Meta: ఆఫీసులకు రాకుంటే ఇంటికే.. ఉద్యోగులకు మెటా హెచ్చరిక!

Meta: మార్క్‌ జుకర్‌ బర్గ్‌కు చెందిన మెటా సంస్థ వారానికి మూడు రోజులు ఆఫీసుకు రాని ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. ఇలాగే కొనసాగితే ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Updated : 19 Aug 2023 14:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా సమయంలో మొదలైన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వాతావరణం నుంచి ఇంకా కొందరు ఉద్యోగులు బయటకు రావటం లేదు. వారానికి మూడు రోజులు ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఇప్పటికే పలు కంపెనీలు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. దాదాపు అన్ని కంపెనీల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ నేపథ్యంలో మార్క్‌ జుకర్‌ బర్గ్‌కు (Mark Zuckerberg) చెందిన మెటా (Meta) సంస్థ ఉద్యోగులకు వార్నింగ్‌ ఇచ్చింది. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని సూచించింది. ఒకవేళ నియామవళిని ఉల్లంఘిస్తే ఇంటికెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.

‘ఎక్స్‌’లో మరో మార్పు.. ‘బ్లాక్‌’ ఫీచర్‌కు మస్క్‌ గుడ్‌బై..!

సెప్టెంబరు 5 నుంచి వారానికి మూడు రోజుల పాటు ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు జారీ చేసిన నోటీసులో మెటా పేర్కొంది. ఒకవేళ పదేపదే నియమాలను ఉల్లంఘిస్తే ఉద్యోగాలు తొలగిపోయే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరించింది. కార్యాలయాలకు వస్తున్నదీ లేనిదీ తనిఖీ చేయాలని మేనేజర్లకు సూచించింది. ఉద్యోగుల మధ్య బంధాలు బలోపేతం చేయడానికి, టీమ్‌ వర్క్‌కు ఈ నిర్ణయం దోహదపడుతుందని నోటీసులో పేర్కొంది. అయితే, ఈ నిర్ణయం నుంచి రిమోట్‌ ఉద్యోగులను మెటా మినహాయించింది. ‘ఆఫీసులో ఉంటూ పనిచేస్తేనే మంచి పురోగతి సాధించగలుగుతాం. ఇంట్లో ఉంటూ వర్క్‌ చేసే వారి కంటే ఆఫీసుకు వచ్చి పనిచేసే వారే మంచి ఫలితాలను పొందుతున్నారు’ అని జుకర్‌బర్గ్‌ గతంలోనే ఓ సందర్భంలో ఉద్యోగులతో అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని