Union Budget 2023: గరిటె తిప్పిన నిర్మలమ్మ.. సందడిగా ‘హల్వా’ వేడుక..!

కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో గురువారం హల్వా కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ హాజరయ్యారు. బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు హల్వా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. 

Updated : 26 Jan 2023 21:22 IST

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌(Union Budget 2023-24)కు ముందు సంప్రదాయం ప్రకారం నిర్వహించే 'హల్వా వేడుక(Halwa Ceremony)’ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) హాజరై.. హల్వా గరిటె తిప్పారు. అనంతరం.. అధికారులకు, సిబ్బందికి హల్వాను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక మంత్రి ఇక్కడి బడ్జెట్ ప్రెస్‌లో పర్యటించారు. సంబంధిత అధికారులకు శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు సన్నాహాలను సమీక్షించారు.

బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు హల్వా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అయితే, కొవిడ్‌ కారణంగా గతేడాది ఈ కార్యక్రమం నిర్వహించలేదు. ఇదిలా ఉండగా.. గత రెండు బడ్జెట్‌లను ముద్రణ లేకుండా కాగితరహితంగానే ప్రవేశపెట్టారు. ఈసారి కూడా కాగితరహితంగా డిజిటల్‌ పద్ధతిలో 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం ఇది ఐదోసారి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌కు చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని