Amazon: ఉద్యోగులపై నిఘా.. అమెజాన్‌కు భారీ జరిమానా

ఉద్యోగులపై మితిమీరిన నిఘా ఉంచిందనే ఆరోపణలతో అమెజాన్‌కు ఫ్రాన్స్‌ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ భారీ జరిమానా విధించింది.

Published : 24 Jan 2024 13:38 IST

పారిస్‌: ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon)కి ఫ్రాన్స్‌ డేటా ప్రొటెక్షన్‌ ఏజెన్సీ సీఎన్‌ఐఎల్‌ (CNIL) భారీ జరిమానా విధించింది. ఉద్యోగుల పనితీరుపై మితిమీరిన నిఘా ఉంచినందున 32 మిలియన్‌ యూరోలు (సుమారు రూ.280 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. యూరోపియన్‌ యూనియన్‌ (EU) జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (GDPR) ప్రకారం ఉద్యోగుల వ్యక్తిగత డేటా సేకరణ, వినియోగంపై వారి అనుమతి తప్పనిసరి. నిబంధనలకు విరుద్ధంగా అమెజాన్‌ డేటాను సేకరించినట్లు సీఎన్‌ఐఎల్‌ ఆరోపించింది. దీనిపై ఉద్యోగుల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి జరిమానా విధించినట్లు తెలిపింది.

వినియోగదారులు ఆర్డర్‌ చేసే ఉత్పత్తుల వివరాలను నమోదు చేసే స్కానింగ్ యంత్రాల ద్వారా నిఘా ఉంచినట్లు తెలిపింది. పది నిమిషాల కంటే ఎక్కువ సమయం అవి పనిచేయకుంటే.. యాజమాన్యానికి అలర్ట్‌ మెసేజ్‌ పంపుతాయని, వాటి ఆధారంగా ఉద్యోగి పనితీరుని విశ్లేషిస్తున్నట్లు వెల్లడించింది. దాంతోపాటు పని ప్రదేశంలో ఉద్యోగులు ఎంతసేపు ఉంటున్నారనే సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపింది. ఈ తరహా నిఘా వల్ల సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించింది. 

బైజూస్‌ విలువ రూ.16,600 కోట్లే.. ఏడాదిలో 90% పతనం

కాగా, దీనిపై అమెజాన్‌ తన చర్యలను సమర్థించుకుంది. వినియోగదారులకు మెరుగైన సర్వీసులను అందించేందుకు, ప్రొడక్ట్‌ను డెలివరీ చేసే ముందు సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు ఇలాంటి వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఉద్యోగులపై నిఘా కోసం ఈ డేటా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు. సీఎన్‌ఐఎల్‌ జరిమానాపై అప్పీల్‌ చేస్తామన్నారు. ఫ్రాన్స్‌లో  అమెజాన్‌కు 8 అతిపెద్ద పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది పనిచేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని