‘సిప్‌’ పెట్టుబడులు రూ.13,306 కోట్లు

మ్యూచువల్‌ ఫండ్లలోకి క్రమానుగత పెట్టుబడుల (సిప్‌) మార్గంలో నవంబరులో  రూ.13,306 కోట్లు వచ్చాయి.

Published : 10 Dec 2022 04:10 IST

నవంబరులో రికార్డు స్థాయి

ఈనాడు, హైదరాబాద్‌: మ్యూచువల్‌ ఫండ్లలోకి క్రమానుగత పెట్టుబడుల (సిప్‌) మార్గంలో నవంబరులో  రూ.13,306 కోట్లు వచ్చాయి. అయితే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి వచ్చిన నికర పెట్టుబడులు అక్టోబరుతో పోలిస్తే 76 శాతం క్షీణించి, రూ.2,258 కోట్లకు పడిపోయాయని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) శుక్రవారం తెలిపింది. వరుసగా 21 నెలల నుంచి ఈక్విటీల్లోకి పెట్టుబడులు సానుకూలంగానే వస్తున్నాయని వెల్లడించింది. అక్టోబరులో సిప్‌ ద్వారా రూ.13,041 కోట్లు రాగా, నవంబరులో అంతకు మించాయి. ఈ ఏడాది మే నుంచి ప్రతినెలా సిప్‌ పెట్టుబడులు రూ.12,000 కోట్లకు మించే వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 నెలల్లో మొత్తం పెట్టుబడులు రూ.87,275 కోట్లకు చేరాయి. 2021-22 మొత్తం పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఫండ్లలో మొత్తం పోర్ట్‌ఫోలియోల సంఖ్య 13.97 కోట్లకు చేరుకుంది. ఇందులో రిటైల్‌ ఫోలియోల సంఖ్య 11.17 కోట్లుగా ఉంది. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.40.37లక్షల కోట్లకు చేరింది. నవంబరులో కొత్తగా 21.77 లక్షల సిప్‌ ఖాతాలు ప్రారంభం అయ్యాయి. దీంతో మొత్తం ఈ ఖాతాల సంఖ్య 6.04 కోట్లకు చేరింది. బంగారం ఈటీఎఫ్‌లోకి రూ.20,832.77 కోట్ల పెట్టుబడుల వచ్చాయి. మొత్తం మీద మ్యూచువల్‌ ఫండ్లలోకి అక్టోబరులో నికర పెట్టుబడులు రూ.14,045 కోట్లు ఉండగా, నవంబరులో కాస్త తగ్గి రూ.13,263 కోట్లుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని