త్వరలో విద్యుత్‌ రహదార్లు!

విద్యుత్‌ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఆర్థికంగానూ వీటి వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.

Updated : 14 Sep 2023 08:30 IST

నిర్మాణానికి మార్గాలు, సాంకేతికతల పరిశీలనలో ప్రభుత్వం
నాగ్‌పూర్‌లో మొట్టమొదటి ప్రయోగాత్మక ప్రాజెక్టు
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

దిల్లీ: విద్యుత్‌ రహదారుల అభివృద్ధికి మార్గాలు, సాంకేతికతలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఆర్థికంగానూ వీటి వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్‌ రహదారుల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్న ప్రైవేట్‌ రంగ పెట్టుబడిదార్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తామని బుధవారమిక్కడ జరిగిన ఏసీఎంఏ వార్షిక సదస్సులో ఆయన తెలిపారు. పైగా ఈ తరహా రహదార్ల కోసం ప్రభుత్వానికి చౌకగా విద్యుత్‌ను ఇవ్వడం విద్యుత్‌ మంత్రిత్వ శాఖకూ పెద్ద కష్టమైన పని కాదని చెప్పారు. ‘నేను విద్యుత్‌ మంత్రిత్వ శాఖతో మాట్లాడాను. ఒక్కో యూనిట్‌ రూ.3.50కే విద్యుత్‌ను సరఫరా చేసేలా నేను ప్రయత్నిస్తున్నాను. వాణిజ్యంగా ఈ ధర రూ.11గా ఉంద’ని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ తీగల నిర్మాణం ప్రైవేట్‌ రంగ పెట్టుబడిదార్లు చేపడతారని.. టోల్‌ మాదిరిగా విద్యుత్‌ ఛార్జీని ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ) వసూలు చేస్తుందని మంత్రి వివరించారు. నాగ్‌పూర్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ హైవే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే.. దిల్లీ- జయపుర మధ్య దేశంలోనే మొట్టమొదటి విద్యుత్‌ హైవేను నిర్మించాలన్నది తన కల అని అంతకుముందు మంత్రి వెల్లడించడం గమనార్హం.

విద్యుత్‌ రహదార్లు అంటే..: విద్యుత్‌ రైళ్ల పట్టాలకు సమాంతరంగా ఎలాగైతే పైన విద్యుత్‌ సరఫరా తీగలు ఉంటాయో ఆ తరహాలోనే రహదారులపైనా తీగలను అమరుస్తారు. వాహనాలు ఈ తీగల నుంచి ప్రసారమయ్యే విద్యుత్‌ సాయంతో రహదారులపై నడుస్తాయి. ఆ విధంగా వాహనాల్లోనూ, విద్యుత్‌ తీగల లైన్లలో సాంకేతికతను ఏర్పాటు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు