సంక్షిప్త వార్తలు

టాటా సన్స్‌ ఆధ్వర్యంలోని నమోదిత కంపెనీల సంఖ్య ప్రస్తుతం 29 ఉండగా, వీటిని 15కు తగ్గించుకునేందుకు సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టడంపై దృష్టి సారించడం ద్వారా, ఎలాంటి విపణుల్లోనైనా అవి పోటీపడగలిగేలా తీర్చిదిద్దాలన్నదే దీని వెనక టాటాల ఉద్దేశమై ఉండొచ్చని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది.

Updated : 02 Oct 2022 02:33 IST

29 కంపెనీలు వద్దు.. 15 చాలు!

నమోదిత సంస్థలను తగ్గించుకునే యోచనలో టాటాలు

దిల్లీ: టాటా సన్స్‌ ఆధ్వర్యంలోని నమోదిత కంపెనీల సంఖ్య ప్రస్తుతం 29 ఉండగా, వీటిని 15కు తగ్గించుకునేందుకు సంస్థ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టడంపై దృష్టి సారించడం ద్వారా, ఎలాంటి విపణుల్లోనైనా అవి పోటీపడగలిగేలా తీర్చిదిద్దాలన్నదే దీని వెనక టాటాల ఉద్దేశమై ఉండొచ్చని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. సంస్థల వృద్ధి, కార్యకలాపాలపై మరింతగా దృష్టి సారించేందుకు ఏకీకృత ప్రక్రియను టాటా సన్స్‌ వేగవంతం చేస్తోందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. విలీనాల ద్వారా పెద్ద కంపెనీల వద్ద మరిన్ని నగదు నిల్వలు ఉండేందుకూ వీలవుతుందని భావిస్తోంది. టాటా గ్రూపులో 29 నమోదిత సంస్థలతో పాటు 10 రంగాలలో 60 నమోదు కాని సంస్థలు, వందల సంఖ్యలో అనుబంధ సంస్థలూ ఉన్నాయి.

చంద్రశేఖరన్‌ నేతృత్వంలో...: ఒకే తరహా వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలను ఏకీకృతం చేయడం ద్వారా, నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుగపర్చడంపై టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే టాటా బెవరేజెస్‌లో టాటా కాఫీని విలీనం చేశారు. 7 లోహ కంపెనీలను టాటా స్టీల్‌లో విలీనం చేయనున్నట్లు ఇప్పటికే టాటా సన్స్‌ ప్రకటించింది. ఈ ఏడింటిలో 4 నమోదిత సంస్థలూ ఉన్నాయి. ‘ఆయా సందర్భాల్లో, అప్పటి ప్రత్యేక అవసరాల రీత్యా కొన్ని చిన్న కంపెనీలు ఏర్పాటు చేసి, స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేశారు. ఇప్పుడు వీటి విలీనం వల్ల వ్యాపారం, నిధులు, వనరుల సామర్థ్యం మరింతగా పెంచుకోవచ్చ’ని భావిస్తున్నట్లు సమాచారం.

* సాంకేతిక రంగంలో టాటా సన్స్‌కు 3 కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా ఎలెక్సి, టాటా డిజిటల్‌ ఉన్నాయి. వీటిల్లో టాటా డిజిటల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కాలేదు. మిగిలిన రెండు నమోదిత సంస్థలు.

* వాహన రంగంలో టాటా గ్రూప్‌నకు 3 నమోదిత సంస్థలు టాటా మోటార్స్, ఆటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లీస్‌ లిమిటెడ్, ఆటోమొబైల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గోవా లిమిటెడ్‌ ఉన్నాయి. టాటా ఆటోకాంప్‌ సిస్టమ్స్‌ పేరుతో నమోదుకాని సంస్థ కూడా మరోటి ఉంది.

* 2018లో ఏరోస్పేస్, రక్షణ రంగంలోని పలు కంపెనీలను టాటా ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కిందకు టాటా గ్రూపు తీసుకొచ్చింది.

* విమానయాన రంగానికొస్తే.. ఎయిరేషియా ఇండియా, విస్తారాలను 2024 కల్లా ఎయిరిండియాలో విలీనం చేసే ప్రక్రియపై టాటాలు దృష్టి సారిస్తున్నట్లు వార్తలొచ్చాయి.

* రిటైల్‌ రంగంలోనూ ట్రెంట్, వోల్టాస్, టైటన్, ఇన్‌ఫినిటీ రిటైల్‌ (క్రోమా) లాంటి పలు కంపెనీలు టాటాలకు ఉన్నాయి.


678 కోట్ల యూపీఐ లావాదేవీలు

విలువ రూ.11.16 లక్షల కోట్లు

దిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారిత లావాదేవీల సంఖ్యతో పాటు, లావాదేవీల మొత్తం విలువ కూడా అంతకంతకూ పెరుగుతోంది. సెప్టెంబరులో 678 కోట్ల లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.11.16 లక్షల కోట్లు అని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

వినియోగదారులకు అత్యంత ప్రాధాన్య చెల్లింపు విధానంగా యూపీఐ మారింది. సులభంగా, వేగవంతంగా, సురక్షితంగా వినియోగించే వీలే ఇందుకు కారణం. సెప్టెంబరులో ఐఎంపీఎస్‌ (ఇన్‌స్టంట్‌ ఇంటర్‌- బ్యాంక్‌ పేమెంట్స్‌) ద్వారా 46.27 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆగస్టులోని 46.69 కోట్ల కంటే ఇది తక్కువ. జులైలో ఈ తరహా లావాదేవీలు 46.03 కోట్లు జరిగాయి. ఆధార్‌ ఆధారిత లావాదేవీలు సెప్టెంబరులో 10.27 కోట్లు కాగా.. ఆగస్టులో 10.56 కోట్లు, జులైలో 11.05 కోట్లుగా నమోదయ్యాయి.


వాణిజ్య వంట గ్యాస్, ఏటీఎఫ్‌ ధర తగ్గింపు

దిల్లీ: విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను 4.5 శాతం, వంటగ్యాస్‌ వాణిజ్య సిలెండరు ధరను రూ.25.50 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ ఇంధన రిఫైనరీలు శనివారం ప్రకటించాయి. తాజా మార్పు వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగించే 19 కిలోల వాణిజ్య సిలెండర్‌ ధర దిల్లీలో రూ.1885 నుంచి రూ.1859.50కి పరిమితమైంది. జూన్‌ తర్వాత దీని ధర తగ్గించడం ఇది ఆరోసారి. ఈ 6 విడతల్లో కలిపి వాణిజ్య సిలెండర్‌ ధర రూ.494.50 తగ్గినట్లయ్యింది. అయితే ఇళ్లలో వినియోగించే 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలెండర్‌ ధర మాత్రం మార్పులేకుండా రూ.1053గానే ఉంది.

* ఏటీఎఫ్‌ ధరను దిల్లీలో కిలోలీటరుకు రూ.5521.17 (4.5 శాతం) తగ్గించి, రూ.1,15,520.27గా ప్రకటించారు. స్థానిక పన్నులకు అనుగుణంగా వేర్వేరు రాష్ట్రాల్లో ఏటీఎఫ్‌ ధర భిన్నంగా ఉంటుంది.

* వంటగ్యాస్‌ వాణిజ్య సిలెండర్‌ ధరను నెలవారీగా, ఎటీఎఫ్‌ ధరను ప్రతి 15 రోజులకోసారి, అంతర్జాతీయ ఇంధన ధరలను అనుసరించి సవరిస్తుంటారు.


దేశంలో తగ్గిన నిరుద్యోగిత రేటు

సెప్టెంబరులో 6.43 శాతం: సీఎంఐఈ

ముంబయి: దేశంలో నిరుద్యోగిత రేటు సెప్టెంబరులో గణనీయంగా తగ్గి, 6.43 శాతానికి పరిమితమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మందికి పని దొరకడం ఇందుకు కారణమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. ఆగస్టులో నిరుద్యోగిత రేటు ఏడాది గరిష్ఠమైన 8.3 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఆ నెలలో ఉద్యోగకల్పన 20 లక్షలు తగ్గి 39.46 కోట్లకు పరిమితమవ్వడం ఇందుకు కారణమైంది. సెప్టెంబరులో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 5.84 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 7.7 శాతానికి తగ్గింది. ఆగస్టులో ఈ రెండు ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు వరుసగా 7.68 శాతం, 9.57 శాతంగా నమోదైంది. సుమారు 80 లక్షల మందికి మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం.. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉందనడానికి సంకేతమని సీఎంఐఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేశ్‌ వ్యాస్‌ తెలిపారు. సీఎంఐఈ గణాంకాల ప్రకారం. రాజస్థాన్‌లో అత్యధిక నిరుద్యోగిత రేటు (23.8%) ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జమ్ము- కశ్మీర్‌ (23.2%), హరియాణా (22.9%), త్రిపుర (17%), ఝార్ఖండ్‌ (12.2%), బిహార్‌ (11.4) ఉన్నాయి. అత్యంత తక్కువ నిరుద్యోగిత రేటు కలిగి ఉన్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ (0.1%) మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అస్సోమ్‌ (0.4%), ఉత్తరాఖండ్‌ (0.5%), మధ్య ప్రదేశ్‌ (0.9%), గుజరాత్‌ (1.6%), మేఘాలయ (2.3%), ఒడిశా (2.9%) ఉన్నాయి.


జీఎస్‌టీ వసూళ్లు రూ.1.47 లక్షల కోట్లు

దిల్లీ: సెప్టెంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.1.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2021 సెప్టెంబరు జీఎస్‌టీ వసూళ్లయిన రూ.1.17 లక్షల కోట్లతో పోలిస్తే, ఇది 26 శాతం అధికం. వరుసగా 7 నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు ప్రతినెలా రూ.1.40 లక్షల కోట్లకు మించి నమోదవుతున్నాయి. పండగ సీజను నేపథ్యంలో రానున్న నెలల్లో జీఎస్‌టీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. జీఎస్‌టీ వసూళ్లపరంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.1.67 లక్షల కోట్లే రికార్డు. ఈ ఏడాది ఆగస్టులో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.43 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు వరకు జీఎస్‌టీ వసూళ్లు ఏడాదిక్రితం ఇదే కాలంతో పోలిస్తే 27 శాతం పెరిగాయి.

* గత నెలలో జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1,47,866 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) రూ.25,271 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్‌టీ రూ.31,813 కోట్లు. ఐజీఎస్‌టీ రూ.80,464 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.41,215 కోట్లతో కలిపి), సెస్సు రూ.10,137 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.856 కోట్లతో కలిపి) నమోదయ్యాయి.

* 2022 ఆగస్టులో 7.7 కోట్ల ఇ-వేబిల్లులు తీసుకున్నారు. జులైలోని 7.5 కోట్లతో పోలిస్తే ఇది స్వల్పంగా ఎక్కువ.

* సెప్టెంబరు 20న రెండో అత్యధిక ఒక రోజు జీఎస్‌టీ వసూళ్లు (రూ.49,453 కోట్లు) నమోదయ్యాయి. జులై 20న వసూలైన రూ.57,846 కోట్లు అత్యధిక ఒక రోజు వసూళ్లుగా ఉంది.

* సెప్టెంబరులో ఇ-వే బిల్లులు, ఇ- రశీదులు కలిపి మొత్తంగా 1.1 కోట్లకు పైగా జీఎస్‌టీ పోర్టల్‌ ద్వారా తీసుకున్నారు.


కావేరీ సీడ్స్‌కు రూ.73.25 కోట్ల పన్ను నోటీసు

ముంబయి: వ్యవసాయ ఆదాయానికి సంబంధించి రూ.73.25 కోట్లు చెల్లించమంటూ ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) నుంచి నోటీసు వచ్చిందని కావేరి సీడ్స్‌ తెలిపింది. వ్యవసాయ ఆదాయంపై కంపెనీ క్లెయిమ్‌ చేసుకున్న పన్ను మినహాయింపునకు పన్ను అధికారులు అంగీకరించక, నోటీసులు పంపారని పేర్కొంది. ‘వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపును పొందేందుకు అర్హత ఉందని కంపెనీ బలంగా భావిస్తోంది. అందుకు తమకు అందిన డిమాండ్‌ నోటీస్‌పై అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నామ’ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు పంపిన సమాచారంలో కావేరీ సీడ్స్‌ వెల్లడించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని