Maruti: ₹45 వేల కోట్ల పెట్టుబడులు.. 28 కొత్త మోడళ్లు.. మారుతీ భారీ ప్రణాళిక

Maruti: వచ్చే ఎనిమిదేళ్ల ప్రణాళికను మారుతీ సుజుకీ తమ వార్షిక సాధారణ సమావేశంలో ఆవిష్కరించింది. వివిధ రకాల ఇంధనాలతో నడిచే వాహనాలను తీసుకురానున్నట్లు తెలిపింది.

Published : 29 Aug 2023 17:18 IST

దిల్లీ: వచ్చే ఎనిమిదేళ్లలో తమ వార్షిక తయారీ సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా ఛైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ తెలిపారు. అందుకోసం రూ.45,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు చెప్పారు. అలాగే స్టాక్‌ విభజనపై వాటాదారుల సలహాలను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. వార్షిక సాధారణ సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా తటస్థ కర్బన ఉద్గారాలపై దృష్టి సారించిన నేపథ్యంలో తమ కంపెనీ (Maruti Suzuki) రాబోయే రోజుల్లో వివిధ రకాల ఇంధన ఆధారిత వాహనాలను తీసుకురానున్నట్లు భార్గవ తెలిపారు. విద్యుత్‌ (Electrical Vehicles), హైబ్రిడ్‌, సీఎన్‌జీ, ఇథనాల్‌ సహా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌తో నడిచే వాహనాలను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. వచ్చే 8-10 సంవత్సరాల్లో సాంకేతికంగా రాబోతున్న మార్పులను అంచనా వేయడం కష్టమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వివిధ రకాల ఇంధనాలతో నడిచే వాహనాలను ప్రయత్నించనున్నట్లు తెలిపారు.

40 ఏళ్లలో కంపెనీ రెండు మిలియన్ల యూనిట్ల విక్రయాలను అందుకుందని భార్గవ తెలిపారు. వచ్చే ఎనిమిదేళ్లలో మరో రెండు మిలియన్ల లక్ష్యాన్ని అందుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 28 రకాల కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీని పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కంపెనీ షేరు విలువ దాదాపు రూ.10 వేలకు చేరిన నేపథ్యంలో స్టాక్‌ విభజన అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 2024- 25 నుంచి 2030- 31 మధ్య ఆరు విద్యుత్‌ మోడళ్లను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ స్టాక్‌ మంగళవారం 0.39 శాతం పుంజుకొని రూ.9,634 దగ్గర స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని