Byjus: బైజూస్‌ విలువ రూ.16,600 కోట్లే.. ఏడాదిలో 90% పతనం

బైజూస్‌ బ్రాండ్‌పై కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్‌టెక్‌ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ తన విలువను భారీగా కోల్పోయింది.

Updated : 24 Jan 2024 07:36 IST

దిల్లీ: బైజూస్‌ బ్రాండ్‌పై కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్‌టెక్‌ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ తన విలువను భారీగా కోల్పోయింది. ఏడాది వ్యవధిలోనే ఈ సంస్థ విలువ రూ.1,82,600 కోట్ల నుంచి రూ.16,600 కోట్లకు పడిపోవడం సంస్థ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. ఫిబ్రవరిలో తాజా షేర్లను జారీ చేయడం ద్వారా ప్రస్తుత పెట్టుబడిదార్ల నుంచి 100 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.830 కోట్ల)ను సమీకరించాలని బైజూస్‌ భావిస్తోంది. 2022 చివర్లో జరిగిన నిధుల సమీకరణ సమయంలో కంపెనీ విలువను 22 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,82,600 కోట్లు)గా లెక్కగట్టగా.. తాజాగా 2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.16,600 కోట్లు)గానే లెక్కగట్టడం గమనార్హం. అంటే సంస్థ విలువ 90 శాతానికి పైగా తగ్గిందన్నమాట. కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ, కొత్తగా సమీకరించే నిధులతో వెండార్లకు చెల్లింపులు చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

నష్టాలు మరింత పెరిగాయ్‌: అనుబంధ సంస్థలు వైట్‌ హాట్‌ జూనియర్‌, ఒస్మోల్లో నష్టాల కారణంగా 2021-22లో సంస్థ నిర్వహణ నష్టం రూ.6,679 కోట్లకు పెరిగింది. ఇందులో పైన పేర్కొన్న రెండు సంస్థల నష్టాలే 45 శాతం (రూ.3,800 కోట్లు) ఉన్నాయి. 2020-21లో సంస్థ నష్టం రూ.4,143 కోట్లతో పోలిస్తే 2021-22 నష్టం మరింత పెరిగినట్లయింది. ఆదాయాలు కూడా రూ.2428.39 కోట్ల నుంచి రూ.5,298.43 కోట్లకు పెరిగాయి. బైజూస్‌ ఇతర అనుబంధ సంస్థలైన ఆకాశ్‌, గ్రేట్‌ లెర్నింగ్‌ ఆదాయాలు పెరిగాయి. ఆకాశ్‌ ఆదాయం 40% పెరిగి రూ.1491 కోట్లకు, గ్రేట్‌లెర్నింగ్‌ ఆదాయం 80% వృద్ధితో రూ.628 కోట్లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని