Gautam Adani: మళ్లీ 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి గౌతమ్‌ అదానీ

Gautam Adani: అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు కొన్ని రోజులుగా భారీగా పుంజుకుంటున్నాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద 100 బిలియన్‌ డాలర్లు దాటింది.

Updated : 08 Feb 2024 14:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అదానీ గ్రూప్ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) మళ్లీ 100 బిలియన్‌ డాలర్ల సంపద కలిగిన ధనవంతుల జాబితాలో చేరారు. గతేడాది హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత ఆయన సంపద భారీగా కుంగిన విషయం తెలిసిందే. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో 101 బిలియన్‌ డాలర్లతో ప్రస్తుతం 12వ స్థానంలో కొనసాగుతున్నారు. గతకొన్ని రోజుల్లో అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి.

2022లో 150 బిలియన్‌ డాలర్ల వద్ద గౌతమ్‌ అదానీ (Gautam Adani) సంపద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆయన సంపద దాదాపు 37.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల జాబితాలో తొలి 25 మందిలో స్థానం కోల్పోయారు.

కైనటిక్‌ ఇ-లూనా వచ్చేసింది..సింగిల్‌ ఛార్జ్‌తో 110km

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అదానీ గ్రూప్‌ (Adani Group).. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపడం కోసం పలు చర్యలు చేపట్టింది. రుణ వాయిదాలను ముందస్తుగానే చెల్లించింది. కొత్తగా నిధులను సమీకరించుకుంది. మరోవైపు తమ దర్యాప్తులో హిండెన్‌బర్గ్‌ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తేల్చింది. ఇదే విషయంపై దృష్టిపెట్టిన సెబీ 22 అంశాల్లో దర్యాప్తు పూర్తి చేసింది. మరో రెండు అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు గత నెల సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. సెబీ దర్యాప్తును సవాల్‌ చేస్తూ సిట్‌ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అదనపు చర్యలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలతో షేర్లు భారీగా పుంజుకున్నాయి.

అదానీ గ్రూప్‌ (Adani Group) తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందినట్లు ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. పన్నుల విషయంలో సరళ నిబంధనలున్న కరేబియన్‌, మారిషస్‌ల నుంచి యూఏఈలో పలు డొల్ల కంపెనీలను అదానీ కుటుంబం నియంత్రిస్తోందని తెలిపింది. వీటి ద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు