ఎల్‌ఐసీ బ్రాండ్‌కు తిరుగులేదు

ప్రపంచవ్యాప్తంగా బలమైన బీమా సంస్థల బ్రాండ్లలో, భారత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) అగ్రస్థానంలో నిలిచింది.

Published : 27 Mar 2024 01:18 IST

బలమైన బీమా సంస్థల్లో ప్రపంచంలోనే నం.1
విలువ పరంగా చైనా కంపెనీల ఆధిపత్యం
బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌ 100 నివేదిక

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బలమైన బీమా సంస్థల బ్రాండ్లలో, భారత బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) అగ్రస్థానంలో నిలిచింది. 2024 ఏడాదికి విడుదల చేసిన ‘బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇన్సూరెన్స్‌ 100’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఎల్‌ఐసీ బ్రాండ్‌ విలువ 9.8 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.81,500 కోట్లు)గా స్థిరంగా కొనసాగుతోందని.. అయితే బ్రాండ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌ స్కోరు  88.3తో, బ్రాండ్‌ స్ట్రెంత్‌ రేటింగ్‌ ‘ఏఏఏ’తో అన్ని కంపెనీల కంటే ఎల్‌ఐసీ ముందు నిలిచిందని తెలిపింది.

  • బలమైన బీమా బ్రాండ్లలో ఎల్‌ఐసీ తర్వాతి స్థానంలో కాథే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిలిచింది. ఇది 9% వృద్ధితో 4.9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.40,700 కోట్ల) బ్రాండ్‌ విలువను నమోదు చేసింది.
  • చైనా బీమా బ్రాండ్లు అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. విలువపరంగా అవే పైస్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా పింగ్‌ యాన్‌ బ్రాండ్‌ విలువ 4% పెరిగి 33.6 బి. డాలర్ల (సుమారు రూ.2.80 లక్షల కోట్ల)కు చేరడంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన బీమా బ్రాండ్‌గా నిలిచింది. మూడు, అయిదు స్థానాల్లోనూ చైనాకే చెందిన చైనా లైఫ్‌ ఇన్సూరెన్స్‌, సీపీఐసీ ఉన్నాయి.
  • ఈ జాబితాలో 2, 4 స్థానాలను జర్మనీకి చెందిన అలయంజ్‌, ఫ్రాన్స్‌కు చెందిన యాక్సా సొంతం చేసుకున్నాయి.
  • అత్యంత వేగవంతమైన వృద్ధిని కనబరచిన వాటిల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎన్‌ఆర్‌ఎమ్‌ఏ ఇన్సూరెన్స్‌ ఉంది. ఈ సంస్థ బ్రాండ్‌ విలువ ఏకంగా 82% వృద్ధితో 1.3 బి. డాలర్లకు చేరింది. డెన్మార్క్‌కు చెందిన ట్రైజీ బ్రాండ్‌ విలువ 66% పెరిగి 1.6 బి. డాలర్లకు చేరింది.

అత్యధిక తొలి ఏడాది ప్రీమియం: 2022-23లో ఎల్‌ఐసీ అత్యధిక తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.39,090 కోట్లను నమోదు చేసింది. ఈ విషయంలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వరుసగా రూ.15,197 కోట్లు, రూ.10,970 కోట్లు నమోదు చేశాయి. ఇటీవలి కాలంలో ఎల్‌ఐసీ షేరు జీవనకాల గరిష్ఠమైన రూ.1175కు చేరడంతో, భారత్‌లోనే అత్యంత విలువైన ప్రభుత్వ రంగ కంపెనీగా అవతరించింది. 2022 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చేలా ఎల్‌ఐసీ ఉద్యోగులకు 17%   వేతన సవరణకు ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపిన విషయమూ విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని