6G Network: ప్రధాని ప్రసంగంలో 6జీ ప్రస్తావన.. ఏంటీ కొత్త సాంకేతికత?

ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 6జీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్‌ వడివడిగా ఈ సాంకేతికత వైపు అడుగులు వేస్తోందని, ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో 6జీ గురించి మరోసారి చర్చ మొదలైంది.

Published : 15 Aug 2023 13:33 IST

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో (Indipendence Day Celebrations) భాగంగా ప్రధాని మోదీ (PM Narendra Modi) ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 6జీ సాంకేతికత గురించి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అభివృద్ధి చెందుతోందని, అంతర్జాతీయంగా ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకే మొబైల్‌ డేటా ప్లాన్లను అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 5జీ సాంకేతికత (5G Technology) అందుబాటులో ఉందని.. త్వరలోనే 6జీ సాంకేతికతను (6G Technology) ప్రజలకు పరిచయం చేసేందుకు భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 6జీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో 6జీ గురించి మరోసారి చర్చ మొదలైంది. ఇంతకీ 6జీ నెట్‌వర్క్‌ (6G Network) అంటే ఏంటి? 5జీ కంటే ఇది ఎంత మెరుగ్గా ఉంటుందో చూద్దాం. 

6జీ నెట్‌వర్క్‌

5జీ నెట్‌వర్క్‌కు అడ్వాన్స్‌డ్‌ వెర్షనే 6జీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ సేవలు 700 జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం 5జీ సేవలు విస్తరించనున్నట్లు టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు చెబుతున్నాయి. ఇక 6జీ నెట్‌వర్క్‌ 5జీ కంటే వెయ్యి రెట్ల వేగంతో పనిచేస్తుంది. టెలికాం విభాగం (DoT) విడుదల చేసిన 6జీ డాక్యుమెంట్‌ ప్రకారం.. 5జీ నెట్‌వర్క్‌ సెకనుకు 10 గిగాబైట్స్‌ వేగంతో పనిచేస్తే.. 6జీ సెకనుకు ఒక టెరాబైట్‌ వేగంతో పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ల పరంగా 5జీ ఆపరేటర్లు 24 గిగాహెడ్జ్‌ నుంచి 66 గిగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ వేవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల డేటా బదిలీ వేగంగా జరుగుతుంది. 6జీలో మాత్రం స్పెక్ట్రమ్‌ వేవ్‌లు 30 గిగా హెడ్జ్‌ల నుంచి 300 గిగాహెడ్జ్‌లను దాటి టెరాహెడ్జ్‌ల వరకు ఉపయోగించవచ్చు. 

జుకర్‌బర్గ్‌ ఇంటికెళ్తా.. ఆయన ఇంట్లో ఉంటే అక్కడే మా ఫైట్‌: మస్క్‌ ట్వీట్

ప్రస్తుతం సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, స్మార్ట్‌ సిటీలు, రిమోట్ హెల్త్‌కేర్‌ వంటి సేవల్లో 5జీ నెట్‌వర్క్‌ కీలకం కానుంది. 6జీ ద్వారా ఈ సేవలు మరింత ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని సాంకేతిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 6జీ నెట్‌వర్క్‌ ద్వారా హెచ్‌డీ క్వాలిటీ కలిగిన 100 సినిమాలను ఒక నిమిషంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కారులో లేదా విమానంలో ప్రయాణిస్తూ.. ఫోన్‌ ద్వారా వేర్వేరు సాంకేతికతలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. దీని వల్ల ఎంత దూరంలో ఉన్న డివైజ్‌లనైనా ఫోన్‌తో కంట్రోల్‌ చేయడంతోపాటు.. ఒకేసారి అధిక సంఖ్యలో వేర్వేరు గ్యాడ్జెట్‌లతో అనుసంధానం కావచ్చు. 6జీ నెట్‌వర్క్‌ వాస్తవిక ప్రపంచానికి, డిజిటల్‌ వరల్డ్‌కు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 

మరోవైపు 6జీ సేవలను ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ ఏక కాలంలో ప్రారంభించేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. శాంసంగ్‌, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు ఇప్పటికే 6జీ మీద ప్రయోగాలు చేస్తున్నాయి. టెక్‌ నిపుణుల అంచనా ప్రకారం 2028 - 2030 మధ్యలో 6జీ నెట్‌వర్క్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత జపాన్‌లో, ఆ తర్వాత దక్షిణ కొరియా, చైనా, ఫిన్‌లాండ్‌లో వస్తుందని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని