Netflix: పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు ఛార్జీ.. నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్ల షాక్‌!

Netflix password sharing: పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు డబ్బులు వసూలు చేయాలన్న నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయం వల్ల స్పెయిన్‌లో ఏకంగా 10 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.

Updated : 26 Apr 2023 18:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు డబ్బులు వసూలు చేయాలన్న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వ్యూహం బెడిసికొట్టిందా? పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను (password sharing) నిరోధించేందుకు చేసిన ప్రయత్నం అసలుకే మోసం తెచ్చేలా ఉందా? అంటే అవుననే అంటోంది ఈ నివేదిక. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను అరికట్టేందుకు నెట్‌ఫ్లిక్స్‌ తీసుకున్న చర్యల కారణంగా స్పెయిన్‌లో ఏకంగా 10 లక్షల మంది యూజర్లను నెట్‌ఫ్లిక్స్‌ కోల్పోయిందని మార్కెట్‌ రీసెర్చి సంస్థ కాంటార్‌ తెలిపింది.

స్పెయిన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు ఫీజు వసూలు చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయంచింది. ఒకే ఇంట్లో వారు కాకుండా వేరే వారు అదే అకౌంట్‌ను వాడడాన్ని అడ్డుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు ఒక్కో అకౌంట్‌కు నెలకు 6.57 డాలర్లు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ఇదే విధానాన్ని అటు పోర్చుగల్‌, కెనడా, న్యూజిలాండ్‌లోనూ ప్రారంభించింది.

అయితే, స్పెయిన్‌లో మూడింట రెండొంతుల మంది వేరే పాస్‌వర్డ్‌ను వినియోగించి నెట్‌ఫ్లిక్స్‌ను చూస్తున్నారని కాంటార్‌ తన అధ్యయనంలో తెలిపింది. దీంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 10 లక్షలకు పైగా యూజర్లను నెట్‌ఫ్లిక్స్‌ కోల్పోయిందని పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌కు గుడ్‌బై చెప్పిన వాళ్లలో ఎవరూ పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లు కాదని రీసెర్చి సంస్థ తెలిపింది. దీనివల్ల మౌత్‌ పబ్లిసిటీ ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది. మరోవైపు గతేడాదితో పోలిస్తే తొలి త్రైమాసికంలో సబ్‌స్క్రిప్షన్‌ క్యాన్సిలేషన్ల సంఖ్య మూడింతలు పెరిగినట్లు తన అధ్యయనంలో గుర్తించింది. స్పెయిన్‌లో  పదో వంతు మంది రెండో త్రైమాసికం నాటికి నెట్‌ఫ్లిక్స్‌ను అన్‌ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలని భావిస్తున్నారని అధ్యయనం తెలిపింది. 

అయితే, పాస్‌వర్డ్‌షేరింగ్‌కు డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించిన దేశాల్లో క్యాన్సిలేషన్లు జరగడాన్ని తాము గమనించామని నెట్‌ఫ్లిక్స్ ఇటీవల పేర్కొంది. వాస్తవంలో యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ.. పెయిడ్‌ మెంబర్‌షిప్‌ సంఖ్య గతం కంటే ఎక్కువే ఉందని తెలిపింది. అదే సమయంలో పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ప్లాన్, ప్రకటనలతో కూడిన చౌక ప్లాన్ల వల్ల 2023 రెండో అర్ధ భాగం నాటికి మెరుగైన వృద్ధిని నమోదు చేస్తామని నెట్‌ఫ్లిక్స్‌ ఆశాభావం వ్యక్తంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని