GST on Ganajal: గంగా జలంపై జీఎస్టీ లేదు.. CBIC క్లారిటీ

GST on Ganajal | గంగాజలంపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదని సీబీఐసీ స్పష్టతనిచ్చింది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి జీఎస్టీ విధించడం లేదని తెలిపింది. 

Published : 12 Oct 2023 17:50 IST

దిల్లీ: గంగా జలంపై 18 శాతం జీఎస్టీ (GST) విధిస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలపై కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (CBIC) స్పందించింది. గంగా జలంపై జీఎస్టీ విధించడం లేదని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా ఇళ్లలో పూజ కోసం వినియోగించే గంగాజలానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని సీబీఐసీ పేర్కొంది. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దీనిపై ఎలాంటి జీఎస్టీ విధించడం లేదని తెలిపింది.

జీఎస్టీ కౌన్సిల్‌ 14, 15 సమావేశాల్లో పూజా సామగ్రిపై జీఎస్టీ అంశం చర్చకు రాగా.. వాటికి మినహాయింపు జాబితాలోనే ఉంచాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా సీబీఐసీ పేర్కొంది. ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌ పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే గురువారం గంగాజలం గురించి ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఉత్తరాఖండ్‌లో ఇవాళ మీరు పర్యటిస్తున్నారు. కానీ మీ ప్రభుత్వం ఇదే గంగాజలానికి 18 శాతం జీఎస్టీ విధిస్తోంది. ఇంట్లో పెట్టుకునే పవిత్ర గంగా జలానికీ జీఎస్టీ విధించడం తగదు’’ అంటూ ఖర్గే పోస్ట్‌ పెట్టారు. ఈ నేపథ్యంలో గంగాజలంపై జీఎస్టీ గురించి సీబీఐసీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని