ఆర్‌బీఐ నిర్ణయమే కీలకం

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్న తరుణంలో, ఈనెల 28-30 తేదీల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జరపనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కీలకం కానున్నాయి.

Published : 26 Sep 2022 02:34 IST

స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం
రెపోరేటు 0.50% వరకు పెంచొచ్చనే అంచనాలు
విదేశీ పెట్టుబడుల తీరూ ముఖ్యమే
ఔషధ, ఎఫ్‌ఎమ్‌సీజీ రాణించొచ్చు
ఇతర రంగాల్లో ప్రతికూలతలు
విశ్లేషకుల అంచనాలు

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్న తరుణంలో, ఈనెల 28-30 తేదీల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జరపనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణంతో పాటు ఇతర అంశాలపై ఆర్‌బీఐ గవర్నర్‌ చేయబోయే వ్యాఖ్యలు, విదేశీ పెట్టుబడుల తీరు మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రెపోరేటును మరో 50 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచొచ్చనే ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలు కొవిడ్‌ ముందుస్థాయికి చేరనందున.. ఆర్‌బీఐ వడ్డీరేట్లు పెంచినా, దూకుడుగా వెళ్లకపోవచ్చని ఏషియన్‌ డెవపల్‌మెంట్‌ బ్యాంక్‌ పేర్కొంది. వడ్డీరేట్లపై యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మంగళవారం తీసుకునే నిర్ణయమూ ప్రభావం చూపొచ్చు. దేశీయంగా చూస్తే.. నిఫ్టీ-50లో శ్రీసిమెంట్‌ స్థానంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రానుంది. హర్ష ఇంజినీర్స్‌ సోమవారం ఎక్స్ఛేంజీల్లో నమోదు కానుంది. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* సిమెంటు కంపెనీల షేర్లు స్తబ్దుగా కదలాడొచ్చు. అన్ని ప్రాంతాల్లోనూ ధరల విషయంలో తయారీదార్లు బలహీనంగా ఉండడం ఇందుకు నేపథ్యం. వ్యయాల ఒత్తిళ్లు, గిరాకీ పుంజుకోవడం వంటివి ఈ రంగానికి కీలకంగా మారొచ్చు.

* యంత్ర పరికరాల షేర్లు ఒత్తిడిలో కనిపించొచ్చు. శుక్రవారం వెలువడే ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ నిర్ణయాన్ని బట్టి ఇవి కదలాడవచ్చు. దీర్ఘకాలానికి మాత్రం ఈ రంగంపై అంచనాలు బలంగా ఉన్నాయి.

* టెలికాం షేర్లు కీలక సూచీల నుంచే సంకేతాలు అందుకుంటాయి. 5జీ సేవల ప్రారంభంపై అక్టోబరు 1న ప్రధాని నరేంద్రమోదీ చేసే ప్రకటన ఈ రంగానికి ఉపకరించొచ్చు. భారతీ ఎయిర్‌టెల్‌పై విశ్లేషకులు ‘బులిష్‌’గా ఉన్నారు.

* ఐటీ షేర్లు స్తబ్దుగా ఉండొచ్చు. 2022-23 ఆదాయ వృద్ధి అంచనాల కంటే కాస్త తక్కువే ఉంటుందని అసెంచర్‌ పేర్కొనడం ప్రభావం చూపుతుంది. త్రైమాసిక ఫలితాలకు ఇంకా సమయం ఉన్నందున భారీ పొజిషన్లకు మదుపర్లు దూరంగా ఉండొచ్చు.

* ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు మరింత పెరగొచ్చు. ఊగిసలాట మార్కెట్లో రక్షణాత్మక షేర్ల వైపు మదుపర్లు చూస్తుండడమే ఇందుకు కారణం. డాబర్‌, బ్రిటానియా, మారికో, ఐటీసీ సానుకూలంగా కదలాడొచ్చు.

* నిల్వలు పెరిగి, ముడి చమురుకు గిరాకీ స్తబ్దుగా ఉన్నందున, ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు ఒత్తిడిలో కనిపించొచ్చు. పెట్రోలు, డీజిల్‌ రిటైల్‌ ధరలను అనుసరించి రిఫైనరీల షేర్ల చలనాలుంటాయి.

* బ్యాంకు షేర్లలో ట్రేడింగ్‌ జాగ్రత్తగా జరగొచ్చు. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ 39,300-40,400 పాయింట్ల మధ్య కదలాడొచ్చు. 

* మార్కెట్లో ప్రతికూలతల నేపథ్యంలో వాహన కంపెనీల షేర్లు లాభాలను అందుకోకపోవచ్చు. 

* ఔషధ షేర్లు రాణించొచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రపంచ వ్యాప్తంగా మందగమనం వల్ల రక్షణాత్మక రంగాలకు గిరాకీ కనిపిస్తుండడం ఇందుకు నేపథ్యం.

* లోహ షేర్లలో 2-3 నెలలుగా కనిపిస్తున్న ర్యాలీ గత వారం ఆగింది. ఈ వారమూ బలహీనతలు కొనసాగొచ్చు. గిరాకీ మందగించడం, అంతర్జాతీయంగా అల్యూమినియం ధరలపై ఒత్తిడి ఇందుకు కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని