ATMలలో కనిపించని ₹2వేల నోటు.. నిర్మలా సీతారామన్‌ సమాధానమిదే..

2000 Note in ATMs: ఏటీఎం కేంద్రాల్లో ఏయే నోట్లు అందుబాటులో ఉంచాలనేది బ్యాంకుల ఇష్టమని నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ.2వేల నోట్లను వద్దని గానీ, పెట్టాలని గానీ తాము ఏ బ్యాంకుకూ సూచించలేదన్నారు. 

Updated : 20 Mar 2023 20:11 IST

దిల్లీ: ఒకప్పటితో పోలిస్తే ఏటీఎం కేంద్రాల్లో రూ.2వేల నోట్లు (2000 Note) మునుపటిలా కనిపించడం లేదు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఆ నోట్లను తగ్గిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏటీఎం (ATM) కేంద్రాల్లో రూ.2వేల నోటు లభ్యతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టతనిచ్చారు. ఏటీఎంలలో 2వేల నోట్లను ఉంచాలని గానీ, ఉంచొద్దని గానీ తాము బ్యాంకులకు సూచించలేదని లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) వార్షిక నివేదిక ప్రకారం.. 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న రూ.500, రూ.2000 వేల నోట్ల విలువ రూ.9.512 లక్షల కోట్లు కాగా.. 2022 మార్చి నాటికి ఆ మొత్తం రూ.27.057 లక్షల కోట్లకు పెరిగిందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఏటీఎం కేంద్రాల్లో నోట్లను అందుబాటులో ఉంచడమనేది బ్యాంకుల స్వతంత్ర నిర్ణయమని తెలిపారు. కాలానికి అనుగుణంగా, ఖాతాదారుల అవసరాలను బట్టి నోట్లను జమ చేస్తుంటాయని పేర్కొన్నారు. కేంద్రం అప్పులకు సంబంధించి మరో ప్రశ్నకు బదులిస్తూ.. 2023 మార్చి 31 నాటికి కేంద్రం అప్పులు రూ.155.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇది దేశ జీడీపీలో 57.3 శాతం ఉంటుందని అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని