Gofirst crisis: గోఫస్ట్‌ ఆరోపణలపై ప్రాట్‌ అండ్‌ విట్నీ కౌంటర్‌..!

Gofirst crisis: ప్రాట్‌ అండ్‌ విట్నీ సంస్థ ఇంజిన్లు సకాలంలో సరఫరా చేయకపోవడంతో తమకు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయంటూ గోఫస్ట్‌ చేసిన ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది.

Updated : 03 May 2023 15:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బడ్జెట్‌ ధరలో విమాన సేవలు అందించే గోఫస్ట్‌ (Gofirst) విమాన సంస్థను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో మూడు రోజుల పాటు సర్వీసులను నిలిపివేసింది. స్వచ్ఛంద దివాలా ప్రక్రియ కోసం ఎన్‌సీఎల్‌టీని (NCLT) ఆశ్రయించింది. అమెరికాకు చెందిన ప్రాట్‌ అండ్‌ విట్నీ (P&W) సంస్థ సకాలంలో ఇంజిన్లను సరఫరా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని గోఫస్ట్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలను పీడబ్ల్యూ సంస్థ ఖండించింది. తమకు గోఫస్ట్‌ సంస్థ సకాలంలో చెల్లింపులు చేయని దాఖలాలు చాలా ఉన్నాయని తెలిపింది.

‘‘ప్రాట్ అండ్‌ విట్నీ సంస్థ ఎయిర్‌లైన్ కస్టమర్ల విజయానికి కట్టుబడి ఉంటుంది. మేం కస్టమర్లందరికీ డెలివరీ షెడ్యూల్‌ల విషయంలో ప్రాధాన్యతనిస్తూనే ఉన్నాం. గో ఫస్ట్‌కి సంబంధించిన మార్చి 2023 మధ్యవర్తిత్వ తీర్పును మా సంస్థ పాటిస్తోంది. ఇది న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఇంతకుమించి మేం ఏమీ మాట్లాడబోం’’ అని ప్రకటనలో పేర్కొంది. చెల్లింపుల వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.

ఇంజిన్ల సమస్యలతో గోఫస్ట్‌ సంస్థ 57 విమానాల్లో 28 కార్యకలాపాలు ఆపేయడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ఈ నెల 3, 4 తేదీల్లో సర్వీసులను నిలిపి వేయడంతో పాటు దివాలా పరిష్కార ప్రక్రియ కోసం ఎన్‌సీఎల్‌టీ దిల్లీ బెంచ్‌కి స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుంది. గోఫస్ట్‌కు అనుకూలంగా సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు అమెరికా ఇంజిన్ల సంస్థ ప్రాట్‌ అండ్‌ విట్నీ నిరాకరించడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఎన్‌సీఎల్‌టీ కనుక తమ దరఖాస్తును అంగీకరిస్తే, విమానాలు మళ్లీ నడుపుతామని సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రాట్‌ అండ్‌ విట్నీ తన స్పందనను తెలియజేసింది.

ఆ స్టాక్స్‌లో ర్యాలీ

గోఫస్ట్‌ దివాలా నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్ (Indigo), స్పైస్‌జెట్‌ (Spicejet) షేర్లు పరుగులు తీశాయి. గోఫస్ట్‌ దివాలా పరిష్కారానికి దరఖాస్తు చేయడం, మూడు రోజుల పాటు సర్వీసుల రద్దు నేపథ్యంలో ఈ స్టాక్స్‌కు కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈలో ఇండిగో షేరు 7.99 శాతం మేర లాభంతో 2,235 వద్ద ట్రేడవుతుండగా.. స్పైస్‌జెట్‌ షేరు సైతం 5.58 శాతం లాభంతో 33.25 వద్ద ట్రేడవుతోంది.

స్పైస్‌జెట్‌ విమానాల పునరుద్ధరణ

గోఫస్ట్‌ సేవల నిలిపివేత నిర్ణయంతో స్పైస్‌జెట్‌ (Spicejet) విమానాల పునరుద్ధరణకు సిద్ధమైంది. నేలకే పరిమితమైన 25 విమానాలను పునురుద్ధరించేందుకు రూ.400 కోట్లు సమీకరించామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్‌ గ్యారెంటీ స్కీమ్‌ ద్వారా ఈ నిధులు పొందినట్లు సంస్థ ఛైర్మన్‌, ఎండీ అజయ్‌ సింగ్‌ తెలిపారు. గోఫస్ట్‌ దివాలా తీసిన మరుసటి రోజే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని