కార్యాలయాల్లో మహిళల హవా

కార్యాలయాల్లో మహిళల హవా పెరుగుతోంది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో అతివలకు ఉద్యోగావకాశాలు 35% పెరిగాయని ఫౌండిట్‌ అనే నియామక వెబ్‌సైట్‌ తెలిపింది.

Published : 07 Mar 2023 03:38 IST

35% పెరిగిన నియామకాలు
ఐటీఈఎస్‌, బీపీఎం రంగాల్లో ఎక్కువ

ముంబయి: కార్యాలయాల్లో మహిళల హవా పెరుగుతోంది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో అతివలకు ఉద్యోగావకాశాలు 35% పెరిగాయని ఫౌండిట్‌ అనే నియామక వెబ్‌సైట్‌ తెలిపింది. దేశంలోని కార్యాలయ (వైట్‌ కాలర్‌) ఆర్థిక వ్యవస్థలో మహిళా సిబ్బందికి గిరాకీ పెరుగుతోందని ఈ సంస్థ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. దీని ప్రకారం..

* ఐటీ ఆధారిత సేవలు (ఐటీఈఎస్‌), బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం) రంగం అత్యధికంగా 36% అవకాశాలను మహిళలకు ఇచ్చింది.  

* ఐటీ/కంప్యూటర్స్‌; బ్యాంకింగ్‌, అకౌంటింగ్‌, ఆర్థిక సేవలు; నియామకాలు, స్టాఫింగ్‌; ఆతిథ్యం, ఆరోగ్యసంరక్షణ, డయాగ్నొస్టిక్స్‌ రంగాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

* మహిళలకు అధికంగా ఉద్యోగావకాశాలిచ్చే నగరాల్లో దిల్లీ ఎన్‌సీఆర్‌ (21%), ముంబయి (15%), బెంగళూరు (10%), చెన్నై (9%), పుణె (7%) ముందున్నాయి.

* ఏదో ఒక కారణంతో వృత్తికి విరామం ఇచ్చి, తిరిగి పనిలో చేరిన వారి సంఖ్య మొత్తం మహిళా ఉద్యోగుల్లో 6 శాతంగా ఉంది. తమ ఇష్టప్రకారం ఉద్యోగం (ఫ్రీలాన్స్‌) చేసే వారి సంఖ్య 4 శాతంగా ఉంటోంది. అంటే వైట్‌ కాలర్‌ ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక అవకాశాలు (గిగ్‌ వర్క్‌) పెరుగుతున్నాయి.

* అనుభవం పరంగా చూస్తే నాయకత్వ స్థాయిలో 8% మంది మహిళలున్నారు. ఇది గతేడాది 6 శాతమే. మధ్య స్థాయి హోదాల్లో 24% మంది ఉండగా.. తక్కువ స్థాయి (1-3 ఏళ్ల అనుభవం) హోదాల్లో 18% మంది కనిపించారు.

నాయకత్వ అవకాశాలు కోల్పోతున్నారు!

8-15 ఏళ్ల అనుభవం ఉండీ.. నాయకత్వ హోదా పొందే అవకాశాలను కోల్పోతున్నట్లు 50 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. సొంతంగా పరిమితులు విధించుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆఫీసులో, బయటా పలు సవాళ్లు ఎదురవ్వడమే ఇందుకు కారణమని ఓ సర్వే అంటోంది. దీంతో ప్రారంభ- మధ్య స్థాయి హోదాలతో పోలిస్తే సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో మహిళల సంఖ్య అతి తక్కువగా ఉంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని