Mark Zuckerberg: రూ.245 కోట్లకు ఇల్లు అమ్మిన జుకర్‌బర్గ్‌

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఇంటి విక్రయం నమోదైంది. ఆ విక్రేత, ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడైన మార్క్‌ జుకర్‌బర్గ్‌ కావడమే ఇక్కడ విశేషం. పదేళ్ల కిందట కొన్న ధరకు మూడింతలకు ఆయన తన ఇంటిని విక్రయించారు.

Updated : 27 Jul 2022 06:55 IST

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఇంటి విక్రయం నమోదైంది. ఆ విక్రేత, ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడైన మార్క్‌ జుకర్‌బర్గ్‌ కావడమే ఇక్కడ విశేషం. పదేళ్ల కిందట కొన్న ధరకు మూడింతలకు ఆయన తన ఇంటిని విక్రయించారు. ఈ ఏడాదిలో తన సంపద దాదాపు సగం మేర హరించుకుపోయిన నేపథ్యంలో, జుకర్‌బర్గ్‌ ఇంటిని విక్రయించడం గమనార్హం. 2012 నవంబరులో ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడైన జుకర్‌బర్గ్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఒక ఇంటిని 10 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేశారు. రూపాయల్లో చెప్పాలంటే దీని విలువ సుమారు రూ.79 కోట్లు (ఇప్పటి మారకపు రేటుతో). మిషన్‌ డిస్ట్రిక్ట్‌కు సమీపంలో పావు ఎకరం స్థలంలో దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 1928లో నిర్మితమైన ఇల్లది. ఫేస్‌బుక్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసిన కొద్ది నెలలకే ఈ ఇంటిని జుకర్‌బర్గ్‌ కొనుగోలు చేశారు. ఆయన భార్య ప్రిసిలా చాన్‌తో కలిసి 2013లో లక్షల డాలర్లు వెచ్చించి తమకు కావల్సిన రీతిలో మార్చుకున్నారు కూడా. తాజాగా దీనిని 31 మిలియన్‌ డాలర్ల (సుమారు 245 కోట్ల)కు విక్రయించారు. ఈయనకు సిలికాన్‌ వ్యాలీ, లేక్‌ టేహో, హవాయ్‌లలోనూ నివాసాలున్నాయి. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. మార్క్‌ సంపద 61.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2022లో ఆయన సంపద విలువ సగానికి పైగా హరించుకుపోయినా, ప్రపంచ కుబేరుల్లో 17వ స్థానంలో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని