TCS Recruitment scam: లంచాలకు ఉద్యోగాలు కుంభకోణంలో 16 మందిపై టీసీఎస్‌ వేటు!

TCS Recruitment scam: లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారని వచ్చిన ఆరోపణలపై TCS నాలుగు నెలల క్రితం కమిటీని నియమించింది. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న ఉద్యోగులపై వేటు వేసింది.

Published : 16 Oct 2023 11:04 IST

TCS Recruitment scam | ముంబయి: దేశీయ ఐటీ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)’ 16 మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు కంపెనీతో వ్యాపారం చేస్తున్న ఆరుగురు విక్రేతలను నిషేధించింది. ‘లంచాలకు ఉద్యోగాలు (TCS Recruitment scam)’ కుంభకోణంలో వీరి పాత్ర ఉన్నట్లు గుర్తించిన కంపెనీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈ వివరాలను టీసీఎస్‌ (TCS) ఆదివారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.

ఈ కుంభకోణం (TCS Recruitment scam)లో మొత్తం 19 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు టీసీఎస్‌ (TCS) గుర్తించింది. వీరిలో 16 మందిని తొలగించగా.. మరో ముగ్గురిని ‘రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌’ విధుల నుంచి బదిలీ చేసింది. ఆరుగురు విక్రేతలు సహా వారి అనుబంధ యజమానులు కంపెనీతో ఎలాంటి వ్యాపారం చేయకుండా నిషేధించింది. విక్రేతలతో కలిసి కొంత మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ ఏడాది జూన్‌లో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఉద్యోగులకు భారీ ఎత్తున ముడుపులు ముట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కంపెనీకి చెందిన ఓ ప్రజా వేగు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ విషయం బయటకు వచ్చింది. ప్రాథమిక దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కంపెనీ.. లోతైన విచారణకు కమిటీని నియమించింది. నాలుగు నెలల పాటు దర్యాప్తు జరిపిన సదరు కమిటీ ఇటీవలే నివేదికను సమర్పించింది. దాని ఆధారంగానే కంపెనీ చర్యలు చేపట్టింది.

ఈ కుంభకోణం (TCS Recruitment scam)లో మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని గుర్తించినట్లు టీసీఎస్‌ (TCS) వెల్లడించింది. ఈ స్కాంతో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని.. ఆర్థికంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. అందుకనుగుణంగా ఎప్పటికప్పుడు పాలనా విధానాల్లో మార్పులు చేస్తామని పేర్కొంది. రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలోని ఉద్యోగులను మారుస్తూ ఉంటామని తెలిపింది. ఉద్యోగులు సహా కంపెనీతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ ‘టాటా’ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో టీసీఎస్‌ రూ.11,342 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.10,431 కోట్లతో పోలిస్తే ఇది 8.7 శాతం అధికం. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక లాభంతో పోల్చినా 2.4 శాతం ఎక్కువ. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా రూ.59,692 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ఆర్జించింది. 2022-23 జులై-సెప్టెంబరు ఆదాయం రూ.55,309 కోట్లతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ. తన 6 లక్షల మందికి పైగా ఉద్యోగులను పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరినట్లు టీసీఎస్‌ ప్రకటించింది. వర్క్‌ ఫ్రం హోంకు స్వస్తి పలికినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది తాజా ఉత్తీర్ణుల (Freshers) నియామక లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. కంపెనీ ఇచ్చిన ఆఫర్‌ లెటర్లన్నిటినీ గౌరవిస్తామని.. వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం కొంత ఆలస్యమైనా, తప్పనిసరిగా అవకాశం ఇస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు