iPhone 14: చైనాలో ఆంక్షలు.. భారత్‌లో ఐఫోన్‌-14 తయారీని పెంచిన యాపిల్‌!

చైనాలో ఆంక్షల నేపథ్యంలో యాపిల్‌ భారత్‌లో ఐఫోన్‌-14 తయారీని పెంచింది. ఫాక్స్‌కాన్‌తో పాటు పెగాట్రాన్‌కు కూడా కాంట్రాక్టును అప్పగించింది.

Published : 04 Nov 2022 13:43 IST

బెంగళూరు: భారత్‌లో ఐఫోన్‌-14 తయారీని మరో కంపెనీ కూడా చేపట్టింది. తైవాన్‌కు చెందిన పెగాట్రాన్‌కు కూడా తాజాగా యాపిల్‌ ఈ కాంట్రాక్టును అప్పగించింది. ఫాక్స్‌కాన్‌ కంపెనీ తమ అనుబంధ సంస్థ ఆధ్వర్వంలో ఇప్పటికే చెన్నైలోని ప్లాంటులో ఐఫోన్‌-14ను అసెంబుల్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌ తయారీ కేంద్రం చైనాలో ఉంది. దీన్ని ఫాక్స్‌కాన్‌ నిర్వహిస్తోంది. అయితే, కరోనా కట్టడి నిమిత్తం అక్కడి ప్రభుత్వం ఈ ప్లాంట్‌ చుట్టూ కఠిన ఆంక్షలు విధించింది. దీంతో ఐఫోన్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని యాపిల్‌ ఆందోళన చెందుతోంది. గతంలోనూ చైనాలో లాక్‌డౌన్ల వల్ల ఐఫోన్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే అమెరికా- చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమూ యాపిల్‌కు ఇబ్బందికర పరిణామాల్ని తెచ్చిపెట్టింది. దీంతో యాపిల్‌ తమ తయారీని ఇతర దేశాలకూ మళ్లించే యోచనలో ఉంది. అందులో భాగంగా భారత్‌లో తయారీని పెంచింది. తాజా లాక్‌డౌన్‌తో దాన్ని మరింత విస్తృతం చేసింది. 

భారత్‌లో ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్‌, పెగాట్రాన్.. యాపిల్‌ కాంట్రాక్ట్‌ తయారీ భాగస్వాములుగా ఉన్నాయి. ఇవన్నీ తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. తద్వారా చైనాలో తగ్గుతున్న తయారీని సమతుల్యం చేస్తున్నాయి. చైనాలో కొత్త సంవత్సరం వేళ భారీ ఎత్తున విక్రయాలు జరుగుతాయి. ఈ తరుణంలో తయారీ దెబ్బతింటే అది విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలోనే యాపిల్‌ అప్రమత్తమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని