Nitin Gadkari: రోడ్డు సరిగా వేయలేకపోయాం.. క్షమించండి: నితిన్‌ గడ్కరీ

మధ్యప్రదేశ్‌లో ఓ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించిందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బహిరంగంగా అంగీకరించారు. పైగా అందుకు తనని క్షమించాలని ప్రజలను కోరారు.

Published : 09 Nov 2022 18:53 IST

జబల్‌పూర్‌: మధ్యప్రదేశ్‌లో ఓ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపించిందని.. అందుకు తనని క్షమించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. వెంటనే మరోసారి టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టరుకు ప్రాజెక్టు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.

మధ్యప్రదేశ్‌లో మండ్లా నుంచి జబల్‌పూర్‌ వరకు రహదారిని నిర్మిస్తున్నారు. ఇందులో బరెలా నుంచి మండ్లా వరకు వేసిన 63 కి.మీ రోడ్డు నాణ్యత విషయంలో తనకు సంతృప్తి లేదని తెలిపారు. అందుకు తనని క్షమించాలని జబల్‌పూర్‌లో జరిగిన ఓ సభలో ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ కూడా ఉన్నారు. ‘‘నాకు చాలా బాధగా ఉంది. తప్పు జరిగినప్పుడు క్షమాపణ కోరడానికి నేను వెనుకాడబోను. బరేలా నుంచి మండ్లా వరకు వేసిన రోడ్డు విషయంలో నాకు సంతృప్తి లేదు. అక్కడ సమస్య ఉందని తెలుసు. నేను అధికారులతో మాట్లాడాను. పెండింగ్‌లో ఉన్న పని గురించి కాంట్రాక్టరుతో మాట్లాడి.. ఓ పరస్పర అంగీకారానికి రావాలని కోరాను. కొత్త టెండర్లు పిలిచి మళ్లీ రోడ్డు వేయాలని ఆదేశించాను. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులకు క్షమాపణలు కోరుతున్నా’’ అని సభలో అన్నారు. వెంటనే సభలో ఉన్నవారంతా కరతాళధ్వనులతో  ప్రశంసించారు.

మరోవైపు తన హయాంలోనే మధ్యప్రదేశ్‌కు రూ.6 లక్షల కోట్లు విలువ చేసే రోడ్లు మంజూరు చేస్తానని నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. భూ సేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులకు సంబంధించిన పనిని రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పూర్తిచేయాలని కోరారు. నితిన్‌ గడ్కరీ ఇలా నిర్మోహమాటంగా మాట్లాడడం ఇది కొత్తేమీ కాదు. మంగళవారం ఓ సభలో మాట్లాడుతూ.. 1991 నాటి ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ఈ దేశం రుణపడి ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని