Lay offs: ‘అమ్మా.. ఆఫీసుకు వెళ్లడం లేదేం?’ అని అడిగితే ఏం చెప్పాలి?: ఉద్యోగిని ఆవేదన

ప్రముఖ టెక్‌సంస్థ గూగుల్‌ (Google)లో కోతలు మొదలయ్యాయి. గుడ్‌గావ్‌లో క్లౌడ్‌ ప్రోగ్రాం మేనేజర్‌గా పని చేస్తున్న వాలియాకు (Walia) యాక్సెస్‌ డినైడ్‌ అని మెసేజ్‌ డిస్‌ప్లే అవ్వడంతో ఆమె కంగుతిన్నారు.

Published : 27 Feb 2023 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ కంపెనీల్లోని ఉద్యోగుల (Tech Employees) జీవితాలు కత్తిమీదసాములా తయారయ్యాయి. ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో? ఎప్పుడు ఊడుతుందో (Lay offs) తెలియడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google) తాజాగా చర్యలకు ఉపక్రమించింది. దీంతో ఉద్యోగులు సామాజిక మాధ్యమాల (Social Media) వేదికగా తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. గుడ్‌గావ్‌లో గూగుల్‌ క్లౌడ్‌ ప్రోగ్రాం మేనేజర్‌గా పని చేస్తున్న వాలియా (Walia) అనే ఉద్యోగిని కంప్యూటర్‌ ఆన్‌ చేసి లాగిన్‌ అవ్వగానే ‘యాక్సెస్‌ డినైడ్‌’ అనే మెసేజ్‌ డిస్‌ప్లే అవ్వడంతో కంగుతిన్నారు. ఇదే విషయాన్ని బాస్‌ దృష్టికి తీసుకెళ్తే.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెబుతూ వచ్చిన మెయిల్‌ చెక్‌ చేసుకోమని అన్నారు. ఆమె సంస్థలో చేరి ఇటీవలే 5 ఏళ్లు పూర్తయిందట. అంతలోనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఉద్వేగానికి గురయ్యారు. కొత్త ఉద్యోగం కోసం లింక్డిన్‌లో ప్రయత్నాలు మొదలు పెట్టారు.

‘‘నేను సంస్థలో చేరి ఇటీవలే 5 ఏళ్లు పూర్తయింది. సహచరులంతా పార్టీ చేసుకున్నాం. అయితే, ఆ సంస్థలో అదే చివరి పార్టీ అవుతుందని నేను ఊహించలేదు. మీటింగ్‌ మరో 10 నిమిషాలు ఉందనగా.. కంప్యూటర్‌ ఆన్ చేసి.. లాగిన్‌ కావడానికి ప్రయత్నించా. వెంటనే యాక్సిస్‌ డినైడ్‌ అని మెసేజ్‌ వచ్చింది. మళ్లీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది’’ అంటూ వాలియా రాసుకొచ్చారు. గూగుల్‌లో పని చేయడమన్నది తన కల అని చెప్పిన ఆమె...అందులో ఉద్యోగం సంపాదించడంతో ఉబ్బితబ్బిబ్బయిపోయానని అంతలోనే ఆశలన్నీ ఆవిరైపోయాయని చెప్పుకొచ్చారు. ‘‘ నా కల నిజమైందనుకున్నా. ఇక్కడ గడిపిన ప్రతిక్షణం నా ఊహకు మించే ఉంది. లింక్డిన్‌లో నా రెజ్యూమే, ప్రొఫైల్‌ని అప్‌డేట్‌ చేసిన తర్వాత ఈ సంస్థ నాలో ఎంతగా కలిసిపోయిందో అర్థమైంది. గూగుల్‌లో గత ఐదేళ్లలో నా కెరీర్‌లో అత్యంత విలువైన సమయాన్ని గడిపాను. విభిన్న రోల్స్‌లో పని చేస్తూ ఎంతో అనుభవాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకున్నాను. ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులతో కలిసి పని చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు గూగుల్‌కు ధన్యవాదాలు’’ అంటూ ఆమె రాసుకొచ్చారు.

ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే చెప్పాల్సిందిగా లింక్డిన్‌లో ఆమె అభ్యర్థించారు. ‘‘ఇకపై నా పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు. అమ్మా.. ఎందుకు డ్యూటీకి వెళ్లడం లేదని నా ఆరేళ్ల కూతురు అడుగుతుంటే.. నేనేం సమాధానం చెప్పాలి. నేనేం చెప్పినా ఇప్పుడు ఆమెకు అర్థం కాదు. అమెకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఇంకొంత సమయం పడుతుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ టెక్‌ కంపెనీల్లో గత కొన్ని నెలలుగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్‌, మెటా,ట్విటర్‌, అమెజాన్‌ వంటి సంస్థలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇటీవల గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా చర్యలు మొదలైనట్లు తెలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని