China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!

రూ.12 వేలలోపు విభాగంలో చైనా సంస్థల స్మార్ట్‌ఫోన్ల(China Smartphones)ను భారత్‌లో విక్రయించకుండా పరిమితులు విధించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఇటీవల ఓ నివేదిక పేర్కొంది. కానీ.. దీన్ని ఖండిస్తూ..

Published : 11 Aug 2022 23:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ తయారీదార్లను కాపాడుకునేందుకు వీలుగా రూ.12 వేలలోపు విభాగంలో చైనా సంస్థల స్మార్ట్‌ఫోన్ల(China Smartphones)ను భారత్‌లో విక్రయించకుండా పరిమితులు విధించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఇటీవల ఓ నివేదిక పేర్కొంది. కానీ.. దీన్ని ఖండిస్తూ.. ప్రభుత్వం నుంచి అలాంటి ఆలోచనేది లేదని తాజాగా మరో కొత్త నివేదిక బయటకువచ్చింది. ఈ పరిణామంతో సంబంధం ఉన్న ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ.. రూ.12 వేలలోపు చైనా స్మార్ట్‌ఫోన్‌లను కట్టడి చేసే ప్రతిపాదనేది ప్రభుత్వ పరిశీలనలో లేదని ఓ వార్తాసంస్థ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌కు చైనా సరఫరాలు కీలకమని, మరోవైపు దేశీయ సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్రం వద్ద ప్రతిపాదనలు ఉన్నట్లు ఇండియా సెల్యూలార్‌, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌(ICEA) పేర్కొన్నట్లు తెలిపింది.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ విపణి అయిన మన దేశంలో.. రూ.12 వేల లోపు స్మార్ట్‌ఫోన్ల విభాగంలో షియామీ, వివో, ఓపో, రియల్‌మీ వంటి చైనా సంస్థల దూకుడే ఎక్కువ. 80 శాతం వాటా చైనా కంపెనీలదే. ఈ నేపథ్యంలోనే.. దేశీయ సంస్థలను ఆదుకునేందుకు వీలుగా చైనా ఫోన్లను కట్టడి చేస్తారని తొలుత నివేదికలు వచ్చాయి. పైగా.. షియామీతోపాటు ఒపో, వివో సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై అనుమానాలతో.. ఇటీవల పన్ను అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. నగదును విదేశాలకు అక్రమంగా తరలించారనే ఆరోపణలతో ఈ కంపెనీలపై కేసులూ నమోదయ్యాయి. చైనా సంస్థల తీరు పారదర్శకంగా లేదని ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇటీవల పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని