Hyundai: క్రెటా, ఎక్స్‌టర్‌ దన్నుతో హ్యుందాయ్‌ విక్రయాల్లో 60% ఎస్‌యూవీలే!

Hyundai: ఈ ఏడాది తమ విక్రయాల్లో 60 శాతం ఎస్‌యూవీలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తెలిపింది. ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా పయనిస్తున్నామని కంపెనీ సీఓఓ తరుణ్‌ గార్గ్‌ పేర్కొన్నారు.

Published : 05 Nov 2023 16:36 IST

దిల్లీ: ఈ ఏడాది హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (Hyundai Motor India) దేశీయ విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా తమ లక్ష్యానికి అనుగుణంగా 60 శాతానికి పైగానే ఉంటుందని కంపెనీ తెలిపింది. క్రెటా, కొత్తగా విడుదల చేసిన ఎక్స్‌టర్‌.. విక్రయాలు పుంజుకోవడానికి దోహదం చేసినట్లు సీఓఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. గత మూడు నెలలుగా ఎగుమతులు సైతం వేగం పుంజుకున్నట్లు వెల్లడించారు. దీంతో అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ.. విదేశీ సరఫరాలు గాడిన పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

2023 అక్టోబరులో హ్యుందాయ్‌ విక్రయాలు (Hyundai Motor India Sales) 18.5 శాతం పెరిగి 68,728 యూనిట్లకు చేరాయి. జనవరి- అక్టోబర్‌ మధ్య అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 11.5 శాతం పుంజుకొని 6,43,535 యూనిట్లకు ఎగబాకాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్‌లో విక్రయాలు 9.49 శాతం పెరిగి 5,09,910 యూనిట్లకు చేరాయి. ఏడాది ఆరంభంలో కంపెనీ విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 53 శాతంగా ఉండిందని గార్గ్‌ తెలిపారు. అయితే, క్రెటా విక్రయాలు పుంజుకోవటం కలిసొచ్చిందని వివరించారు. ఎక్స్‌టర్‌ అమ్మకాలూ బాగున్నాయని తెలిపారు.

కంపెనీ ఎగుమతులు సైతం తమ లక్ష్యమైన 1.6 లక్షల యూనిట్లు దాటుతాయని గార్గ్‌ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా విదేశీ సరఫరాలు పుంజుకున్నాయని తెలిపారు. జులై నుంచి ప్రతినెలా తమ తయారీ సామర్థ్యాన్ని 4,000 యూనిట్ల చొప్పున పెంచుతున్నామని వెల్లడించారు. ఫలితంగానే ఇటు దేశీయ విక్రయాలతో పాటు అటు ఎగుమతులను కూడా బ్యాలెన్స్‌ చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. అయితే, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తమని ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని