Savitri Jindal: అంబానీ, అదానీ కాదు ఈ ఏడాది సావిత్రిదే

దేశంలో అత్యంత సంపన్నుల జాబితా తీస్తే అంబానీ, అదానీ పేర్లే ముందుగా వినిపిస్తాయి. కానీ, ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్‌ అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌’ వెల్లడించింది.

Updated : 20 Dec 2023 10:21 IST

అత్యధికంగా ఆర్జించిన వారిలో దేశీయంగా అగ్రస్థానం

దేశంలో అత్యంత సంపన్నుల జాబితా తీస్తే అంబానీ, అదానీ పేర్లే ముందుగా వినిపిస్తాయి. కానీ, ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్‌ (Savitri Jindal) అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌’ వెల్లడించింది. ఆమె మొత్తం సంపద 25.3 బి.డాలర్లు. ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద 9.6 బి.డాలర్లు పెరిగిందని, ఈ జాబితాలో ఆమె అందరి కంటే ముందు నిలిచారని ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.

దేశీయ మహిళల్లో అగ్రస్థానం: జిందాల్‌ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్‌ జిందాల్‌ సతీమణే సావిత్రి జిందాల్‌. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ అండ్‌ పవర్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో పరుగులు పెట్టడం వల్లే సావిత్రి జిందాల్‌ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. ఉప ఖండంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్‌ ప్రేమ్‌జీ (దాదాపు 24 బి.డాలర్లు)ని సావిత్రి అధిగమించారు.

శివ్‌నాడార్‌, కేపీ సింగ్‌ సైతం: ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్‌ అధినేత శివ్‌నాడార్‌ 8 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ కేపీ సింగ్‌ సంపద 7.15 బిలియన్‌ డాలర్లు పెరగడంతో, మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ బిర్లా, షాపూర్‌ మిస్త్రీ 6.3 బిలియన్‌ డాలర్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. ముకేశ్‌ అంబానీ సంపద ఈ ఏడాది 5.2 బిలియన్‌ డాలర్లే పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్‌ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్‌ మిత్తల్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక అనంతరం గౌతమ్‌ అదానీ  సంపద విలువ ఈ ఏడాదిలో 35.4 బిలియన్‌ డాలర్లు తగ్గింది. అయినా 85.1 బి.డాలర్ల నికర సంపదతో దేశంలోని కుబేరుల్లో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్న ముకేశ్‌ అంబానీ, దేశీయంగా తొలి స్థానంలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని