

Adani Group: షేర్ల విలువ పతనానికి అడ్డుకట్ట వేసేందుకు అదానీ గ్రూప్‌ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేయగా.. తాజాగా కంపెనీల్లో స్వతంత్ర ఆడిట్‌ కోసం ఓ సంస్థను నియమించింది.

Published : 14 Feb 2023 14:58 IST

దిల్లీ: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) ఆరోపణలు నుంచి బయటపడేందుకు అదానీ గ్రూప్‌ (Adani Group) చర్యలు చేపట్టింది. ఈ మేరకు తమ గ్రూప్‌ (Adani Group)లోని కొన్ని కంపెనీల స్వతంత్ర ఆడిట్‌ కోసం అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్టన్‌ (Grant Thornton)ను నియమించింది. తద్వారా పెట్టుబడిదారులు, నియంత్రణా సంస్థలకు భరోసా ఇవ్వాలని భావిస్తోంది.

తమ కంపెనీలు ఏ విషయాన్ని దాచిపెట్టలేదని ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)’ సహా నియంత్రణా సంస్థలకు చూపించడమే ఆడిట్‌ ప్రాథమిక లక్ష్యమని కంపెనీ వర్గాలు తెలిపాయి. అలాగే అన్ని నిబంధనలు పాటించినట్లు చూపించాలని కూడా సంస్థ భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. నిధుల దుర్వినియోగం, స్వదేశీ నిధుల దారి మళ్లింపు, రుణాలను ఇతర అవసరాలకు వినియోగించడం వంటి ఆరోపణలపై ఆడిట్‌ ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిపాయి.

కంపెనీ ఖాతాలు బలంగా ఉన్నాయని, ప్రాజెక్టుల అమలు నిరాటంకంగా కొనసాగుతుందని ఆడిట్‌ ద్వారా చూపించాలని అదానీ గ్రూప్‌ (Adani Group) భావిస్తున్నట్లు సమాచారం. షేర్ల విలువల పతనానికి అడ్డుకట్టవేసే యత్నాల్లో భాగంగా గ్రూప్‌ ఈ చర్యలు చేపడుతోంది. తమ పెట్టుబడి ప్రణాళికల విషయంలో ముందుకే వెళుతున్నట్లు.. అన్నింటికీ పూర్తి స్థాయిలో నిధులు ఉన్నట్లు సోమవారం తెలిపింది. వాటాదార్లకు తగిన ప్రతిఫలాలను ఇవ్వగలమని ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు గ్రూప్‌నకు చెందిన ఏడు నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ సగానికి పైగా తగ్గిన సంగతి తెలిసిందే.

వృద్ధి లక్ష్యాలు, మూలధన వ్యయాల్లో కోత విధించొచ్చన్న వార్తలను అదానీ గ్రూప్‌ (Adani Group) కొట్టిపారేసింది. ప్రాజెక్టులు ఆలస్యం అవ్వొచ్చు కానీ.. వాయిదా పడడం లేదా విరమించుకోవడం జరగదని స్పష్టం చేసింది. సౌర విద్యుత్తు, హరిత హైడ్రోజన్‌, విమానాశ్రయాల విస్తరణ ప్రణాళికలు అనుకున్న సమయానికే పూర్తి అవుతాయని వివరించింది. అదానీ గ్రీన్‌కు తన మొత్తం రూ.22,000 కోట్ల బకాయిలను గడువు (2025 మార్చి )లోగా తీర్చే సత్తా ఉందని బెర్న్‌స్టీన్‌ రీసెర్చ్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని