Amazon: కృత్రిమ మేధ స్టార్టప్‌లో అమెజాన్‌ రూ.33 వేల కోట్ల పెట్టుబడులు

Amazon: ‘జనరేటివ్‌ ఏఐ వ్యవస్థ (generative AI systems)’ల అభివృద్ధికి అమెజాన్‌, ఆంత్రోపిక్‌ కలిసి పనిచేయనున్నాయి. అందులో భాగంగా ఇరు కంపెనీల భాగస్వామ్యంలో ‘ఫౌండేషన్‌ మోడల్స్‌’ను అభివృద్ధి చేయనున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

Published : 25 Sep 2023 17:44 IST

వాషింగ్టన్‌: బడా టెక్‌ కంపెనీలు కృత్రిమ మేధ (Artificial Intelligence- AI)పై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా అమెజాన్‌ (Amazon) నాలుగు బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.33.24 వేల కోట్లు) పెట్టుబడులను ప్రకటించింది. ఈ మొత్తంతో ఆంత్రోపిక్‌ (Anthropic) అనే అంకుర సంస్థలో మైనారిటీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు సోమవారం వెల్లడించింది. రానున్న రోజుల్లో ఏఐ వినియోగం పెరగనున్న నేపథ్యంలో టెక్ దిగ్గజాలు భారీ ఎత్తున పెట్టుబడులను కుమ్మరిస్తున్నాయి. ఈ కొత్తతరం సాంకేతికతలోని అవకాశాలను వేగంగా అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అమెజాన్‌ (Amazon) తాజా భారీ పెట్టుబడులే అందుకు నిదర్శనం.

ఇటీవలి కాలంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ‘జనరేటివ్‌ ఏఐ వ్యవస్థ (generative AI systems)’ల అభివృద్ధికి అమెజాన్‌, ఆంత్రోపిక్‌ కలిసి పనిచేయనున్నాయి. అందులో భాగంగా ఇరు కంపెనీల భాగస్వామ్యంలో ‘ఫౌండేషన్‌ మోడల్స్‌’ను అభివృద్ధి చేయనున్నట్లు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ ఫౌండేషన్‌ మోడల్స్‌నే ‘లార్జ్ లాంగ్వేజ్‌ మోడల్స్‌’గానూ వ్యవహరిస్తున్నారు. బ్లాగ్‌ పోస్ట్‌లు, డిజిటల్‌ పుస్తకాలు, శాస్త్రసాంకేతికత వ్యాసాలు, పాప్ గీతాలు, టెక్ట్స్‌, చిత్రాలు, వీడియోలు సహా మనిషి పనిని పోలే ప్రతి అంశంపై ఈ మోడల్స్‌కు శిక్షణిస్తారు. తాజా ఒప్పందంలో భాగంగా అమెజాన్‌ను ఆంత్రోపిక్‌ తన ప్రాథమిక క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీస్‌గా వినియోగించుకోనుంది. అలాగే ఈ-కామర్స్‌లోని కస్టమ్‌ చిప్స్‌ ద్వారా ‘జనరేటివ్‌ ఏఐ సిస్టమ్స్‌ (generative AI systems)’కు శిక్షణ ఇవ్వనుంది.

ఆంత్రోపిక్‌ శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోంది. దీన్ని చాట్‌జీపీటీ (ChatGPT)ని తయారు చేసిన ఓపెన్‌ఏఐ (OpenAI) సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగులు ప్రారంభించారు. ఇప్పటికే క్లాడ్‌ (Claude) పేరిట చాట్‌జీపీటీ (ChatGPT)కి పోటీగా చాట్‌బాట్‌ను విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇది అమెరికా, బ్రిటన్‌లో అందుబాటులోకి వచ్చింది. వివరమైన ఆదేశాల ద్వారా ఇది సంక్లిష్ట సమస్యలకు సైతం సమాధానాలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఏఐ విషయంలో అమెజాన్‌ తమ ప్రత్యర్థి సంస్థలైన మైక్రోసాఫ్ట్‌ వంటి వాటితో పోటీ పడుతోంది. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్‌ 2019లోనే 1 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. ఆ తర్వాత ఏడాదే మరికొన్ని బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. అమెజాన్‌ (Amazon) సైతం అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటికే ‘అలెక్సా’లో ఏఐతో కూడిన అప్‌డేట్‌ను ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని