Freebies: ‘కనీస అవసరాలను పొందడం పేదల హక్కు.. అవి ఉచితాలు కాదు’

పౌష్టికాహారం, హెల్త్‌కేర్‌, నివాసం, విద్య.. వంటి పౌరుల కనీస అవసరాలను తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అని ప్రముక ఆర్థికవేత్త జయతీ ఘోష్‌ తెలిపారు.

Updated : 19 Aug 2022 15:36 IST

ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌

దిల్లీ: పౌష్టికాహారం, హెల్త్‌కేర్‌, నివాసం, విద్య.. వంటి పౌరుల కనీస అవసరాలను తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌ అన్నారు. వీటిని ఉచిత తాయిలాలుగా పరిగణించొద్దని వ్యాఖ్యానించారు. వీటిని పొందడం పేద ప్రజల హక్కు అని ఉద్ఘాటించారు.

భారత్‌లో పెద్ద ఎత్తున పేదరికం ఉందని జయతీ ఘోష్‌ తెలిపారు. సరైన విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, నివాసం.. వంటి కనీస అవసరాలను అందించడంలో భారత్‌ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిందని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో కనీస అవసరాలను తీర్చే నాణ్యమైన వస్తువులు, సేవల్ని అందించడం ప్రభుత్వ కనీస బాధ్యతగా భావిస్తారని.. ఉచితాలుగా పరిగణించరని తెలిపారు. భారత పన్నుల వ్యవస్థలో పరోక్ష పన్నులదే సింహభాగమని ఆమె తెలిపారు. దీనివల్ల మన దేశంలో ధనవంతుల కంటే పేద ప్రజలే ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కాబట్టి వారికి కనీస అవసరాలు పొందే హక్కు ఉందని తెలిపారు.

ఇటీవల ఉచిత తాయిలాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఇటీవల దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాల వల్ల పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా అవుతోందని చెప్పుకొచ్చారు. పైగా భారత స్వయంసమృద్ధికి ఇవి అవరోధాలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రధానంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల హామీలను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. ముగిసిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంతో పాటు రాబోయే గుజరాత్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆప్‌ ఉచిత విద్యుత్తు, ఉచిత నీరు వంటి హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సైతం ఉచితాలపై స్పందిస్తూ.. ఉచిత పథకాల అంశం రోజురోజుకీ సంక్లిష్టంగా మారుతోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస అవసరాలు కల్పించడాన్ని ఉచితం అనగలమా? అని ప్రశ్నించారు.

బ్రిక్స్‌, జీ20 సభ్యదేశాల్లో భారత స్థూల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జయతీ ఘోష్‌ తెలిపారు. గిరాకీ ఇంకా తక్కువగానే ఉందన్నారు. నిరుద్యోగిత పెరిగిపోతోందన్నారు. పేదరికం, ఆహార అభద్రత సైతం పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఆర్‌బీఐ పెద్దఎత్తున ఖర్చు చేసినప్పటికీ.. రూపాయి పతనం మరింత కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. దీనివల్ల ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. అయితే.. శ్రీలంక తరహాలో భారత్‌లో సంక్షోభం రాబోదని ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వ రుణాలు శ్రీలంక స్థాయిలో లేవని గుర్తుచేశారు. అయితే, సమీప భవిష్యత్తులో కొన్ని ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పవని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని