LIC: లిస్టింగ్‌ తర్వాత మొదటిసారి.. ఎల్‌ఐసీ షేర్‌ 10% జంప్‌

LIC: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ షేరు ఒక రోజులోనే 10శాతం పెరిగింది. మార్కెట్‌లో లిస్టయినప్పటి నుంచి స్టాక్‌లో ఈమేర వృద్ధి నమోదవ్వటం ఇదే మొదటిసారి.

Updated : 24 Nov 2023 19:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) షేరు శుక్రవారం రికార్డు స్థాయిలో పెరిగింది. మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత ఎల్‌ఐసీ షేరు విలువ ఒక రోజులో 10 శాతం పెరగటం ఇదే మొదటిసారి. అంతేకాదు రెండు నెలల గరిష్ఠానికి చేరింది. ఎల్‌ఐసీతో పాటూ ప్రభుత్వ రంగానికి చెందిన బీమా కంపెనీల షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. జనరల్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేరు విలువ 18 శాతం పెరగ్గా.. న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ షేరు 20 శాతం మేర పెరిగింది.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) ఛైర్మన్‌ సిద్ధార్థ మొహంతి ప్రకటించారు. కొత్త వ్యాపార ప్రీమియంలో వృద్ధి సాధించటంలో భాగంగా రానున్న నెలల్లో 3-4 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. డిసెంబరు మొదటి వారంలోనే తొలి ఉత్పత్తిని ఆవిష్కరిస్తామన్నారు. ఈ ఉత్పత్తిలో రుణ సదుపాయం, ముందస్తు ఉపహరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రకటన నేపథ్యంలోనే ఎల్‌ఐసీ షేరు అమాంతం పెరిగింది. ఈ రోజు మార్కెట్‌ ముగిసే సమయానికి షేరు 9.71 శాతం పెరిగి రూ.677.70కు చేరింది. షేరు విలువ రెండు నెలల గరిష్ఠాన్ని తాకింది.

ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్‌.. గంటకు లక్షల్లోనే!

స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా.. ఎల్‌ఐసీ నిలిచింది. అయితే షేరు ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టయ్యింది. అప్పటి నుంచి స్టాక్‌ పడిపోతూనే వచ్చింది. 2023 మార్చి 23 నాటికి కనిష్ఠంగా రూ.530.05కి పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకున్నప్పటికీ ఇష్యూ ధర కంటే తక్కువకే ట్రేడయింది. ఇటీవల వెలువడిన రెండో త్రైమాసిక ఫలితాల్లోనూ ఎల్‌ఐసీ నికర లాభం భారీగా క్షీణించింది. ఈ క్రమంలో ఛైర్మన్‌ నుంచి వెలువడిన ప్రకటన ఎల్‌ఐసీ షేరుకు ఊపిరులూదింది. అయితే ఎల్‌ఐసీ షేరు.. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే ఇప్పటికీ చాలా దూరంలోనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని