భారత్‌లో ముకేశ్‌.. ప్రపంచంలో మస్క్‌

దేశీయ కుబేరుల్లో అగ్రస్థానాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నిలబెట్టుకున్నారు. గతేడాదిలో ఆయన సంపద 33 బిలియన్‌ డాలర్లు (40%) పెరిగి 115 బిలియన్‌ డాలర్ల (రూ.9.50 లక్షల కోట్ల)కు చేరింది.

Published : 27 Mar 2024 01:22 IST

కుబేరుల్లో అగ్రస్థానం
ప్రపంచవ్యాప్తంగా అదానీకి 15వ స్థానం
హురున్‌ జాబితా

ముంబయి: దేశీయ కుబేరుల్లో అగ్రస్థానాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నిలబెట్టుకున్నారు. గతేడాదిలో ఆయన సంపద 33 బిలియన్‌ డాలర్లు (40%) పెరిగి 115 బిలియన్‌ డాలర్ల (రూ.9.50 లక్షల కోట్ల)కు చేరింది. 2024 సంవత్సరానికి గాను హురున్‌ విడుదల చేసిన జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ జాబితా అగ్రస్థానంలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఉన్నారు. ఈయన సంపద విలువ 231 బి.డాలర్లు (సుమారు రూ.19 లక్షల కోట్లు). ప్రపంచవ్యాప్తంగా చూసినా.. ముకేశ్‌ అంబానీ పదో స్థానంలో ఉన్నారు. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత, కంపెనీల షేర్ల పతనంతో, అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంపద విలువ భారీగా తగ్గింది. తదనంతరం షేర్లు కోలుకోవడంతో గతేడాది మొత్తం మీద అదానీ సంపద విలువ అంతకుముందు ఏడాది కంటే 62% పెరిగి 86 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7.14 లక్షల కోట్ల)కు చేరింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన 15వ స్థానంలో నిలిచారు. తొలి 100 మంది కుబేరుల్లో మనదేశం నుంచి కేవలం ఆరుగురే- ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, శివ్‌ నాడార్‌ (హెచ్‌సీఎల్‌ టెక్‌), సైరస్‌ పూనావాలా(సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌), కుమార మంగళం బిర్లా(ఆదిత్య బిర్లా గ్రూప్‌) రాధాకిషన్‌ దమానీ (డి-మార్ట్‌) చోటు దక్కించుకున్నారు.

బీజింగ్‌ను వెనక్కి నెట్టిన ముంబయి..: ఎక్కువమంది కుబేరులకు నివాసంగా ఉన్న నగరాల విషయంలో బీజింగ్‌ను ముంబయి వెనక్కి నెట్టింది. ముంబయిలో 92 మంది కుబేరులు ఉండగా.. బీజింగ్‌లో 91 మంది ఉన్నారు. దేశం పరంగా చూస్తే.. భారత్‌ 271 మంది కుబేరులు ఉండగా, చైనాలో 814 మంది ఉన్నారు. కొత్తగా ఈ జాబితాలో చేరిన శ్రీమంతుల సంఖ్య విషయంలో చైనాను భారత్‌ వెనక్కి నెట్టింది. మనదేశం నుంచి కొత్తగా 94 మంది చోటు సంపాదించగా.. చైనా నుంచి ఈ సంఖ్య 55గా ఉంది. ముంబయి నుంచి కొత్తగా 27 మందికి స్థానం దక్కగా.. బీజింగ్‌ నుంచి ఆరుగురే కొత్తగా చోటు సంపాదించారు.

 జాబితాలోని భారత కుబేరుల మొత్తం సంపద 51% మేర పెరిగి 1 లక్ష కోట్ల డాలర్లకు చేరింది. భారత్‌ వార్షికంగా 7% వృద్ధితో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను నిలబెట్టుకుంటున్నందున భారత్‌లో వ్యక్తుల నికర సంపదలు పెరుగుతున్నాయి. స్థిరాస్తి సహా పలు రంగాల్లో సమస్యల కారణంగా చైనాలో వృద్ధి నెమ్మదించడం వల్లే అక్కడ కొత్త కుబేరుల సంఖ్య తగ్గినట్లు హురున్‌ నివేదిక అభిప్రాయపడింది. జాబితాలోని భారత కుబేరుల్లో కేవలం 24 మంది సంపద విలువ తగ్గితే, చైనా నుంచి ఈ సంఖ్య 573గా ఉంది.

జుకర్‌బర్గ్‌ పెంచుకున్నారు: గతేడాది అత్యధికంగా సంపద పెంచుకున్న వారిలో మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన సంపద 90 బిలియన్‌ డాలర్లు పెరిగి 158 బిలియన్‌ డాలర్లకు చేరింది. తద్వారా ప్రపంచంలోని అత్యంత 10 మంది శ్రీమంతుల జాబితాలోకి జుకర్‌బర్గ్‌ తిరిగి అడుగుపెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన విలాస ఉత్పత్తుల సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ అధిపతి బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ అత్యధికంగా సంపదను కోల్పోయారు. ఈయన సంపద 27 బిలియన్‌ డాలర్లు తగ్గి 175 బి.డాలర్లకు పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని