Bisleri: బిస్లరీ విక్రయానికి బ్రేక్‌.. విక్రయించడం లేదన్న రమేశ్‌ చౌహాన్‌

Bisleri Drinking water: బిస్లరీ విక్రయానికి బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే చర్చలు నిలిపివేసినట్లు టాటా గ్రూప్‌ ప్రకటించగా.. తాజాగా బిస్లరీ అధినేత రమేశ్‌ చౌహాన్‌ సైతం ఎవరికీ విక్రయించడం లేదని వెల్లడించారు.

Published : 20 Mar 2023 20:36 IST

దిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్‌ వాటర్‌ వ్యాపార సంస్థ బిస్లరీని (Bisleri) ఎవరికీ విక్రయించడం లేదని ప్రముఖ వ్యాపార వేత్త, సంస్థ ఛైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఏ పార్టీతోనూ చర్చలు జరపడం లేదని స్పష్టం చేశారు. బిస్లరీ కొనుగోలుపై చర్చలు నిలిపివేసినట్లు టాటా (Tata) కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ప్రకటించిన మూడు రోజులకే ఆయన నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అయితే, బిస్లరీ సంస్థను ఆయన కుమార్తె జయంతి చౌహాన్‌ నడిపిస్తారంటూ వచ్చిన మీడియా కథనాలపై స్పందించేందుకు నిరాకరించారు.

బిస్లరీ వాటర్‌ బాటిల్‌ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు చౌహాన్‌ గతేడాది నవంబర్‌లో వెల్లడించారు. 82 ఏళ్ల చౌహాన్‌ తదనంతరం ఆ వ్యాపారాన్ని చూసుకునేందుకు జయంతి ఆసక్తిగా లేకపోవడమే ఇందుకు కారణమని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే టాటా గ్రూప్‌ సహా మరికొన్ని సంస్థలు సైతం చర్చలు జరిపాయి. అయితే, బిస్లరీ కొనుగోలు విషయంలో చర్చలను నిలిపివేసినట్లు టాటా గ్రూప్‌ ఇటీవల ప్రకటించింది. దీనికి కొనసాగింపుగా చౌహాన్‌ నుంచీ ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

మూడు దశాబ్దాల క్రితం చౌహాన్‌ తమ సాఫ్ట్‌ డ్రింక్స్‌ వ్యాపారాన్ని  దిగ్గజ సంస్థ కోకా-కోలాకు విక్రయించారు. థమ్సప్‌, గోల్డ్‌ స్పాట్‌, సిట్రా, మాజా, లిమ్‌కా బ్రాండ్లను 1993లో కోకా-కోలాకు బదిలీ చేశారు. ఇందులో థమ్సప్‌ ఇప్పటికే బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా అవతరించింది. మరోవైపు ఎఫ్ఎంసీజీ వ్యాపారంపై దృష్టి సారించిన టాటా గ్రూప్‌ ఇటీవల ఈ రంగంలోని పలు బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఇప్పటికే ‘హిమాలయన్‌’ బ్రాండ్‌ పేరిట ప్యాకేజ్డ్‌ వాటర్‌ రంగంలో టాటా కన్జ్యూమర్‌ ఉంది. మరోవైపు టాటా కాపర్‌ ప్లస్‌, టాటా గ్లూకో పేరుతో హైడ్రేషన్‌ సెగ్మెంట్‌లోకీ ప్రవేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని